జనసేనానికి మళ్లీ జ్వరం.. అసలు సమస్యేంటి?

మూడు నాలుగు రోజులు ఎన్నికల ప్రచారం చేపట్టినంతనే అనారోగ్యానికి గురవుతున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్

Update: 2024-04-21 05:42 GMT

మూడు నాలుగు రోజులు ఎన్నికల ప్రచారం చేపట్టినంతనే అనారోగ్యానికి గురవుతున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తాజాగా మరోసారి జ్వరం బారిన పడ్డారు.ఆయన ఆరోగ్య పరిస్థితిపై తాజాగా పార్టీ స్పందించింది. తరచూ అనారోగ్యానికి గురయ్యే పవన్ ను ఇబ్బంది పెడుతున్న అసలు ఆరోగ్య సమస్య ఏమిటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. తరచూ అనారోగ్యానికి ఎందుకు గురవుతున్నారు? అసలు కారణం ఏమిటి? అన్న ప్రశ్నలతో పాటు.. ఇలా అయితే రానున్న మూడు వారాల ప్రచారం మాటేమిటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

ఇటీవల కాలంలో పవన్ కల్యాణ్ తరచూ జ్వరంతో బాధ పడుతున్నారు. మధ్యలో ప్రచారానికి బ్రేక్ ఇచ్చి హైదరాబాద్ కు వెళ్లటం తెలిసిందే. కాస్తంత కోలుకున్న తర్వాత మళ్లీ ఎన్నికల ప్రచారాన్ని చేపట్టినా.. ఆయన అస్వస్థతకు గురి కావటం జనసైనికుల్లో ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా పవన్ ఇబ్బంది పడుతున్న జ్వరానికి కారణాలు వెల్లడయ్యాయి. పవన్ కల్యాణ్ ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరిందని.. దీంతో ప్రతి రోజు ఏదో ఒక సమయంలో జ్వరంతో బాధ పడుతున్న విషయాన్ని వెల్లడించారు.

ఇన్ ఫ్లుయెంజా కారణంగా శ్వాస తీసుకోవటానికి పవన్ ఇబ్బంది పడుతున్నట్లుగా పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయినప్పటికీ.. అంతటి అస్వస్థతతో ఉండి కూడా విజయభేరీ యాత్రను కొనసాగిస్తున్నట్లుగా పేర్కొన్నారు. తరచూ జ్వరం బారిన పడుతున్న పవన్.. తన ఆరోగ్యం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచనలు చేస్తున్నారు. ఇందులో భాగంగా పవన్ ప్రచారానికి వచ్చిన సందర్భంలో భారీ క్రేన్ తో మెగా పూలదండల్ని ఏర్పాటు చేయొద్దన్న సూచనను పవన్ చేస్తున్నారు.

అంతేకాదు.. పవన్ తో ఫోటోలు.. సెల్ఫీలు.. షేక్ హ్యాండ్ల కోసం కొన్నాళ్లు ఒత్తిడి చేయొద్దని.. పూలు చల్లే క్రమంలో కూడా పవన్ ముఖానికి తగిలేలా పూలు చల్లొద్దంటూ సూచనలు చేస్తున్నారు. పవన్ ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల నేపథ్యంలో పవన్ అభిమానులు.. వీర మహిళలు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచన చేశారు. ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో పవన్ ఆరోగ్యం పెద్ద సమస్యగా మారిందన్న మాట వినిపిస్తోంది. అందుకే మరిన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. మరి.. ఈ సూచనల్ని జనసైనికులు పట్టించుకుంటారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.మరేం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News