అవనిగడ్డ పవన్ సభకు వచ్చింది 300 మందేనా?

అవనిగడ్డలో పవన్ నిర్వహించిన సభ అట్టర ప్లాప్ అయ్యిందన్న ఆయన.. ఈ సభకు 300 మంది కూడా రాలేదంటూ మండిపడ్డారు

Update: 2023-10-04 04:12 GMT

వారాహి విజయాత్ర సిరీస్ లో భాగంగా మరోసారి వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఉమ్మడి క్రిష్ణాజిల్లాలో పర్యటిస్తున్న ఆయన.. ఎప్పటిలానే ఏపీ ప్రభుత్వం పైనా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీదా పెద్ద ఎత్తున మాటల దాడికి పాల్పడుతున్నారు. ప్రభుత్వం చేయాల్సిన పని చేయట్లేదని చెబుతున్న పవన్.. పలు అంశాల్ని తన ప్రసంగంలో భాగంగా తీసుకొస్తున్నారు. అవనిగడ్డలో నిర్వహించిన సభను ఉద్దేశించి మంత్రి జోగి రమేశ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

అవనిగడ్డలో పవన్ నిర్వహించిన సభ అట్టర ప్లాప్ అయ్యిందన్న ఆయన.. ఈ సభకు 300 మంది కూడా రాలేదంటూ మండిపడ్డారు. టీడీపీ.. జనసేన రెండు పార్టీలు జత కట్టిన తర్వాత నిర్వహించిన మొదటి సభ ఇంత అట్టర్ ప్లాప్ కావటం ఏమిటి? అంటూ మంత్రి జోగి ప్రశ్నిస్తున్న ప్రశ్నలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. పెడనలో నిర్వహించే సభపై దాడి జరుగుతుందని పవన్ వ్యాఖ్యానించటాన్ని మంత్రి తప్పు పట్టారు.

పవన్ సభకు రావాలని జనసేన.. టీడీపీ క్యాడర్ కు ఫోన్ చేసి మరీ పిలిస్తే 300 మందికి మించి రాలేదన్న జోగి.. జనసేన అలా చతికిలపడటానికి కారణం.. టీడీపీతో జట్టు కట్టటమేనంటూ తనదైన విశ్లేషణను చెప్పుకొచ్చారు. పెడన ప్రజలు శాంతికాముకులన్న జోగి.. అలాంటి ఊరి మీద పవన్ అలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. మంత్రి జోగి ఇక్కడ మిస్ అవుతున్న పాయింట్ ఏమంటే.. పెడనలో తన సభ మీద దాడికి ప్లానింగ్ జరుగుతుందనే జనసేననాని చెప్పారే తప్పించి.. పెడన ప్రజల మీద పవన్ ఎలాంటి కామెంట్ చేయలేదని గుర్తు చేస్తున్నారు.

అవనిగడ్డ సభకు వేలాది మంది రావటం.. దీనికి సంబంధించిన వీడియోలు పెద్ద ఎత్తున వైరల్ అయిన వేళలోనూ.. పవన్ సభకు 300 మందే వచ్చారంటూ పేర్కొనటం సరికాదంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో లైవ్ లు.. వీడియోలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న అంశాన్ని తప్పుగా కోట్ చేస్తే.. మంత్రి జోగికే ఇబ్బంది అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పవన్ చేసే వ్యాఖ్యల్లోని లోపాల్ని ఎత్తి చూపాలే కానీ.. జనం రాలేదు లాంటి నిరూపించలేని తప్పుల్ని ఎత్తి చూపించటం వల్ల అభాసు పాలు అవుతారన్న విషయాన్ని మంత్రి ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది.

Tags:    

Similar News