అన్నా క్యాంటీన్లకు డొక్కా సీతమ్మ పేరు పవన్ ఏమన్నారంటే ?

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నా క్యాంటీన్లలో కొన్నింటికి అయినా అన్న దాత డొక్కా సీతమ్మ పేరు పెట్టాలని కోరారు.

Update: 2024-08-07 13:57 GMT

జనసేన అధినేత టీడీపీ కూటమిలో సహ భాగస్వామి ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చాక తొలిసారి తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో ఇటీవల పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నా క్యాంటీన్లలో కొన్నింటికి అయినా అన్న దాత డొక్కా సీతమ్మ పేరు పెట్టాలని కోరారు.

అయితే గతంలో అన్నా క్యాంటీన్లు అని ఎన్టీఆర్ పేరుతోనే టీడీపీ వాటిని నడిపింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సూచనల మేరకు అందులో కొన్నిటిని డొక్కా సీతమ్మ పేరు పెడతారా అసలు ఈ పేర్ల తకరారు రెండు పార్టీల మధ్య ఏమైనా గ్యాప్ క్రియేట్ చేస్తుందా అని అంతా అనుకున్నారు.

అయితే ఈ మధ్యలో విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ తన పరిధిలోని పధకాలలో ఒకటి అయిన మధ్యాహ్న భోజన పధకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టారు. దాని మీద పవన్ హర్షం వ్యక్తం చేశారు. ఇక ఈ నెల 15 నుంచి అన్నా క్యాంటీన్లు వంద దాకా ఏపీలో ఒకేసారి ప్రారంభం కాబోతున్నాయి. మరి వాటిలో డొక్కా సీతమ్మ పేరు ఎక్కడైన పెడుతున్నారా అన్న చర్చకు తెర లేచింది. అయితే ఈ చర్చకు కారణమైన పవనే ఇపుడు చాలా అర్ధవంతంగా దానిని ముగించారు. మధ్యాహ్న భోజన పధకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టారు కాబట్టి అన్నా క్యాంటీన్లకు అన్న నందమూరి తాకర రామారావు పేరు పెట్టడమే సబబు అని ఆయన అన్నారు.

రెండు రూపాయలకు కిలో బియ్యం పధకాన్ని తెచ్చిన అన్న గారి పేరుతో పేదలకు పట్టెడు అన్నం పెట్టడం మంచి ఆలోచన అన్నారు. డొక్కా సీతమ్మ పేరుని చదువుకునే విద్యార్థులు ఉండే పాఠశాలలో మధ్యాహ్న భోజన పధకానికి పెట్టడం మరింత సబబు అన్నారు. వారే రేపటి భావి భారత పౌరులు అని పవన్ అన్నారు. వారు డొక్కా సీతమ్మ లాంటి ప్రముఖుల గురించి వారి దాన వితరణ గురించి తెలుసుకుని స్పూర్తి పొందే అవకాశం ఉంటుందని అన్నారు.

తాను చదువుకునే రోజులలో పాఠాంశ్యాలలో డొక్కా సీతమ్మ గురించి చదివి ఆమె గురించి తెలుసుకున్నాను అని అలా స్పూర్తి పొందాను అని పవన్ చెప్పారు. దీంతో పవన్ కళ్యాణ్ అన్నా క్యాంటీన్లకు అన్న గారి పేరుకు ఓకే చెబుతూ ఈ చర్చకు ఫుల్ స్టాప్ పెట్టించారు అని అంటున్నారు.

ఇదిలా ఉంటే గతంలో టీడీపీ నుంచి వేరు పడి సొంతంగా 2019 ఎన్నికల్లో జనసేన పోటీ చేసినపుడు పవన్ కళ్యాణ్ అన్నీ రాజకీయ నేతల పేర్లేనా దేశం కోసం జాతి కోసం పనిచేసే వారి పేర్లు పెట్టరా అని విమర్శించారు. ఇక ఉప ముఖ్యమంత్రిగా కూడా ఆయన ఇదే విధంగా సూచనలు చేశారు. ఇపుడు మధ్యాహ్న భోజన పధకంతో పాటు ఇతర పధకాలకు ప్రముఖుల పేర్లు పెట్టడంతో ఆయన సంతృప్తి చెందారు అని అంటున్నారు.

అయితే పవన్ సంతృప్తి చెందినా చాలా మంది కోరేది ఏంటి అంటే ఇంకా అనేక మంది ప్రముఖుల పేర్లు వివిధ పధకాలకు పెట్టాలని. అలాగే ఆంధ్రుల కోసం పాటుపడిన గొప్ప నేతలు ఎంతో మంది ఉన్నారు. వారి పేర్లతో పధకాలను ప్రారంభిస్తే జనాలకు కూడా ఆ స్ఫూర్తి ఉంటుదని అంటున్నారు. ఏది ఏమైనా పవన్ సూచనను టీడీపీ అన్నా క్యాంటీన్లకు కాకుండా వేరే రూపంలో తీర్చింది. దానికి పవన్ కూడా ఓకే అన్నారు. సో కూటమి ఒకే మాట మీద వెళ్తోంది అనడానికి ఇంతకంటే వేరే నిదర్శనం ఏమి కావాలని అంటున్న వారూ ఉన్నారు.

Tags:    

Similar News