పవన్‌ స్థాయికి తగ్గకుండా కీలక పదవి!

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చంద్రబాబు జూన్‌ 12న ప్రమాణస్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే

Update: 2024-06-11 10:14 GMT

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చంద్రబాబు జూన్‌ 12న ప్రమాణస్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కూటమిలోని పార్టీలు అయిన జనసేనకు నాలుగు మంత్రి పదవులు, బీజేపీకి రెండు మంత్రి పదవులు లభిస్తాయని టాక్‌ నడుస్తోంది.

కాగా జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ కూడా మంత్రివర్గంలో చేరడం కూడా దాదాపు ఖాయమైందని అంటున్నారు. ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి లభిస్తుందని చెబుతున్నారు. 2014లో చంద్రబాబు మంత్రివర్గంలో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. నాడు కాపు సామాజికవర్గం నుంచి నిమ్మకాయల చినరాజప్ప, ఈడిగ (బీసీ) సామాజికవర్గం నుంచి కేఈ కృష్ణమూర్తి ఉప ముఖ్యమంత్రులుగా వ్యవహరించారు. కేఈ కృష్ణమూర్తికి రెవెన్యూ శాఖతో ఉప ముఖ్యమంత్రిగా, నిమ్మకాయల చినరాజప్పకు హోం శాఖతో ఉప ముఖ్యమంత్రిగా చంద్రబాబు నియమించారు.

ఇక 2019లో జగన్‌ అధికారంలోకి వచ్చాక ఏకంగా ఐదుగురిని ఉప ముఖ్యమంత్రులను చేశారు. వీరిలో కాపు సామాజికవర్గం నుంచి మొదటి రెండున్నరేళ్లు ఆళ్ల నాని, బీసీ సామాజికవర్గం నుంచి ధర్మాన కృష్ణదాస్, ఎస్టీల నుంచి పుష్పశ్రీవాణి, ఎస్సీల నుంచి నారాయణస్వామి, ముస్లింల నుంచి అంజాద్‌ భాషాలకు డిప్యూటీ సీఎం పదవులు లభించాయి.

జగన్‌ రెండో విడత మంత్రివర్గ విస్తరణలో కాపు సామాజికవర్గం నుంచి కొట్టు సత్యనారాయణ, బీసీ సామాజికవర్గం నుంచి బూడి ముత్యాల నాయుడు, ఎస్టీల నుంచి పీడిక రాజన్నదొర, ఎస్సీల నుంచి నారాయణస్వామి, ముస్లింల నుంచి అంజాద్‌ భాషాలకు డిప్యూటీ సీఎం పదవులు లభించాయి.

ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో పవన్‌ కళ్యాణ్‌ ఒక్కరే డిప్యూటీ సీఎంగా ఉంటారని తెలుస్తోంది. మరెవరికీ ఈ పదవిని ఇవ్వబోరని అంటున్నారు. పవన్‌ కళ్యాణ్‌ స్థాయికి తగ్గట్టుగా ఆయన ఒక్కరితోనే డిప్యూటీ సీఎం పదవిని సరిపెడతారని చెబుతున్నారు. అలాగే తనతో సమానంగా ప్రొటోకాల్‌ ను పవన్‌ కళ్యాణ్‌ కు చంద్రబాబు వర్తింపజేస్తారని టాక్‌ నడుస్తోంది.

ఇక పవన్‌ కళ్యాణ్‌ కాకుండా జనసేన నుంచి మరో ముగ్గురికి మంత్రి పదవులు ఖాయమంటున్నారు. వీరిలో జనసేన ముఖ్య నేత, తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్, నిడదవోలు ఎమ్మెల్యే కందుల దుర్గేశ్, కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే పంతం నానాజీ, నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్‌ ఉంటారని సమాచారం.

కాగా తాజా ఎన్నికల్లో పవన్‌ కళ్యాణ్‌ పిఠాపురం నుంచి పోటీ చేసి 70 వేలకు పైగా భారీ మెజార్టీతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. వైసీపీ తరఫున పోటీ చేసిన వంగా గీతపై ఆయన విజయం సాధించారు.

Tags:    

Similar News