తెలంగాణలో అవినీతి అంటూ పవన్ ఆందోళన... బీఆరెస్స్ రియాక్షన్ ఇదే!
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ - జనసేన తరుపున పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పవన్ పొత్తు ఖరారు చేసుకుని, 8 చోట్ల పోటీ చేస్తున్న నేపథ్యంలో ప్రచార కార్యకరమాలకు తెరలేపారు. ఇందులో భాగంగా తాజాగా వరంగల్ లో జరిగిన బహిరంగ సభలో పవన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
అవును... తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా మైకందుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్... తెలంగాణ రాష్ట్రంలో అవినీతి జరుగుతుందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అవినీతి లేని, అందరినీ సమానంగా చూసే సామాజిక తెలంగాణ వుంటుందని కోరుకున్నట్టు ఆయన తెలిపారు. అది ఏ స్థాయిలో వుందో తనకంటే మీకే బాగా తెలుసని ప్రజలనుద్దేశించి పవన్ అన్నారు.
అంటే... తెలంగాణలో అవినీతి రాజ్యమేలుతుందని, సమానత్వం లేదని పవన్ చెప్పకనే చెప్పారని అంటున్నారు పరిశీలకులు. ఇదే క్రమంలో... ఇటీవల ప్రతిపక్ష పార్టీలో చేరిన ఒక నేత... కాంట్రాక్టర్లు ఎవరెవరికి ఎలా, ఎంతెంత శాతం అవినీతి డబ్బు ఇస్తారో బహిరంగంగానే చెప్పాడని అన్నారు. ఇలా మాట్లాడాలంటే భయపడేలా ప్రజల్లో చైతన్యం రావాలని ఆయన ఆకాంక్షించారు.
దీంతో... నిజంగా తెలంగాణలో అవినీతి జరిగిందనే సమాచారం పవన్ వద్ద ఉంటే.. నేరుగా బీఆరెస్స్ పేరు చెప్పి, కేసీఆర్ పేరు చెప్పి విమర్శించొచ్చు కదా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఏపీలో తనదైన శైలిలో ప్రసంగించే పవన్... తెలంగాణ ఎన్నికల ప్రచారంలో మాత్రం ప్రత్యర్థులను విమర్శించడానికి భయపడ్డాడనే కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. పైగా... వరంగల్ ఎన్నికల ప్రచారంలో కూడా ఏపీలో పాలనపై విమర్శలు గుప్పించడం కొసమెరుపు!
తెలంగాణలో అవినీతి ఏ స్థాయిలో ఉందో తనకంటే మీకే ఎక్కువ తెలుసు అని ప్రజలను ఉద్దేశించి పవన్ ప్రసంగించడంపై బీఆరెస్స్ కార్యకర్తలు విరుచుకుపడుతున్నారు. ఇందులో భాగంగా నాడు తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించి నేడు అమరుల బలిదానాల గురించి మాట్లాడటం సిగ్గనిపించడం లేదా అంటూ ఫైరవుతున్నారు.
ఇదే సమయంలో... గతంలో తెలంగాణలో పాలన అద్భుతమంటూ, సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అద్భుతంగా పురోగమిస్తున్నదని కీర్తించిన విషయాన్ని గుర్తుచేస్తున్న బీఆరెస్స్ శ్రేణులు... గతంలో కీర్తించిన అదే నోటితో అవినీతి, కమీషన్ల రాజ్యం అనడంపై ఎంత ధర పలికిందని ఎద్దేవా చేస్తున్నారు! నిన్నటివరకూ అభివృద్ధి తెలంగాణ అని చెప్పి.. ఇప్పుడు మోడీతో జతకట్టగానే కమీషన్ల తెలంగాణగా మారిపోయిందా? అని నిలదీస్తున్నారు.