పవన్ అర్జునుడు...చిరంజీవి శ్రీకృష్ణుడు...!
జనసేన క్యాడర్ ఏదైతే కోరుకుంటున్నారో అది వారికి లభించింది. మెగాస్టార్ జనసేనకు ఆర్ధికంగా నైతికంగా బలమైన అండగా నిలబడ్డారు
జనసేన క్యాడర్ ఏదైతే కోరుకుంటున్నారో అది వారికి లభించింది. మెగాస్టార్ జనసేనకు ఆర్ధికంగా నైతికంగా బలమైన అండగా నిలబడ్డారు. ఇలా బాహాటంగా జనసేనకు చిరంజీవి మద్దతు ఇవ్వడం అంటే అది రాజకీయ విశేషంగా చూస్తున్నారు. 2014లో జనసేనను పవన్ కళ్యాణ్ స్థాపించినప్పుడు మెగాస్టార్ కాంగ్రెస్ రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు.
ఆయన కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ మెంబర్ గా ఉన్నారు. అలాగే యూపీయే టూ ప్రభుత్వంలో టూరిజం మినిస్టర్ గా ఉన్నారు. అప్పట్లో కాంగ్రెస్ ని పవన్ కళ్యాణ్ అడ్డగోలు విభజన చేసిందంటూ తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ లో మంత్రిగా ఉన్న చిరంజీవి ఒకింత ఇబ్బంది పడ్డారు కూడా. ఆయన తమ్ముడి పార్టీని రాజకీయాన్ని నాడు స్వాగతించలేని పరిస్థితి ఉంది.
అయితే ఆ ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు, టీడీపీ బీజేపీకి మద్దతు ప్రకటించింది. ఇక 2019 నాటికి జనసేన ఒంటరిగా పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో మెగాస్టార్ బాహాటంగా మద్దతు ప్రకటించలేదు. ఆయన అప్పటికే కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి తన సినిమాలు తాను చేసుకుంటున్నారు. రాజకీయ ప్రస్తావనకు ఆయన దూరంగా ఉన్నారు.
ఆ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ రెండు సీట్లలో ఓటమి పాలు కావడం జరిగింది. అయితే ఆయన వెంటనే తేరుకుని బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఆ తరువాత పార్టీని నడిపిస్తూ వస్తున్నారు. ఇక 2024 ఎన్నికలకు ఆయన బీజేపీ టీడీపీలతో పొత్తులు పెట్టుకుని ముందుకు సాగుతున్నారు. ఈసారి ఆయన అసెంబ్లీకి వెళ్లడంతో పాటు కొన్ని సీట్లను జనసేనకు తెచ్చేలాగానే ఉన్నారు.
ఈ క్రమంలో జనసేనకు ఈ ఎన్నికలు చాలా కీలకంగా మారాయి. ఒక వేళ ఏమైనా ఇబ్బంది జరిగితే జనసేన ఉనికికి ముప్పు రావచ్చు. ఈ సమయంలో మెగాస్టార్ అనూహ్యంగా పవన్ కి అండగా నిలబడ్డారు. ఆయన జనసేన వైపే ఉన్నాను అని చెప్పకనే చెప్పేశారు. నిజానికి ఆయన ఈ మాట ఎపుడో చెప్పారు. తన ఆశీస్సులు తమ్ముడికే అని కూడా చెప్పారు. కానీ ఇది ఆయన చేతలలో చూపించరు. అయిదు కోట్లు జనసేనకు చిరంజీవి ఇచ్చారు అంటే మెగా కాంపౌండ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే అంటున్నారు.
మెగా హీరోలు అరడజన్ మంది దాకా ఉన్నారు. వారంతా ఇపుడు విరాళాలు ఇవ్వనున్నారు అని అంటున్నారు. అంతే కాదు మెగా హీరోలు టాప్ లెవెల్ లో ఉన్న అల్లు అర్జున్ నుంచి రాం చరణ్ నుంచి మొదలుపెడితే వరుణ్ తేజ్ సాయి తేజ్ వంటి హీరోలు పవన్ కి అండగా ప్రచారంలోకి దూకే అవకాశాలు ఉంటాయని అంటున్నారు.
పిఠాపురం నుంచి పవన్ పోటీ చేస్తున్నారు. ఆయనతో పాటుగా మెగా హీరోలు రంగంలోకి దిగితే జనసేనకు కొత్త ఊపు వస్తుందని అంటున్నారు. టీడీపీ కూటమికి అది బలంగా ఉంటుందని అంటున్నారు. ఇప్పటిదాకా అయితే కూటమి ప్రచారంలో కొంత వెనకబడింది అన్న చర్చ సాగుతోంది. ఏపీలో రాజకీయం అయితే కూటమి దిశగా అనుకూలం కావాలంటే రానున్న మూడు వారాలు కీలకంగా ఉండబోతున్నాయి.
కేంద్ర మాజీ మంత్రిగా పదేళ్ల పాటు రాజకీయాల్లో ఉన్న మెగాస్టార్ చిరంజీవి పవన్ నాగబాబులతో ప్రత్యేకంగా కొంతసేపు మాట్లాడారు అని అంటున్నారు ఈ సందర్భంగా ఆయన రాజకీయ సీనియర్ గా కొన్ని సలహాలు ఇచ్చారని అంటున్నారు. అలాగే ఆయన జనసేనలో ఏ పాత్ర పోషిస్తారు అన్నది చాలా మందిలో ఆసక్తిగా ఉంది.
అయితే చిరంజీవి మాత్రం రాజకీయాల్లోకి మళ్ళీ రారు ప్రచారం కూడా చేయరు అని అంటున్నారు. ఆయన పాత్ర శ్రీక్రిష్ణుడి పాత్ర అని అంటున్నారు. ఆయన తాను తమ్ముడి వైపే ఉన్నాను అన్నట్లుగా ఇచ్చిన సంకేతమే చాలు జనసేనకు కొండంత భరోసా అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే మెగాస్టార్ జనసేనకు ఈ క్లిష్ట సమయంలో మద్దతుగా నిలబడడంతో జనసేనలో కొత్త జోష్ వచ్చింది అని అంటున్నారు. రానున్న రోజులలో మెగా కాంపౌండ్ లో జనసేనకు అనుకూలంగా సంచలన పరిణామాలు చోటు చేసుకుంటాయని అంటున్నారు.