హెలికాప్టర్ రిపేర్.. పవన్ పర్యటనలు బ్రేక్!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం మరోసారి బ్రేక్ పడింది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం మరోసారి బ్రేక్ పడింది. పవన్ సోమవారం సాయంత్రం పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం, ఉంగుటూరులో వారాహి విజయభేరి సభల్లో పాల్గొనాల్సి ఉంది. ఇక్కడ నుంచి జనసేన తరఫున బరిలో ఉన్న అభ్యర్థుల పక్షాన ఆయన ప్రచారం చేయాలి. కానీ, హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం ఏర్పడడంతో చివరి నిమిషంలో ఆ పర్యటన రద్దయింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పిఠాపురంలోనే బస చేశారు. అక్కడ నుంచి తాడేపల్లికి వెళ్లేందుకు హెలికాప్టర్ రెడీ చేసుకున్నారు.
కానీ, పవన్ ఎక్కి కూర్చున్నాక.. హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో ఆయన పర్యటనను నిలుపుకొని.. వెనక్కి వెళ్లిపోయారు. దీంతో తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు వాయిదా పడ్డాయి. వాస్తవానికి పవన్.. సోమవారం సాయంత్రం 5 గంటలకు తాడేపల్లిగూడెం.. దీనికి కొంత దూరంలో ఉన్న ఉంగుటూరులో పర్యటించాల్సి ఉంది. కానీ, ఆయన సభ రద్దు చేసుకో వడంలో చేసిన ఏర్పాట్లు అన్నీ వృదా అయిపోయాయి.
ఇక, ఇప్పటికేరెండు సార్లు పవన్ పర్యటనలు నిలిచిపోయారు. వీటికి ఏదో ఒక లోపం ఎదురవుతూనే ఉంది. షెడ్యూల్ వచ్చిన తర్వాత పార్టీ పరంగా ఆయన దూకుడు పెంచాలని భావించారు. ఈ క్రమంలో తన పార్టీ తరఫున పోటీ చేసే వారి నియోజకవర్గా ల్లో ప్రచారానికి సంబంధించిన షెడ్యూల్‌ను రెడీ చేసుకున్నారు. ఓ రెండు రోజులు తన సొంత నియోజకవర్గం పిఠాపురంలోనూ పవన్ పర్యటించారు. కానీ, ఆకస్మికంగా ఆయన జ్వరానికి గురి కావడంతో అటు నుంచి అటే హైదరాబాద్ వెళ్లిపోయారు.
దీంతో అక్కడ నుంచి నిర్వహించాల్సిన తెనాలి సభ వాయిదా పడిపోయింది. ఇక, ఇప్పుడు కేవలం హెలికాప్టర్ లోపం కారణంగా రెండు నియోజకవర్గాల్లో సభలు వాయిదా వేసుకోవడం గమనార్హం. అయితే.. ప్రస్తుతం పవన్ బసచేసిన పిఠాపురం నుంచి తాడేపల్లి గూడెంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదికకు మధ్యదూరం 72 కిలో మీటర్లు. ఆయన రావాలని అనుకుంటే.. రెండు మూడు గంటల్లోనే ఇక్కడకు వచ్చేయచ్చు. కానీ, కారణం ఏదైనా.. ఆయన రాకపోవడంతో పార్టీ శ్రేణుల్లో నిరాశ ఎదురు కావడం గమనార్హం.