అద్గదీ పవన్ 'పవర్' అంటే..!

కూటమిలో మిత్రపక్షంగా ఉన్నప్పటికి అధికార పక్షమనే మర్రిచెట్టు నీడలో విశ్రాంతి తీసుకోవటమే తప్పించి.. తమ సత్తా చాటుకునే రాజకీయ మిత్రపక్షాలు తక్కువగా కనిపిస్తాయి.

Update: 2024-09-22 16:15 GMT

కూటమిలో మిత్రపక్షంగా ఉన్నప్పటికి అధికార పక్షమనే మర్రిచెట్టు నీడలో విశ్రాంతి తీసుకోవటమే తప్పించి.. తమ సత్తా చాటుకునే రాజకీయ మిత్రపక్షాలు తక్కువగా కనిపిస్తాయి. అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఏపీ రాజకీయ ముఖచిత్రాన్నే తీసుకుంటే.. ఎన్డీయే కూటమి సర్కారులో పవన్ కున్న సీట్లు 21 మాత్రమే. టీడీపీకి ఉన్న సీట్లు 135. బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలుఉన్నారు. తెలుగుదేశానికి ఉన్న 135 సీట్ల బలంలో కేవలం 17 శాతం సీట్లు మాత్రమే జనసేనకు ఉన్నాయి.

ఒక ప్రభుత్వంలో ఈ స్థాయిలో బలం ఉన్న పార్టీకి ఉండే ప్రాధాన్యత నామ మాత్రంగా ఉంటుంది. కానీ.. పవన్ ప్రత్యేకత వేరు. దీనికి చంద్రబాబు నాయుడ్ని కూడా అభినందించాల్సిందే. తన పరిమితుల గురించి ఆయన తెలుసుకోవటంతో పాటు.. తనకు భారీ ఎదురుదెబ్బ తగిలిన వేళలో మిత్రుడి హోదాలో తనకు అండగా నిలిచిన పవన్ విషయంలో ఆయన ప్రత్యేకమైన అభిమానాన్ని ప్రదర్శించటం కనిపిస్తుంది. అదే టైంలో పవన్ ప్రస్తావన ఇక్కడ తీసుకురావాల్సిందే.

సాధారణంగా ఏ రాజకీయ అధినేత అయినా సరే..తాము అధికారపక్షంలో భాగస్వామ్యంగా ఉంటే.. వారి డిమాండ్లు.. వారి కోరికలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో పవన్ మాత్రం భిన్నమైన ధోరణిని ప్రదర్శిస్తున్నారు. తన వైపు నుంచి ఎలాంటి ఆబ్లిగేషన్లు రాకుండా చూసుకుంటున్నారు. తలనొప్పుల్ని తీసుకురాకుండా జాగ్రత్తలు తీసుకోవటంతో పాటు.. తన పరిధిని మీరకుండా వ్యవహరిస్తున్న వైనం చంద్రబాబుకు సైతం ఆశ్చర్యాన్నికలిగించేదే. ఎందుకుంటే... ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎంతోమంది మిత్రుల్ని చూశారు. ఎంతోమంది రాజకీయ పార్టీ అధినేతలతో కలిసి పని చేశారు. మిగిలిన వారి తీరుకు పవన్ భిన్నంగా ఉండటం.. తన వ్యక్తిగత ప్రయోజనాలు.. పార్టీ ప్రయోజనాల పేరుతో ఇబ్బంది పెట్టే ధోరణికి దూరంగా ఉండటం పవన్ ప్రత్యేకతగా చెప్పాలి.

అదే సమయంలో.. సమయం వచ్చినప్పుడు తన స్థాయిని విస్తరించుకుంటూ పోయే తీరును పవన్ ప్రదర్శించటం కనిపిస్తుంది. తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ విషయంలో సీరియస్ గా ఉన్న పవన్ కల్యాణ్.. టీటీడీ ఈవో శ్యామలరావును పిలిపించుకోవటం.. లడ్డూ ఎపిసోడ్ గురించి వివరాల్ని ఆరా తీయటం చూసినప్పుడు.. అవసరం రావాలే కానీ తన పవర్ ను చూపించే విషయంలో పవన్ అస్సలు తగ్గరన్న విషయాన్ని తన చేతలతో చేసి చూపిస్తున్నారన్న మాట వినిపిస్తోంది. సాధారణంగా ఇంతటి సంచలన విషయాలపై ముఖ్యమంత్రి రివ్యూ చేస్తారు. సీఎం సమీక్షించిన తర్వాత డిప్యూటీ సీఎం పెద్దగా చేసేదేమీ లేదు. కానీ.. తాజా ఎపిసోడ్ లో పవన్ మాత్రం భిన్నంగా వ్యవహరించారు. లడ్డూ కల్తీ విషయంలో తానెంత సీరియస్ గా ఉన్నానన్న విషయాన్ని చెప్పటమే కాదు.. భక్తుల మనోభావాల విషయంలో రాజీ అన్నది లేదన్న విషయాన్ని స్పష్టం చేయటం చూస్తే.. అవసరమైన వేళ పవర్ చూపించే విషయంలో బాబును దాటేస్తానన్న సంకేతాల్ని ఇచ్చారని చెప్పాలి.

Tags:    

Similar News