కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య ఏసీబీ 'బ్లాక్ బ్యాగ్'.. ఆ కేసును కెలికినట్లే

రాజకీయాల్లో ‘డబ్బు సంచుల’ ఆరోపణలు సహజమే.. నిజమో కాదో కానీ.. ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ప్రతిపక్షం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటుంది

Update: 2025-01-10 19:30 GMT

రాజకీయాల్లో ‘డబ్బు సంచుల’ ఆరోపణలు సహజమే.. నిజమో కాదో కానీ.. ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ప్రతిపక్షం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఢిల్లీ డబ్బు సంచులు మోస్తున్నారంటూ విపక్షాలు మండిపడేవి.. వేరే రాష్ట్రాల్లో ఎన్నికలకు ఇక్కడినుంచే డబ్బు సర్దుబాటు చేస్తున్నారంటూ ఆరోపించేవి. కాగా, గత పదేళ్లలో తొమ్మిదేళ్లు తెలంగాణలో రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో లేకపోవడంతో డబ్బు సంచుల ఆరోపణలు వినిపించాయి.

ఆ నల్ల సంచి..

తెలంగాణ కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య ఇప్పడు ‘బ్లాక్ బ్యాగ్’ వార్ నడుస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఫార్ములా ఈ రేస్ కేసు నమోదు, విచారణల నేపథ్యంలో రాజకీయం బాగా వేడెక్కింది. ఓవైపు కేటీఆర్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) విచారణకు హాజరై తనను అక్కడ అడిగేందుకు ఏమీ లేక, తిప్పితిప్పి ఒకటే ప్రశ్నలు అడిగారని చెబుతున్నారు. కాంగ్రెస్ వారు మాత్రం కేటీఆర్ దొరికిన దొంగ అని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు వీటి మధ్యలోకి బ్లాక్ బ్యాగ్ వచ్చింది.

దానిలో ఏముంది?

‘‘పదేళ్ల నుంచి దుమ్ము పట్టిన ఓ నల్ల బ్యాగు ఏసీబీ కార్యాలయంలో ఉంది. ఆ బ్యాగ్ ఎవరిదో చెప్పుకోండి చూద్దాం’’ అంటూ బీఆర్ఎస్ ట్వీట్ చేసింది. అయితే, దీనిపై అధికార కాంగ్రెస్ పార్టీ దీటుగా స్పందించింది. ‘‘ఆ నల్లబ్యాగులో 2014-23 మధ్య మీరు చేసిన పాపాల చిట్టా దాగి ఉంది. ఆ బ్యాగును చూసే తెల్ల మొహం వేశారా కేటీఆర్? బీఆర్ఎస్ దోపిడీ దొంగల అవినీతి వివరాలు నింపడానికి ఆ బ్యాగు సరిపోదు. కేటీఆర్ విచారణకు వెళ్లిన ప్రతిసారీ బ్యాగులను లెక్కించమని చెప్పండి’’ అంటూ గట్టి కౌంటర్ ఇచ్చింది.

ఇదీ అసలు లోగుట్టు..

కాంగ్రెస్-బీఆర్ఎస్ ‘బ్లాక్ బ్యాగ్’ ట్వీట్ ల వెనుక పెద్ద కథే ఉంది. లోతుగా ఆలోచించినవారికి కానీ ఇది అర్థం కాదు. అదేమంటే.. 2015లో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే ఓటు కొనుగోలుకు ప్రయత్నించారన్న ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. ఇదే ఓటుకు నోటు కేసుగా బాగా పాపులర్ అయింది. ‘నల్ల సంచి’లో డబ్బు ఇస్తున్నట్లుగా వీడియోలో ఉంది. ఇక ఈ కేసులో ఏసీబీ అరెస్టు చేయడంతో రేవంత్ జైలుకు కూడా వెళ్లిన సంగతి తెలిసిందే. దీనిని ఉద్దేశించే బీఆర్ఎస్ ‘నల్ల సంచి’ ట్వీట్ పెట్టింది. కేటీఆర్ ప్రస్తుతం ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ విచారణ ఎదుర్కొంటున్న సంగతిని గుర్తు చేస్తూ కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ పాలనలోని అవినీతిని చాటేదే ఆ ‘నల్ల సంచి’ అని బదులిచ్చింది.

Tags:    

Similar News