పవన్ కళ్యాణ్ కు పోలీసుల నోటీసులు!
జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కృష్ణా జిల్లాలో 4వ విడత వారాహి యాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే
జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కృష్ణా జిల్లాలో 4వ విడత వారాహి యాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీతో పొత్తు కుదిరాక నిర్వహించాక ఈ యాత్ర చేస్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇందులో భాగంగా మొదటి సభను అవనిగడ్డలో పవన్ నిర్వహించారు. ఆ తర్వాత రెండు రోజులపాటు మచిలీపట్నంలో పవన్ బస చేశారు. ప్రజల సమస్యలపై జనవాణి కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మచిలీపట్నంలోనే టీడీపీకి చెందిన ఏడు నియోజకవర్గాల ఇంచార్జులు వచ్చి పవన్ ను కలిశారు. కాగా తదుపరి పెడనలో పవన్ కళ్యాణ్ బహిరంగ సభను నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ సంచలన ఆరోపణలు చేశారు. తాను పెడనలో నిర్వహించనున్న సభను భగ్నం చేయడానికి వైసీపీ క్రిమినల్స్ ను దించుతోందని విమర్శించారు. రాళ్లతో దాడి చేయడానికి క్రిమినల్స్ సిద్ధంగా ఉన్నారని తనకు సమాచారం అందిందన్నారు. టీడీపీ, జనసేన శ్రేణులు ఈ విషయంలో జాగ్రత్త వహించాలని పవన్ కోరారు. ఈ నేపథ్యంలో పవన్ ఆరోపణలు సంచలనం సృష్టించాయి.
ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పై పెడన ఎమ్మెల్యే, ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేశ్ మండిపడ్డారు. పవన్ సభను అడ్డుకోవాల్సిన అవసరం తమకేముందని నిలదీశారు. పెడన ప్రజలు శాంతికాముకులని తెలిపారు. గొడవలు సృష్టించడం, వాటిని తమ పార్టీపైనే వేయడమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అవనిగడ్డ సభ విఫలమైందని.. ప్రజలెవరూ రాలేదని దీంతో పవన్ లో దిగులు పట్టుకుందని జోగి వ్యాఖ్యానించారు.
మరోవైపు పవన్ ఆరోపణల నేపథ్యంలో ఆయనకు కృష్ణా జిల్లా పోలీసులు నోటీసులు ఇచ్చారు. మీ ఆరోపణలకు సాక్ష్యాలు ఏవైనా ఉన్నాయా? ఉంటే అందుకు ఆధారాలు చూపాలని అని పవన్ కు నోటీసులు ఇచ్చినట్లు జిల్లా ఎస్పీ జాషువా వెల్లడించారు.
సభలో దాడులు జరుగుతాయనే సమాచారం మీకు ఎక్కడి నుంచి వచ్చిందనేది తమకు తెలియపరచాలని నోటీసుల్లో కోరామని ఎస్పీ జాషువా వెల్లడించారు. తాము పంపిన నోటీసులకు పవన్ నుంచి ఎలాంటి రిప్లై రాలేదన్నారు. రిప్లై రాలేదంటే ఆయన నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారాని అనుకోవాలా? అని ఎస్పీ ప్రశ్నించారు.
ఎటువంటి సమాచారంతో పవన్ ఈ వ్యాఖ్యలు చేశారని ప్రశ్నించారు. పైగా.. పవన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. మీరు తిరగబడి కాళ్ళు చేతులు కట్టేయండంటూ జనసేన పార్టీ శ్రేణులకు పవన్ పిలుపు ఇచ్చారని.. అందుకే ఆయనకు నోటీసులు జారీ చేశామని ఎస్పీ జాషువా వెల్లడించారు.
సరైన ఆధారాల్లేకుండా వ్యాఖ్యలు, ఆరోపణలు చేయకూడదని ఎస్పీ సూచించారు. బాధ్యతారాహిత్యంగా ఆరోపణలు చేస్తే పర్యవసానాలు ఉంటాయని హెచ్చరించారు. రెచ్చగొట్టే భాష, సైగలు మానుకుని మాట్లాడాలన్నారు. తమ సమాచార వ్యవస్థ తమకుందన్నారు. పవన్ కంటే నిఘా వ్యవస్థ తమకు బలంగా ఉందని ఎస్పీ జాషువా తెలిపారు. అసాంఘిక శక్తులుంటే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.