అర్జునుడై విజృంభించాడు ... దటీజ్ పవర్ స్టార్

హాయిగా అక్కడ అన్నీ ఆస్వాదించకుండా ఆయన మనసు ప్రజా సేవ మీదకు మళ్ళింది. అది ఆయనకు మొదటి నుంచే ఉంది

Update: 2024-06-05 17:29 GMT

పవర్ స్టార్ అన్న బిరుదు చాలు. కోట్లలో ఫ్యాన్స్. కోట్లలో పారితోషికం. ఒక విధంగా తాను నిర్మించుకున్న సినీ సామ్రాజ్యానికి పవన్ కళ్యాణ్ మకుటం లేని మహరాజు. హాయిగా అక్కడ అన్నీ ఆస్వాదించకుండా ఆయన మనసు ప్రజా సేవ మీదకు మళ్ళింది. అది ఆయనకు మొదటి నుంచే ఉంది.

ఎలాగైనా సమాజానికి మేలు చేయాలన్న పవన్ తపనకు 2005 ప్రాంతంలో ఏర్పాటు చేసిన కామన్ మ్యాన్ ప్రోటెక్షన్ ఫోర్స్ ఒక ఉదాహరణ. పవన్ ఆ విధంగా తనలోని సామాజిక సేవకు అంకురార్పణ చేశారు. ఆ తరువాత 2008లో ప్రజారాజ్యం ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు.

యువ రాజ్యం అధినేతగా పవన్ కళ్యాణ్ దూకుడుగా రాజకీయం సాగించి ప్రజారాజ్యం ఉమ్మడి ఏపీలో జోరు చేయడానికి కారణం అయ్యారు. 18 ఎమ్మెల్యే సీట్లు, 70 లక్షల ఓట్లు ప్రజారాజ్యానికి వచ్చాయంటే అందులో పవన్ వాటా కూడా ఉంది. ఇక విభజన ఏపీలో ఆయన జనసేన పార్టీని స్థాపించి తొలి ఎన్నికల్లో కేంద్రంలో మోడీకి ఏపీలో చంద్రబాబు సీఎం కావడానికి నిస్వార్ధంగా కృషి చేశారు. కనీసం ఒక్క పదవి కూడా ఆయన తీసుకోలేదు.

ఆయన కావాలనుకుంటే ఆనాడే రాజ్యసభ మెంబర్ అయి కేంద్రంలో మంత్రిగా ఉండేవారు. బీజేపీ నుంచి అలాంటి ఆఫర్ కూడా ఉంది. అలాగే బాబు మంత్రివర్గంలో కూడా చేరవచ్చు. కానీ ఆయన ఏపీ ప్రజలకు మంచి ప్రభుత్వం ఉండాలని అలాగే దేశంలో మోడీ పాలన రావాలని కోరుకుని పదవీ రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు.

అయితే 2019లో మాత్రం ఆయన తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేస్తే రెండు చోట్లా జనాలు ఓడించారు. ఆయన పార్టీ నుంచి నెగ్గిన ఒకే ఒక్క ఎమ్మెల్యే కూడా నాటి వైసీపీలో చేరిపోయారు. ఈ ఘోరమైన ఓటమిని చూసిన తరువాత ఎవరూ కూడా రాజకీయాల్లో కొనసాగరు. ఒక దండం అని పెట్టేస్తారు. హాయిగా సినిమాలు చేసుకునేవారు.

కానీ పవన్ కళ్యాణ్ లో మాత్రం పట్టుదల ఇంకా పెరిగింది. తాను చేయాల్సిన ప్రజా సేవకే ఆయన అంకితం అయి పట్టుదలగా 2019 నుంచి 2024 వరకూ జనంలో ఉంటూ పనిచేశారు. ఒక వైపు తన ఉపాధి అయిన సినిమాలను చూసుకుంటూనే ఆయన రాజకీయాల్లో బిజీగా గడిపారు. ఆయన వారాహి యాత్ర ఏపీ రాజకీయాల్లో అద్భుత సంచలనం.

