పత్తాలేకుండా పోయిన జనసేన!
అయినప్పటికీ.. కూకట్ పల్లి ప్రజలు జనసేనను పట్టించుకోలేదు. బీఆర్ ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే కు ఇక్కడి ప్రజలు జై కొట్టారు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాల నుంచి పోటీ చేసిన జనసేన పార్టీ పత్తాలేకుండా పోయింది. బీజేపీతో చేతులు కలిపిన జనసేన అధినేత అతి కష్టం మీద.. ఎనిమిది స్థానాలు దక్కించుకున్నారు. అయితే.. తాజాగా వెల్లడవుతున్న ఫలితాల్లో జనసేన అభ్యర్థుల దూకుడు ఎక్కడా కనిపించకపోగా.. కనీసం వారి మాట కూడా వినిపించడం లేదు.
ఎక్కడ గెలిచినా.. గెలవకపోయినా.. కూకట్‌పల్లిపై జనసేన అధినేత ఆశలు పెట్టుకున్నారు. ఇక్కడ సీమాంధ్రుల ఓట్లు ఎక్కువగా ఉండడం.. సెటిలర్లు.. భారీగా ఉండడంతో ఇక్కడ గెలిచి తీరుతామనే రీతిలో జనసేన ఆశలు పెట్టుకుంది. రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన ప్రముఖ వ్యాపార వేత్తకు టికెట్ ఇచ్చారు. అంతేకాదు.. ఏకంగా పవన్ మూడు సార్లు ఇక్కడ ప్రచారం చేశారు.
అయినప్పటికీ.. కూకట్ పల్లి ప్రజలు జనసేనను పట్టించుకోలేదు. బీఆర్ ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే కు ఇక్కడి ప్రజలు జై కొట్టారు. రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో బీఆర్ ఎస్ అభ్యర్థులు వెనుకబడగా.. ఇక్కడ మాత్రం బీఆర్ ఎస్ అభ్యర్థి మాదవరం కృష్ణారావు ఏకంగా 9 వేల మెజారిటీతో దూసుకుపోతున్నారు. జనసేన అభ్యర్థి ప్రేమ్ కుమార్ నాలుగో స్థానంలో కేవలం 1500 ఓట్లతో ఉండడం గమనార్హం.