పవన్ చూపు తూర్పు వైపు ...!?
అయితే ఎవరూ ఊహించని విధంగా ఉమ్మడి క్రిష్ణా జిల్లాలోని విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం పేరు ప్రచారంలోకి వస్తోంది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అన్నది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. పవన్ భీమవరం గాజువాకల నుంచి 2019 ఎన్నికల్లో పోటీ చేశారు. ఈసారి కూడా పవన్ భీమవరం నుంచి పోటీకి దిగవచ్చు అని ప్రచారం సాగుతోంది. అదే విధంగా పరిశీలనలో పిఠాపురం తిరుపతి కూడా ఉన్నాయని అంటున్నారు.
అయితే ఎవరూ ఊహించని విధంగా ఉమ్మడి క్రిష్ణా జిల్లాలోని విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం పేరు ప్రచారంలోకి వస్తోంది. ఇక్కడ నుంచి పవన్ పోటీ చేస్తారని అంటున్నారు. దానికి కారణాలు ఉన్నాయని తెలుసోంది.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ గెలిచింది. ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం తరఫున ఎలమంచిలి రవి పోటీచేసి విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో కూడా జనసేనకు 30 వేల దాకా ఓట్లు వచ్చాయంటేనే బలం ఉందని తెలుస్తోంది.
సామాజిక సమీకరణలు చూస్తే ఈ నియోజకవర్గంలో కాపుల ఓట్లు 45 వేలకు తక్కువ కాకుండా ఉన్నాయని అంటున్నారు. ఇదిలా ఉంటే బీసీలు కూడా ఈ నియోజకవర్గంలో ఎక్కువగానే ఉన్నారు. దాంతో పాటు కమ్మల ప్రభావం గట్టిగానే ఉంది.
ఇక ఈ నియోజకవర్గంలో ఎక్కువ సార్లు గెలిచిన కుటుంబం కూడా వంగవీటిది అని అంటారు. 1985లో ఇక్కడ నుంచి వంగవీటి రంగా గెలిచారు. ఆ తరువాత ఆయన సతీమణి రెండు సార్లు గెలిచారు. ఇక వంగవీటి రాధా 2004లో ఇక్కడ నుంచి గెలిచారు.
ఇలా వంగవీటి ఫ్యామిలీని గెలిపించిన సీటుగా ఉంది. దాంతో కూడా జనసేన చూపు ఈ సీటు మీద ఉంది అని అంటున్నారు. ఇక 2014, 2019లలో రెండు సార్లు టీడీపీ విజయవాడ పశ్చిమ నుంచి గెలిచింది. ఆ పార్టీ తరఫున గద్దె రామ్మోహన్ రావు గెలిచారు.
ఇపుడు పొత్తులో భాగంగా ఈ సీటుని కనుక జనసేనకు ఇస్తే పెనమలూరుకి రామ్మోహనరావుని పంపిస్తారు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే ఈ సీటు జనసేనకు ఇస్తారని అంటున్నారు. దాంతో ఏకంగా పవన్ కళ్యాణే బరిలో ఉంటే బాగుంటుంది అని ఆ పార్టీ వారు భావిస్తున్నారుట.
పవన్ సైతం ఈ సీటు మీద ఫోకస్ పెట్టారని అంటున్నారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పవన్ ఇదే నియోజకవర్గం నుంచి తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు. మొత్తానికి చూస్తే పవన్ కనుక విజయవాడ తూర్పు నుంచి పోటీ చేస్తే ఆ ప్రభావం మొత్తం జిల్లా మీద ఉంటుందని కూడా జనసేనలో టాక్ నడుస్తోంది.
అయితే ఇవన్నీ ఊహాగానాలే తప్ప పవన్ ఎక్కడ నుంచి పోటీ చేస్తున్నారు అన్నది ఈ రోజుకీ రివీల్ చేయడంలేదు. ముందుగా ప్రక్టిస్తే వైసీపీ తన శక్తియుక్తులు అన్నీ అక్కడ పెట్టి పవన్ ని ఓడించేందుకు చూస్తుందని కూడా ఆ పార్టీ అనుమానిస్తూ వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తోంది అని అంటున్నారు. చూడాలి మరి పవన్ చూపు తూర్పు వైపు ఉందా లేదా అన్నది.