స్వాతంత్య్ర దినోత్సవంలో తొలిసారి పవన్.. ఏమన్నారంటే!
రాష్ట్రంలో కూడా ఎందరో స్వాతంత్య్ర సమరయోధులు ఉన్నారని.. వారి త్యాగాలు గుర్తు చేసుకోవాల్సి ఉందన్నారు.
78వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తొలిసారి పాల్గొన్నారు. అధికా రికంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొనడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. కాకినాడలో నిర్వహించిన కార్యక్రమంలో పవన్ పాల్గొని త్రివర్ణ పతకం ఎగురవేశారు. అనంతరం పోలీసులు గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ అధికారిక కార్యక్రమంలో తొలిసారి మాట్లాడుతూ.. స్వాతంత్య్రం కోసం ఎంతోమంది పోరాడారని.. స్వాతంత్య్ర అనంతరం దేశాన్ని ముందుకు నడిపిన మహనీయుల త్యాగాలు, సేవలు మరువలేనివన్నారు.
రాష్ట్రంలో కూడా ఎందరో స్వాతంత్య్ర సమరయోధులు ఉన్నారని.. వారి త్యాగాలు గుర్తు చేసుకోవాల్సి ఉందన్నారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ భవిష్యత్ తరాలకు బలమైన పునాదులు వేసేందుకు కృషి చేయాలన్నారు.అయితే.. ఇదే సమయంలో తన శాఖల గురించి కూడా పవన్ మాట్లాడారు. ప్రజా సంపద దుర్వినియోగం చేసిన వారిని ఎవరినీ వదిలిపెట్టమని హెచ్చరించారు. ప్రజలకు పెట్టాలే తప్ప.. వారి సొమ్మును, జాతి సందపదను తీసుకునే హక్కు ఎవరికీ లేదన్నారు.
గత వైసీపీ పాలనలో ఐదేళ్లుగా రాష్ట్రం అన్ని విధాలా నష్టపోయిందని పవన్ వ్యాఖ్యానించారు. ముఖ్యంగా రాష్ట్రంలో శాంతిభద్రతలు బూతద్దం పెట్టి వెతికినా కనపించలేదన్నారు. తననే నిలువరించారని, చంద్రబాబును జైల్లోపెట్టారని తెలిపారు. ఎక్కడికక్కడ నిర్బంధాలు, కేసులు, అరెస్టులు సాగాయన్నారు. దీనిని ప్రశ్నిస్తే.. వారిపైనా కేసులు పెట్టారని , అసలు కేసులు లేని మనుషులు లేకుండా పోయారని వ్యాఖ్యానించారు. తనకు పుంఖాను పుంఖాలుగా పిర్యాదులు అందాయని చెప్పారు.
ఇక, రాష్ట్రంలో గత ఐదేళ్లలో ఆర్థిక వ్యవస్థ అంపశయ్యపైకి చేరిందని పవన్ చెప్పారు. దీనిని సరిదిద్దేందుకు చంద్రబాబు రేయింబవళ్లు కష్టపడుతున్నారని చెప్పారు. శేషాచలం అడవుల్లో కొట్టేసిన ఎర్రచందనం కర్ణాటకలో అమ్ముకున్నారని.. దీని వెనుక ఎవరున్నా.. ఎంతటి వారైనా కూపీలాగి చట్టం ముందు నిలబెడతామన్నారు. `షణ్ముఖ వ్యూహం`తో రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తామన్నారు. పాఠశాలల్లో చిన్నారులకు అందించే మధ్యాహ్న భోజనానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టడం సంతోషంగా ఉందన్నారు.