పవన్ కళ్యాణ్ కి ఎమ్మెల్యే క్యాండిడేట్లు దొరకడంలేదా...!?
జనసేనకు దాదాపుగా అరవై డెబ్బై మంది దాకా ఎమ్మెల్యే సీట్లకు సరిపడా క్యాండిడేట్లు ఉన్నారని చాలా కాలంగా ప్రచారం సాగింది
జనసేనకు దాదాపుగా అరవై డెబ్బై మంది దాకా ఎమ్మెల్యే సీట్లకు సరిపడా క్యాండిడేట్లు ఉన్నారని చాలా కాలంగా ప్రచారం సాగింది. ఒక దశలో అయితే ఆ పార్టీ శ్రేయోభిలాషి గా ఉంటూ వచ్చిన చేగొండి హరిరామజోగయ్య ఏకంగా ఒక అరవై మంది దాకా అభ్యర్థుల లిస్ట్ ని కూడా రిలీజ్ చేశారు. వీరికి టికెట్లు ఇస్తే గెలిచి తీరుతారు అని కూడా ఆయన ధీమాగా చెప్పేశారు.
జనసేన అధినాయకత్వం కూడా తమకు అనేక కీలక నియోజకవర్గాలలో అభ్యర్ధులు గట్టి వారు ఉన్నారని చెప్పుకుంది. తీరా చూస్తే జనసేనకు ఇచ్చిన సీట్లే 24గా ఉన్నాయి. అందులో నుంచి మూడు తీసేసి 21 సీట్లకు ఫిక్స్ చేశారు. ఈ సీట్లకు కూడా మొత్తం అభ్యర్ధులను ప్రకటించలేకపోవడం చూస్తూంటే అసలు జనసేనలో ఏమి జరుగుతోంది అన్న చర్చ వస్తోంది.
టీడీపీతో పొత్తు తరువాత జనసేన గౌరవప్రదమైన సీట్లు తీసుకుంటుంది అని చెబుతూ వచ్చిన పవన్ కళ్యాణ్ మొత్తానికి గాయత్రి మంత్రం పేరు చెప్పి 24 సీట్లకు సర్దుకున్నారు. ఇపుడు అందులో 21 దక్కాయి. వీటిలో కచ్చితంగా అభ్యర్ధులను ప్రకటించినది అయినా లేదా వారికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినది అయినా చూస్తే ఏడు దాకా ఉన్నాయని అంటున్నారు.మరి మిగిలిన 14 సీట్ల విషయంలో ఏమి జరుగుతుంది అన్నదే ఇపుడు చర్చగా ఉంది.
ఇక ఈ మిగిలిన సీట్లను చూసుకుంటే బాగా డబ్బు ఉన్న వారు గెలుపు గుర్రాలు కావాలని అంటున్నారు. అలాంటి వారికే టికెట్లు ఇస్తారు అని అంటున్నారు. అంటే సామాజిక వర్గం పరంగా లెక్కలు సరిపోవాలి. అదే విధంగా గెలుపు వారిదే అయి ఉండాలి. అంగబలం అర్ధ బలం వారికి సమృద్ధిగా ఉండాలి. ఇలా చాలా పొలిటికల్ లెక్కలు ఏవో ఉనాయని అంటున్నారు.
ఇక మరో వైపు టీడీపీలో టికెట్లు రాని వారు చాలా మంది ఉన్నారు. అంతే కాదు ఆయా నియోజకవర్గాలలో పాతుకుని పోయి పొత్తులో భాగంగా టికెట్లు దక్కించుకోని వారు ఉన్నారు. అలాంటి వారికి టికెట్లు ఇస్తే ఎలా ఉంటుంది అన్నది కూడా జనసేనలో ఆలోచిస్తున్నారు అని అంటున్నారు.
