పాత వీడియోలు పవన్ వెంట పడుతున్నాయా...?

ఆయన చంద్రబాబుని లోకేష్ ని పట్టుకుని అవినీతి పరులు అని కఠిన పదాలే వాడారు. తెలుగుదేశం పార్టీ మొత్తం అవినీతిమయం అన్నారు

Update: 2023-09-18 06:08 GMT

ఇది డిజిటల్ యుగం. రాజకీయ నాయకులకు బహు కష్టమైన కాలం కూడా. ఎందుకంటే గతంలో ప్రింట్ మీడియా రోజుల్లో సోషల్ మీడియా శకం మొదలు కానీ టైం లో తాము అలా అనలేదని పొరపాటున రాశారని, లేక తమ వ్యాఖ్యలను వక్రీకరించారని తప్పించుకునే వీలుంది. కానీ ఇపుడు వారి రూపు గొంతుక వారి వీడియోలు అన్నీ కూడా జనాల వద్ద భద్రంగా ఉంటున్నాయి.

తవ్వి తీయాలే కానీ యూ ట్యూబులలో కో కొల్లలుగా అవి కనిపిస్తాయి. రాజకీయ పార్టీ నేతలు నిన్న ఏమన్నారు, నేడు ఏమి చేస్తున్నారు అన్నవి పాత వీడియోలు వాస్తవాలను కళ్ళ ముందు పెడతాయి. విషయానికి వస్తే 2014లో టీడీపీతో దోస్తీ చేసిన పవన్ కళ్యాణ్ చిత్రంగా 2018 నాటికి కారణం తెలియదు కానీ విభేదించారు. దాంతో ఆయన తన ప్రసంగాలలో అధిక భాగం జగన్ మీద విమర్శలు చేసినా టీడీపీ అధినాయకత్వం మీద కూడా కొన్ని సందర్భాల్లో నిప్పులు చెరిగాయి.

ఆయన చంద్రబాబుని లోకేష్ ని పట్టుకుని అవినీతి పరులు అని కఠిన పదాలే వాడారు. తెలుగుదేశం పార్టీ మొత్తం అవినీతిమయం అన్నారు. తన వల్ల గెలిచిన నాయకులు వెన్నుపోటు పొడుస్తారా అని గర్జించారు. తన తల్లిని అవమానం చేసిన వారిని వదిలిపెట్టను, లోకేష్ నిన్ను క్షమించను అని ఖబడ్దార్ అని పవన్ ఆవేశంతో ఊగిపోతూ చేసిన కామెంట్స్ ఇపుడు తెగ వైరల్ అవుతున్నాయి.

ఎపుడో అయిదేళ్ల క్రితం పవన్ అన్న మాటలను పట్టుకుని ఇపుడు వీడియోలు పాతవి కొత్తగా చూపించే ప్రయత్నం వెనక వైసీపీ వ్యూహం దాగుంది అని అంటున్నారు ఒకసారి దారుణంగా తిట్టిన పార్టీతో పవన్ ఎలా కలుస్తారు అని వైసీపీ ఈ వీడియోలను ముందు పెట్టి మరీ ప్రశ్నిస్తోంది. పవన్ కళ్యాణ్ రాజకీయమేంటని నిలదీస్తోంది.

నిజానికి పవన్ కళ్యాణ్ పదేళ్ల రాజకీయ జీవితంలో నూటికి తొంబై శాతం జగన్నే టార్గెట్ చేసుకుని విమర్శించారు. అయితే 2019 ఎన్నికల వేళ కూడా ఒక వ్యూహం ప్రకారమే విడిపోయినట్లుగా బయటకు వచ్చి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడానికి పవన్ టీడీపీ మీద విమర్శలు చేశారని అంటున్నారు. ఆ లోపాయికారీ విషయాలు ఎవరూ బయటపెట్టలేరు, అవి ప్రచారంలో మాత్రమే ఉన్నాయి.

కానీ నాడు చంద్రబాబుని లోకేష్ పవన్ అన్న మాటలు సీరియస్ గానే ఉన్నాయి. వాటి మీదనే ఇపుడు సోషల్ మీడియాలో రచ్చ సాగుతోంది. పవన్ నాడూ నేడూ అంటూ వైసీపీ వండి వారుస్తున్న ఈ వీడియోల మీద జనసేన కూడా అంతే ఘాటుగా రియాక్ట్ అవుతోంది. ఈసారి పొత్తు వల్ల తమ నాయకుడు పవన్ సీఎం కచ్చితంగా అవుతారు అని అంటోంది.

టీడీపీ క్యాడర్ సైతం పవన్ తో అధికారం పంచుకుంటామని చెబుతున్నారు. అయితే వారు సీఎం పదవి ఇస్తామని అనడంలేదు, ఇదే తేడాగా ఉంది. దీంతో వైసీపీ మరింత గట్టిగానే టార్గెట్ చేస్తూ జనసేన అధినాయకత్వం డొల్లతనాన్ని ఎండగడుతోంది. సిద్ధాంతాలు లేవా అంటూ రాద్ధాంతం చేస్తోంది.

నిజానికి టీడీపీ జనసేన పొత్తు అన్నది ఎపుడో ఫిక్స్ అయిపోయింది. కానీ టైం డేట్ చూసుకుని ప్రకటించాలని అనుకున్నారు. అయితే చంద్రబాబు అరెస్ట్ తో అర్జంటుగా రాజమండ్రి జైలు వద్దనే దాన్ని బయటపెట్టాల్సి వచ్చింది అని అంటున్నారు. ఈ పొత్తు లేకపోతే మాత్రం వైసీపీకి చాలా పని ఉండేది. పవన్ చంద్రబాబు ల మధ్య రహస్య ఒప్పందాలు ఉన్నాయని అని ఆరోపణలు చేస్తూ వచ్చేది, చంద్రబాబుని ఎందుకు విమర్శించరు అంటూ గద్దించేది,.

ఇపుడు పవన్ పొత్తు ప్రకటన చేయడంతో ఆ చాన్స్ పోయింది. దానికి బదులుగా పాత వీడియోతో కొత్త రాజకీయం మొదలెట్టింది. దీని వల్ల జనసైనికులు డిఫెన్స్ లో పడతారు అని భావిస్తోంది. అయితే పవన్ చాలా తెలివిగానే జనసేన మొత్తానికి యాంటీ జగన్ స్లోగన్ తో ఏనాడో ట్యూనప్ చేశారు. కాబట్టి వారికి జగన్ కంటే బాబే బెటర్ అని మైండ్ లో ఫిక్స్ అయిపోయారు. ఈ నేపధ్యంలో జనసేన టీడీపీ పొత్తు మీద ఆ ప్రభావం అయితే కనిపించదనే అంటున్నారు. కేవలం విమర్శలు చేసుకోవడానికే పనికి వస్తుంది.

అయితే కామన్ జనాలలో పవన్ నిలకడలేని తనం, రాజకీయ అవకాశవాదాన్ని ఎండగట్టేందుకు మాత్రం ఈ పాత వీడియోస్ ఉపయోగపడతాయని అంటున్నారు. ముఖ్యంగా కాపు సామాజికవర్గంలో పవన్ వైఖరిని ఎత్తి చూపి పలుచన చేయడానికి వీలుంటుంది అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News