ఇదే ఆఖరి ప్రయత్నమా ?
అందుకనే పవన్ ఎవరికీ చెప్పకుండా రోడ్డుమార్గాన విజయవాడకు బయలుదేరారు. అయితే శివారుప్రాంతాల్లో పవన్ కాన్వాయ్ ను పోలీసులు అడ్డుకున్నారు
జగన్మోహన్ రెడ్డిపై ఫిర్యాదులు చేయటానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ తొందరలోనే ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. నరేంద్రమోడీ, అమిత్ షా అపాయిట్మెంట్ కావాలని కోరినట్లు పార్టీవర్గాలు చెప్పాయి. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబునాయుడు అరెస్టును పవన్ తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే. చంద్రబాబు అరెస్టు కాగానే హైదరాబాద్ లో ఉన్న పవన్ విజయవాడకు బయలుదేరారు. ఇందుకోసం ఛార్టెట్ విమానాన్ని కూడా రెడీచేసుకున్నారు. అయితే వియవాడ విమానాశ్రయాధికారులకు పోలీసులు చేసిన విజ్ఞప్తి కారణంగా పవన్ రావాలని అనుకున్న విమానానికి ల్యాండింగ్ అనుమతి ఇవ్వలేదు.
అందుకనే పవన్ ఎవరికీ చెప్పకుండా రోడ్డుమార్గాన విజయవాడకు బయలుదేరారు. అయితే శివారుప్రాంతాల్లో పవన్ కాన్వాయ్ ను పోలీసులు అడ్డుకున్నారు. దాంతో పవన్ రోడ్డుమీదే పడుకుని నానా రచ్చచేశారు. చంద్రబాబు అక్రమ అరెస్టుతో పాటు తనను పోలీసులు నియంత్రించటంపైన కూడా పవన్ ఫిర్యాదులు చేయబోతున్నారు. గడచిన నాలుగున్నరేళ్ళుగా జగన్ పరిపాలనా తీరును వివరించాలని పవన్ పెద్ద చిట్టానే రెడీ చేసుకున్నారట.
అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే నరేంద్రమోడీ, అమిత్ షా కు నేరుగా ఫిర్యాదులు చేస్తేకానీ ఉపయోగం ఉండదు. వాళ్ళేమో పవన్ను కలవటానికి ఏమాత్రం ఇష్టపడటంలేదు. గడచిన ఏదేళ్ళుగా పవన్ ఎన్నిసార్లు అడిగినా మోడీ అపాయిట్మెంట్ ఇవ్వటంలేదు. ఇదే సమయంలో అమిత్ షా కూడా కలవటానికి ఆసక్తి చూపలేదు. దాంతో ఒకటిరెండుసార్లు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయి వచ్చేశారు.
ఈమధ్య ఎన్డీయే పార్టనర్స్ సమావేశం జరిగింది కాబట్టే అమిత్ తో పవన్ భేటీ అవగలిగారు. మరిలాంటి పరిస్ధితుల్లో మోడీ, షాలు పవన్ కు అపాయిట్మెంట్ ఇస్తారా అన్నది ఆసక్తిగా మారింది. జగన్ కు వ్యతిరేకంగా పవన్ అయితే పెద్ద చిట్టానే రెడీచేసుకున్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. కలిసే అవకాశం రావటమే ఆలస్యం జగన్ వ్యతిరేక ఫిర్యాదులతో పవన్ రెడీగా ఉన్నారు. మరి ఢిల్లీ పర్యటనలో పవన్ ఏమిచేస్తారన్నది చూడాలి. బహుశా ఈ ప్రయత్నమే మోడీ, షాలను కలిసేందుకు చేసే ఆఖరి ప్రయత్నమనే ప్రచారం కూడా పార్టీలో జరుగుతోంది. మరి ఏమి జరుగుతుందో చూడాల్సిందే.