బాబు పవన్ జోడీ అయిదేళ్ళూ ?
ఏపీలో కొత్త చంద్రబాబుని అంతా చూస్తున్నారు. బాబు సాధారణంగా అధికారం విషయంలో ఎవరితోనూ పంచుకోరు అని ప్రచారంలో ఉంది
ఏపీలో కొత్త చంద్రబాబుని అంతా చూస్తున్నారు. బాబు సాధారణంగా అధికారం విషయంలో ఎవరితోనూ పంచుకోరు అని ప్రచారంలో ఉంది. దానికి ఉదాహరణలూ చరిత్ర పుటల నుంచి చెబుతారు. 1995లో ఎన్టీఆర్ నుంచి అధికారాన్ని తీసుకుని తోడల్లుళ్లు చంద్రబాబు దగ్గుబాటి వెంకటేశ్వరావు టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమయంలో దగ్గుబాటికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామని చెప్పారు చంద్రబాబు. కానీ ఆ తరువాత ఇవ్వలేదు. దాంతో దగ్గుబాటి తిరిగి ఎన్టీఆర్ వైపు వెళ్లారు
ఆ తరువాత 2014 వరకూ ఉప ముఖ్యమంత్రి ఊసే లేదు టీడీపీలో. అయితే 2014లో మాత్రం కాపులకు ఒకరికి బీసీలకు మరొకరికి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చినా ఆ పదవి కోసం ఎదురుచూసిన బిగ్ షాట్స్ కి దక్కలేదు. తన మాట వినే వారికే ఇచ్చారు అని ప్రచారం సాగింది.
వీటికి భిన్నంగా పవన్ కళ్యాణ్ కి ఉప ముఖ్యమంత్రి పదవిని బాబు ఇచ్చారు. అలా ఇవ్వరనే అంతా అనుకున్నారు మాజీ మంత్రి కాపు నేత చేగొండి హరి రామజోగయ్య వంటి వారు అయితే ఎన్నికల ముందే సభలలో దానికి ప్రకటించాలని కూడా కోరారు. కానీ బాబు పవన్ కి ఆ హోదా ఇవ్వడమే కాదు కీలక శాఖలు ఇచ్చారు. తనతో సమానంగా ప్రభుత్వ ఆఫీసులలో పవన్ కళ్యాణ్ చిత్రపటాలను ఉంచేలా ఆదేశాలు ఇచ్చారు.
ఇవన్నీ చూసినపుడు బాబు మారారు అని అంతా అంటున్నారు. అంతే కాదు పవన్ ని నమ్మారు అని అంటున్నారు. పవన్ కూడా బాబుని నమ్మారు. ఈ ఇద్దరి నమ్మకమే కూటమి ప్రభుత్వం అని కూడా చెప్పాలి. మరి ఈ నమ్మకం ఎంతకాలం ఉంటుంది అన్న డౌట్లు అందరికీ వస్తాయి. కానీ బాబు పవన్ ల తీరు చూసిన వారు అయితే ఏ సందేహాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని అంటున్నారు.
చంద్రబాబు ఈ అయిదేళ్ళూ ముఖ్యమంత్రిగా ఉంటారు. ఆయన నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేయడానికి పవన్ కూడా పూర్తి సిద్ధంగా ఉన్నారు. 2029 ఎన్నికల దాకా ఈ జోడీ కొనసాగుతుంది అన్నది రూఢీగానే అంతా చెబుతున్న మాట. ఇక్కడే బాబు దూర దృష్టి కూడా ఉంది అని అంటున్నారు. వైఎస్ జగన్ పార్టీ ఓడింది. కానీ వైసీపీ అంటే ఎవరో కాదు జగన్ మాత్రమే. ఆయన బలంగా ఉంటే చాలు తిరిగి 2029 నాటికి వైసీపీ పుంజుకుంటుంది. అర్ధ శతాబ్దం పైగా రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు ఈ సంగతి తెలియనిది కాదు.
అందుకే ఆయన పవన్ జోడీని కంటిన్యూ చేసి తీరుతారు అని అంటున్నారు. జగన్ మాదిరిగా బాబు అతి ధీమాకు పోరు అని అంటున్నారు. 2019లో టీడీపీ ఓడిపోగానే ఆ పార్టీ పని అయిపోయింది అని జగన్ భావించడం వల్లనే ఇంతకు ఇంతా మూల్యం వైసీపీ చెల్లించాల్సి వచ్చింది అని అంటున్నారు. అదే చంద్రబాబు చూస్తున్నది 2024 ని కాదు 2029 ఎన్నికలను, ఆ ఎన్నికల్లో సైతం వైసీపీని మరోసారి ఓడిస్తే కనుక ఇక ఆ పార్టీ అన్నదే ఉందదు అన్నది బాబు మార్క్ రాజకీయ వ్యూహం అని అంటున్నారు.
ఏపీలో కాపులు కమ్మలది డెడ్లీ కాంబినేషన్ అని మాజీ మంత్రి ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పకనే చెప్పారు. అదే నిజం కూడా. ఈ కాంబినేషన్ కనుక కొనసాగితే కోస్తా మొత్తం కొల్లగొడతారు. రాయలసీమలో 2029 నాటికి ఎంతో కొంత జగన్ బలం పుంజుకున్నా అధికారం దక్కనీయకుండా చేయగలుస్తారు. అందుకే బాబు పవన్ చేయి విడవరని అంటున్నారు. ఇక పవన్ కూడా ఎన్నికల సభల్లో చాలా సార్లు చెప్పారు టీడీపీ జనసేన పొత్తు పదేళ్ల పాటు కొనసాగాలని.
దాని అర్ధం ఆయన కూడా బాబుతోనే ఉంటాను అని చెప్పినట్లే అంటున్నారు. 2029 లో మరోసారి కూటమి గెలిస్తే అపుడు పవన్ లోకేష్ ల మధ్య ముఖ్యమంత్రి పదవుల విషయంలో పంపకం ఉండొచ్చు. ఏపీలో మూడో పార్టీని లేకుండా చేయాలన్న ఏకైక లక్ష్యంతో బాబు పవన్ కదులుతున్న వేళ వైసీపీకి ఇది అత్యంత కఠిన పరీక్ష అని చెప్పక తప్పదు.