ఈ ఫార్ములాను ఇప్పటికే జనసేన భీమవరంలో అమలు చేసింది. అక్కడ రెండు సార్లు గెలిచిన మాజీ ఎమ్మెల్యే అంజిబాబుని తెచ్చి మరీ జనసేన కండువా కప్పేసారు. ఆయన నేను పోటీకి కాదు పవన్ కళ్యాణే చేస్తారు పదే పదే చెబుతూ చివరికి ఆయనే క్యాండిడేట్ అయిపోయారు. ఆయన భీమవరంలో బలమైన నేతగా ఉన్నారు. దాంతో ఆయనను తెచ్చి మరీ జనసేన తమ అభ్యర్ధిని చేసుకుంది.
మరి ఇదే తీరున ఇతర నియోజకవర్గాలలో చేస్తారా అన్న చర్చ సాగుతోంది. చంద్రబాబు సైతం గెలిచే వారిని ఎంపిక చేసుకుని వారికే టికెట్లు ఇవ్వాలని పవన్ కి సూచించినట్లుగా వార్తలు వస్తున్నాయి. నిజానికి జనసేన తరఫున గత ఎన్నికల్లో పోటీ చేసి మంచిగానే ఓట్లు సాధించిన వారు ఇపుడు కూడా ఉన్నారు. అయితే వైసీపీ నుంచి వచ్చే పోటీని తట్టుకుని గెలుపు సాధిస్తారు అని నమ్మకం లేకనే చాలా మందిని పక్కన పెడుతున్నారు అని అంటున్నారు.
దీంతో పార్టీ కోసం పనిచేసిన వారు అంతా ఇపుడు సైడ్ అయిపోతున్నారు. అదే టైం లో ఎంత డబ్బు అయినా ఖర్చు చేసేవారు ముందుకు వస్తున్నారు అని అంటున్నారు. వారు పార్టీలు మారి మరీ జనసేన టికెట్లు దక్కించుకుంటున్నారు అని అంటున్నారు.
ఇక జనసేనకు ఎన్ని సీట్లు ఇవ్వాలో చూసి మరీ ఇచ్చిన చంద్రబాబు ఇపుడు జనసేన నుంచి ఎవరు పోటీ చేయాలో కూడా స్వయంగా తానే చూస్తున్నారు అన్న ప్రచారం సాగుతోంది. ఇండైరెక్ట్ గా జనసేన టికెట్లను చంద్రబాబు డిసైడ్ చేస్తున్నారు అని అంటున్నారు. దీని వల్ల జనసేన కోసం పదేళ్ళ పాటు శ్రమించి అన్ని రకాలుగా ఇబ్బందులను తట్టుకుని పోరాడిన వారు మాత్రం తీవ్ర నిరాశను చెందుతున్నారు అని అంటున్నారు.
ఇక మరో విషయం ఏమిటి అంటే ఈ విధంగా వేరే పార్టీలో ఉంటూ జనసేన జెండా పట్టని వారికి టికెట్లు చివరి నిముషంలో ఇవ్వడం వల్ల జనసేనలో రచ్చ అవుతోంది. వారిని తప్పించి పార్టీలో ఉన్న వారికే ఇవ్వాలని కూడా కోరుతున్నారు. తిరుపతిలో అరణి శ్రీనివాసులు విషయంలో ఇదే జరిగింది. అలాగే విశాఖ సౌత్ లో కూడా వైసీపీ నుంచి వచ్చిన వంశీ క్రిష్ణ శ్రీనివాస్ కి ఇవ్వడాన్ని తప్పు పడుతున్నారు.
పెందుర్తిలో ఇదే పరిస్థితి ఉంది. మొత్తం మీద చూస్తే కనుక జనసేనలో చాలా అసంతృప్తి పేరుకుపోతోంది. తీసుకున్న సీట్లు తక్కువ అందులోనూ వైసీపీ టీడీపీ బ్యాచ్ లను దించితే ఇక అసలైన జనసేన నేతలకు ఏమి న్యాయం జరుగుతుంది అన్నది సైనికులకు పట్టుకున్న ఆవేదనగా ఉంది. దీనిని సరిచేసుకోకుంటే ఇబ్బందులు తప్పవని అంటున్నారు.