సరిగ్గా వాడుకుంటే పవన్‌ కు ఇక తిరుగులేదు!

మరోవైపు ఇప్పటికి రాష్ట్ర జనాభాలో అత్యధికం గ్రామాల్లోనే నివసిస్తున్నారు.

Update: 2024-06-17 06:30 GMT

వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనంటూ చెబుతూ టీడీపీ, బీజేపీలతో కూటమి కట్టి దాన్ని అఖండ విజయం వైపు నడిపించారు.. జనసేనాని పవన్‌ కళ్యాణ్‌. ఆయన కృషికి, కష్టానికి తగ్గట్టే ఉప ముఖ్యమంత్రి పదవితోపాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా, పర్యావరణం, అడవులు, శాస్త్ర సాంకేతిక రంగాలు వంటి కీలక శాఖలు ఆయనకు దక్కాయి.

అంతేకాకుండా కష్టకాలంలో తనకు అండగా నిలబడినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు.. పవన్‌ రుణం తీర్చుకుంటున్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రిగా తన ఫొటోతోపాటు ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ చిత్రపటాలను కూడా ఏర్పాటు చేయాలని చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు.

కాగా పవన్‌ ఏరికోరి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, గ్రామీణ తాగునీటి సరఫరా వంటి శాఖలను తీసుకున్న సంగతి తెలిసిందే. ఇవన్నీ తన మనసుకు, జనసేన మూల సిద్ధాంతాలకు దగ్గరగా ఉన్నవని స్వయంగా ఆయనే చెప్పారు.

ఈ నేపథ్యంలో ఈ శాఖలను ఆయన సమర్థంగా నిర్వహిస్తే ఆయనకు రెండు విధాల మేలు ఉంటుందని అంటున్నారు. పవన్‌ పదో తరగతే చదివాడని, ఆయనకు అభివృద్ధి అంటే ఏంటో తెలియదని ప్రత్యర్థులు ట్రోల్స్‌ చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా తన సత్తాను చూపితే ఈ ట్రోల్స్‌ కు అడ్డుకట్ట పడుతుంది.

మరోవైపు ఇప్పటికి రాష్ట్ర జనాభాలో అత్యధికం గ్రామాల్లోనే నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, మినరల్‌ తాగునీరు, విద్యుత్‌ సౌకర్యాలు, మురుగునీటి పారుదల (డ్రైనేజీ) సౌకర్యాలు, సిమెంటు రోడ్లు, మొక్కల పెంపకం, ఇంటింటికి కుళాయిలు, రక్షిత తాగునీటి వ్యవస్థ ఇలాంటివన్నీ చేపట్టి గ్రామాలను అభివృద్ధి చేస్తే పవన్‌ కళ్యాణ్‌ కు మంచి ఇమేజ్‌ వస్తుందని చెబుతున్నారు.

అంతేకాకుండా కొన్ని జిల్లాలు, ప్రాంతాల్లో మాత్రమే బలంగా ఉన్న జనసేన పార్టీని రాష్ట్రమంతా విస్తరించే అవకాశం పవన్‌ కు తన శాఖల ద్వారా దక్కుతుందని అంటున్నారు. తన శాఖల ద్వారా గ్రామాలను అభివృద్ధిపథంలో నడిపితే అది అంతిమంగా జనసేన పార్టీకి మేలు చేకూరుస్తుందని చెబుతున్నారు.

ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో వైసీపీ బలంగా ఉంది. ఇటీవల ఆ పార్టీ సాధించిన 40 శాతం ఓట్లలో 90 శాతానికి పైగా గ్రామీణ ప్రాంతాల్లో సాధించినవే. ఈ నేపథ్యంలో వైసీపీని అధిగమించి గ్రామీణ ప్రాంతాల్లోనూ జనసేన జెండా రెపరెపలాడటానికి పవన్‌ ముందు సువర్ణాకాశం ఉందని అంటున్నారు.

తన శాఖల ద్వారా గ్రామాలను అభివృద్ధి చేయడంతోపాటు ప్రతి వారం ఒక గ్రామంలో పల్లె నిద్ర, రచ్చబండ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తే పవన్‌ ఇమేజ్, జనసేన గ్రాఫ్‌ పెరగడం ఖాయమని అంటున్నారు. తద్వారా పవన్‌ కు డబుల్‌ బెనిఫిట్స్‌ ఉంటాయని వక్కాణిస్తున్నారు.

Tags:    

Similar News