ఉత్తరాంధ్రా నుంచి పవన్ పోటీ...!?

దానికి కారణం 2019 ఎన్నికలలో పవన్ రెండు చోట్ల పోటీ చేస్తే రెండు చోట్లా ఓటమి పాలు అయ్యారు.

Update: 2024-01-25 02:30 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అన్నది ఈ రోజుకీ సస్పెన్స్ గానే ఉంది. ఆయన పోటీ చేసే నియోజకవర్గాలు అంటే అయిదారు కళ్ల ముందు కనిపిస్తున్నాయి. అయితే వాటిలో కూడా పవన్ కంఫర్మ్ గా పోటీ చేస్తారు అని ఎవరూ చెప్పలేని స్థితి. అసలు పవన్ ఎందుకు తాను పోటీ చేసే సీటు విషయం బయటపెట్టడం లేదు అంటే అక్కడ అధికార వైసీపీ చేయాల్సిన ప్రయత్నాలు చేస్తూ ఓటమికి కృషి చేస్తుందని పవన్ ఆలోచన అని అంటున్నారు.

ఒక విధంగా ముందు జాగ్రత్త అని కూడా అనుకోవచ్చు. దానికి కారణం 2019 ఎన్నికలలో పవన్ రెండు చోట్ల పోటీ చేస్తే రెండు చోట్లా ఓటమి పాలు అయ్యారు. ఆ రకమైన చేదు అనుభవం ఆయనకు మిగిలి ఉంది. అందుకే ఈసారి సకల జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. అయితే జనసేనలో ఉన్న నాయకులు కొత్తగా వచ్చి చేరుతున్న నేతలు అందరూ కూడా పవన్ కళ్యాణ్ ని తమ ప్రాంతాల నుంచి పోటీ చేయమని కోరుతున్నారు.

తిరుపతి నుంచి పోటీ చేయమని కోరే వారు ఉంటే అనంతపురం జిల్లా నుంచి పోటీ చేయమని అడిగే వారు ఉన్నారు. ఇక కాంగ్రెస్ వైసీపీలో పనిచేసిన మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ అయితే పవన్ని ఉత్తరాంధ్రా నుంచి పోటీ చేయమని కోరుతున్నారు. ఆయన నియోజకవర్గం పేరు చెప్పలేదు కానీ ఎక్కడైనా పోటీ చేస్తే తామంతా తప్పకుండా ఆయన విజయానికి కృషి చేస్తామని అంటున్నారు.

పవన్ 2019లో ఉత్తరాంధ్రా ముఖ ద్వారం అయిన విశాఖ జిల్లా గాజువాక నుంచి పోటీ చేశారు ఓడిపోయారు. అయితే ఈసారి పరిస్థితి అంతలా ఉండదనే అంటున్నారు. జనసేన గ్రాఫ్ పెరిగింది. దాంతో పాటు టీడీపీతో పొత్తు ఉంటుంది కాబట్టి పవన్ ఎక్కడ పోటీ చేసినా గెలిచే చాన్స్ ఉంది.

మరి పవన్ విశాఖ నుంచి పోటీ చేస్తారా లేక విజయనగరం నుంచి బరిలోకి దిగుతారా. లేక ఉత్తరాంధ్రాలోనే అత్యంత వెనకబడిన శ్రీకాకుళం జిల్లా నుంచి పోటీకి రెడీ అంటారా అన్నది చూడాలి. ఏది ఏమైనా పవన్ ఉత్తరాంధ్రా నుంచి పోటీ చేస్తే మాత్రం రాజకీయం మరోసారి వేడెక్కడం ఖాయం. అంతే కాదు అటు అధికార పార్టీ కూడా ఉత్తరాంధ్ర మీద ఫోకస్ పెట్టింది.

తెలుగుదేశం ఆశలు అన్నీ కూడా ఉత్తరాంధ్రా మీదనే ఉన్నాయి. దాంతో ఏపీ మొత్తం రాజకీయం ఉత్తరాంధ్రా వైపు టర్న్ అవుతుంది. ఇంతకీ పవన్ ఉత్తరాంధ్రా వైపు మొగ్గు చూపుతారా లేక గోదావరి జిల్లాలలోనే పోటీ అని అంటారా అన్నది కూడా ఆలోచించాలి.


Tags:    

Similar News