పవన్ కళ్యాణ్ అనే నేను అని అంటారా....?
సినీ సెలిబ్రిటీ పొలిటికల్ లీడర్ అయిన పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో తన సత్తా చాటుతారా అన్నది ఇపుడు చర్చకు వస్తోంది
సినీ సెలిబ్రిటీ పొలిటికల్ లీడర్ అయిన పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో తన సత్తా చాటుతారా అన్నది ఇపుడు చర్చకు వస్తోంది. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి పదేళ్ళు అవుతోంది. 2024 మార్చి 14న ఆయన హైదరాబాద్ వేదికగా పార్టీ పెట్టారు. తొలి ఎన్నికల్లో పోటీ చేయకుండా బిగ్ మిస్టేక్ చేశారు. 2019లో పోటీ చేసినా కూడా రెండు నియోజకవర్గాలలో ఓటమి పాలు అయ్యారు. గత పదేళ్ళుగా చూస్తే పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేయడంలో మాత్రం జనసేన ఎక్కడా శ్రద్ధ వహించలేదని అంటున్నారు.
దాంతో ఈసారికి పొత్తులే శరణ్యం అయ్యాయని చెబుతున్నారు. టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకుంది. అయితే ఈ పొత్తు ఎవరికి లాభం అన్న చర్చ కూడా మొదలైపోయింది. పవన్ జనసేన తమకు మేలు చేస్తుందా లేదా అన్న చర్చ కూడా టీడీపీలో ఉందని అంటున్నారు. ఇక నారా లోకేష్ అయితే చంద్రబాబు సీఎం అని స్పష్టంగా చెప్పారు. బాబు కాకుండా ఎవరు అవుతారు అసలు రెండవ ఆలోచన లేదని అన్నారు.
బాబు సీఎం కావడమే కాదు అయిదేళ్ళ పాటు ఆయనే పవర్ లో ఉంటారు అని చెప్పేశారు. మరి పవన్ సీఎం అన్న జనసేన క్యాడర్ కి దీంతో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో జనసేనకు టీడీపీ ఎన్ని సీట్లు ఇస్తుంది అన్నది కూడా చర్చగా ఉంది. ఇచ్చిన సీట్లలో గెలుపు అవకాశాలు ఎన్ని అన్న డౌట్ కూడా ఏర్పడుతోంది.
ఎందుకంటే టీడీపీ జనసేనకు బలమున్నవి కోరిన సీట్లు ఇవ్వక పోవచ్చు అన్న ప్రచారం కూడా ఊపందుకోవడంతో జనసేన శ్రేణులలో మధనం చెలరేగుతోంది. దానికంతటికీ కారణం నారా లోకేష్ తాజాగా చేసిన కామెంట్స్ అని అంటున్నారు బాబే సీఎం అంటే జనసేనను ఎక్కడా పరిగణనలోకి తీసుకోలేదు అని అంటున్నారు.
ఇక దీనికంటే ముందు మరో ముచ్చట జరిగింది. విజయనగరం జిల్లాలో జరిగిన యువగళం ముగింపు సభంలో ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు అయితే టీడీపీ సొంతంగానే 160 సీట్లను గెలుచుకుంటుంది అని చెప్పేశారు. పవన్ సభలో వేదిక మీద ఉండగానే అచ్చెన్న ఈ రకమైన స్టేట్మెంట్ ఇచ్చారు అంటే చంద్రబాబు అండ లేకపోతే జరుగుతుందా అని అంటున్నారు. అంటే మొత్తం 175లో జనసేనకు పదిహేను సీట్లు ఇవ్వడానికి ఫిక్స్ అయి 160 సీట్లు టీడీపీకి అని అచ్చెన్న నోట మాట వచ్చింది అని అంటున్నారు
పోనీ పదిహేను సీట్లు అనుకున్నా ఆ ఇచ్చే సీట్లు కూడా టీడీపీ ఎపుడూ గెలవని సీట్లను ఎంచి మరీ ఇస్తారని కూడా అంటున్నారు. అదే కనుక జరిగితే జనసేనకు ఎన్ని సీట్లలో గెలుపు దక్కుతుంది అన్న చర్చ ఒక వైపు ఉంటే ఈసారి అయినా పవన్ ఎమ్మెల్యేగా గెలుస్తారా అన్న పెద్ద డౌట్ కూడా ఆ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.
పవన్ పరిస్థితి ఎలా ఉంది అంటే సినిమాల్లో పవర్ స్టార్. కానీ పాలిటిక్స్ లో మాత్రం ఒక దశాబ్ద కాలంగా పోరాడుతున్నా కూడా ఎమ్మెల్యే కాలేకపోయారు. అది ఆయనకు పొలిటికల్ గా అదే బ్యాడ్ లక్ గా మారుతోంది. ప్రత్యర్ధి పార్టీలు సైతం విమర్శించే ఆయుధంగా మారుతోంది.
ఈ నేపధ్యంలో ఎంతో నమ్మకంతో టీడీపీతో పొత్తు కుదుర్చుకుంటే ఆ వైపు నుంచి అంతే నమ్మకం విశ్వాసం కనిపించడంలేదు అని అంటున్నారు. జనసేనకు ఇచ్చే సీట్లలో టీడీపీ ఓట్లు బదిలీ చేసి గెలిపిస్తారా అన్న అనుమానాలు కూడా పెరిగిపోతున్నాయట. మరీ ముఖ్యంగా పవన్ పోటీ చేసే చోట టీడీపీ ఓట్లు ట్రాన్స్ ఫర్ కాకపోతే పవన్ ఎమ్మెల్యే గా ఈసారి అయినా అసెంబ్లీలో అడుగుపెడతారా అన్నది కూడా సందేహంగా ముందుకు వస్తోంది అంటున్నారు
ఇవన్నీ కూడా టీడీపీ వ్యవహరిస్తున్న వైఖరి వల్లనే వస్తున్న డౌటానుమానాలు అంటున్నారు. పవన్ అను నేను అని సీఎం గా ప్రమాణం చేస్తారు అనుకుంటే తూచ్ అనేసారు నారా లోకేష్. ఇపుడు ఎమ్మెల్యే అయినా అసెంబ్లీలో ప్రమాణం చేసే చాన్స్ ఉందా అన్నదే పెద్ద ప్రశ్నగా ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.