పెన్షన్ల పంపిణీ..వాలంటీర్లపై పవన్ కీలక వ్యాఖ్యలు

పిఠాపురం ప్రజలకు పెన్షన్ అందించి వారితో మాట్లాడేందుకు వచ్చానని పవన్ అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్లు పెంచి ఇచ్చామని తగ్గించలేదని అన్నారు.

Update: 2024-07-01 16:59 GMT

ఆంధ్రప్రదేశ్ లో జూలై 1వ తేదీ నుంచి ఎన్టీఆర్ భరోసా పేరుతో సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ఎన్డీఏ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మంగళగిరిలో ఓ లబ్ధిదారుడికి సీఎం నారా చంద్రబాబునాయుడు పెన్షన్ అందజేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అదే క్రమంలో కాకినాడ జిల్లా పిఠాపురంలో నిర్వహించిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. కొందరు లబ్ధిదారులకు పెన్షన్లు అందించిన తర్వాత పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

వాలంటీర్లు లేకపోతే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఆగిపోతుందని వైసీపీ నేతలు ఊదరగొట్టారని, కానీ, పెన్షన్ల పంపిణీ ఆగిందా అని పవన్ ప్రశ్నించారు. సచివాలయ సిబ్బంది ఉద్యోగుల ద్వారా తాము పెన్షన్లు అందించామని పవన్ అన్నారు. గతంలో నాలుగైదు రోజులు పెన్షన్ పంపిణీ చేసేవారని, ఈ రోజు రాత్రి లేదా రేపు ఉదయం కల్లా పెన్షన్ల పంపిణీ పూర్తి చేస్తామని పవన్ చెప్పారు. వాలంటీర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి ఎలా కల్పించాలి అన్న విషయం గురించి ఆలోచిస్తామన్నారు.

Read more!

పిఠాపురం ప్రజలకు పెన్షన్ అందించి వారితో మాట్లాడేందుకు వచ్చానని పవన్ అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్లు పెంచి ఇచ్చామని తగ్గించలేదని అన్నారు. గత ప్రభుత్వంలో పంచాయతీలకు రావాల్సిన నిధులు ఎటు వెళ్ళాయో తెలియదని, కానీ వందల కోట్ల రూపాయలతో రుషికొండలో ప్యాలెస్ కట్టుకున్నారని విమర్శించారు. శాఖలపై అధ్యయనానికి కొంత సమయం తీసుకుంటానని, తక్కువ చెప్పి ఎక్కువ పని చేసే స్వభావం తనదని అన్నారు. క్యాంప్ ఆఫీసులో మరమ్మతులు కూడా చేయవద్దని అధికారులకు చెప్పానని, అవసరమైతే కొత్త ఫర్నిచర్ కూడా తానే తెచ్చుకుంటానని అన్నానని గుర్తు చేసుకున్నారు.

పంచాయతీరాజ్ శాఖలో నిధులు లేవని, ఎన్ని కోట్ల అప్పు ఉందో తెలియదని అన్నారు. అందుకే, తనలాంటివాడు జీతం తీసుకోవడం తప్పు అనిపించిందని, కాబట్టి జీతం వదిలేస్తున్నానని పవన్ కళ్యాణ్ చెప్పారు. అయితే, అన్ని పనులు చిటికలో కావని, క్రమక్రమంగా అన్నీ చేసుకుంటూ పోతామని అన్నారు. తమ పార్టీకి ఓటు వేయకపోయినా అర్హత ఉంటే పెన్షన్లు ఇస్తాయని చెప్పుకొచ్చారు అద్భుతాలు చేస్తామని చెప్పడం లేదని కానీ ఈ ప్రభుత్వం ప్రజలకు జవాబు దారిగా ఉంటుందని పవన్ అన్నారు.

Tags:    

Similar News