కంచుకోట విషయంలో పవన్ మ్యూట్... తెరపైకి కొత్త సందేహాలు!

Update: 2024-02-24 17:10 GMT

టీడీపీ - జనసేన అభ్యర్థుల ప్రకటన తొలి జాబితా విడుదలయ్యింది. ఇందులో భాగంగా చంద్రబాబు పక్కాగా ప్లాన్ చేసుకున్నట్లుగా 94 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల వివరాలు వెల్లడించగా... జనసేన అధినేత పవన్ మాత్రం తమకు కేటాయించిన 24 స్థానాల్లోనూ ఐగుగురు అభ్యర్థుల పేర్లు మాత్రమే ప్రకటించారు. అవి కూడా ఎప్పటినుంచో అనుకుంటున్నవే కావడం గమనార్హం. అయితే... వాటిలో ఇప్పుడు రాజోలు పేరు లేకపోవడంతో తెరపైకి కొత్త సందేహాలు వస్తున్నాయి.

అవును... పొత్తులో భాగంగా... తమకు ఇచ్చిన మొత్తం 24 స్థానాల్లోనూ కేవలం 5 టిక్కెట్లను మాత్రమే ప్రకటించారు పవన్. ఇందులో భాగంగా... నెల్లిమర్ల – లోకం మాధవి, అనకాపల్లి – కొణతాల రామకృష్ణ, రాజానగరం – బత్తుల బలరామ కృష్ణ, కాకినాడ రూరల్ – పంతం నానాజీ, తెనాలి – నాదెండ్ల మనోహర్ ల పేర్లు ప్రకటించారు. మిగిలిన 19 నియోజకవర్గాలు ఏమిటి.. వాటిలో పోటీ చేసే అభ్యర్థులు ఎవరు అనే విషయాలను ఇంకా సస్పెన్స్ లోనే ఉంచారు.

ఆ సంగతి అలా ఉంటే... 2019 ఎన్నికల్లో జనసేనకు గెలుపు రుచి చూపించింది డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు నియోజకవర్గం. దీంతో ఈ నియోజకవర్గాన్ని జనసేన కంచుకోట అని సంభోదిస్తుంటారు ఆ పార్టీ కార్యకర్తలు! గత ఎన్నికల్లో గాజువాక, భీమవరంలో బోల్తాపడినా.. రాజోలు మాత్రం ఫలితాలు సున్నా కాకుండా కాపాడింది. ఈ సమయంలో జనసేన టిక్కెట్ పై గెలిచిన రాపాక వరప్రసాద్.. అనంతరం కాలంలో వైసీపీలో చేరిపోయారు!

ఈ సమయంలో గతంలో రెండు సార్లు ఇదే నియోజకవర్గంలో వైసీపీ టిక్కెట్ పై రెండు సార్లు పోటీ చేసి పరాజయం పాలైన బొంతు రాజేశ్వర్ రావు జనసేనలో చేరారు. దీంతో ఆయనను రాజోలు ఇన్ ఛార్జిగా ప్రకటించారు! ఈ నేపథ్యంలో... అభ్యర్థుల జాబితా విడుదల అనగానే ముందుగా రాజోలు పేరు ఉంటుందని చాలామంది భావించారు. అయితే పవన్ మాత్రం ఈ విషయంలో కూడా సస్పెన్స్ మెయింటైన్ చేశారు.

దీంతో సరికొత్త సందేహాలు తెరపైకి వస్తున్నాయి. కారణం... రాజోలు నియోజకవర్గంలో టీడీపీకి మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావు రూపంలో బలమైన అభ్యర్థి ఉన్నారు. ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ ఆయనకు టిక్కెట్ ఇవ్వాలని అక్కడ టీడీపీ కార్యకర్తలతో పాటు వైసీపీలోని రాపాక వ్యతిరేకులు కూడా బలంగా కోరుకుంటున్నారని అంటున్నారు. అంటే... గొల్లపల్లికి రాజోలు లో ఎలాంటి ఫాలోయింగ్ ఉందో అర్ధం చేసుకోవచ్చు!

దీంతో... రాజోలు విషయంలో కూడా పవన్ ని చంద్రబాబు మ్యూట్ చేసేశారా అనే చర్చ నియోజకవర్గంలో బలంగా నడుస్తుంది. ఏది ఏమైనా... జనసేనకు గెలుపు రుచి చూపించిన రాజోలు లాంటి కీలక నియోజకవర్గంపై కూడా స్పష్టత ఇవ్వకుండా పవన్ పక్కన పెట్టడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతుంది.

Tags:    

Similar News