ఇసుక వేస్తే రాలనంతగా జనాలు వచ్చారు. అలా వైసీపీ మీద సమర శంఖం పూరించిన పవన్ తానే సొంతంగా పోటీ చేసి ఉంటే ఇపుడు వచ్చిన సీట్ల కంటే ఎక్కువ వచ్చును. ఇంకా చెప్పాలంటే కింగ్ మేకర్ గా ఆయన మారేవారు. కానీ ఆయన అలా అనుకోలేదు. స్టేట్ ఫస్ట్ అనుకున్నారు. చంద్రబాబు లాంటి వారి అనుభవంతో పాటు పాలన ద్వారా ప్రజలకు మేలు చేయాలని చూసారు.

అందుకే ఆయన చంద్రబాబుని జైలులో నిర్బంధించినపుడు రాజమండ్రి వెళ్ళి మరీ పరామర్శించారు. ఆ జైలు బయటే ఆయన టీడీపీకి భేషరతుగా మద్దతు ఇచ్చారు. పొత్తు ప్రకటన చేశారు. అంతే కాదు వైసీపీ వ్యతిరేక ఓటు ఒక్కటి కూడా చీలనివ్వను అని పవన్ భీషణ ప్రతిన చేశారు. ఒక వ్యూహం ప్రకారం ముందుకు వెళ్లారు. అలా టీడీపీ బీజేపీ పొత్తులోకి బీజేపీని కూడా తీసుకుని వచ్చారు.

ఈ మూడు పార్టీలు కలిసిన నాడే తేలిపోయింది. ఏపీలో అధికారం ఖాయమని. ఇదిలా ఉంటే పవన్ ఏపీ పాలిటిక్స్ ని ఈసారి కీలకమైన మలుపు తిప్పి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయ్యారు. ఆయన క్రేజ్ ని ఇమేజ్ ని కూటమికి పెట్టుబడిగా పెట్టడంతో కూటమిలో అభ్యర్ధుల విజయాలు చరిత్రలో నిలిచిపోయాయి. ఎవరూ కూడా అర లక్షకు తక్కువ కాకుండా ఎమ్మెల్యేలు భారీ మెజారిటీలతో విజయాలు అందుకున్నారు. 90 వేలకు పై దాటి కూడా ఎమ్మెల్యేలు గెలిచారు అంటే దాని వెనక పవన్ ఇమేజ్ ఉంది. ఆయన తన సైన్యాన్ని అంతా కూటమి వైపుగా నడిపించి కనీ వినీ ఎరుగని విజయాన్ని కూటమిని అందేలా చూశారు.

అంతే కాదు ఎక్కడా లేని విధంగా పోటీ చేసిన 21 సీట్లకు 21 గెలుచుకోవడం, అలాగే 2 ఎంపీ సీట్లను గెలుచుకోవడం ఇదంతా పవన్ మార్క్ వ్యూహాలను జనాల మీద ఆయనకు ఉన్న నమ్మకాన్ని కూడా తెలియచేస్తుంది. 2024 లో జరిగిన అతి పెద్ద రాజకీయ కురుక్షేత్రంలో పవన్ అర్జునుడై విజృంభించారు. తన పవర్ ఏంటో చూపించారు. విమర్శించే వారి నోళ్ళు శాశ్వతంగా మూతపడేలా చేశారు.

ఆయనే ఒక సినిమాలో చెప్పినట్లుగా ఎక్కడ తగ్గాలో ఎలా నెగ్గాలో తెలిసిన నాయకుడు అయ్యారు. సినీ రంగంలో అన్న చాటు తమ్ముడిగా వచ్చి ఆ తరువాత తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకుని అందలాలు అధిరోహించిన పవన్ కళ్యాణ్ రాజకీయంగానూ జీరో నుంచి మొదలెట్టి ఈ రోజు హీరో అయ్యారు.

ఇక మీదట ఆయన ముందు ఉన్నవి మరిన్ని ఉన్నత శిఖారే. ఆయన లక్ష్యాలు అన్నీ కూడా ఒక్కోటిగా నెరవేరే మంచి తరుణం ఇది. పవన్ కి రాజకీయం తెలియదు అన్న వారు అంతా ఫూల్స్ అయ్యారు. తన వ్యూహాలు ఎంతగా పదునెక్కాయో చూపించడమే కాదు ప్రత్యర్ధుల అసలైన ప్లేస్ ఏంటో కూడా చూపించి దటీజ్ పవర్ స్టార్ అనిపించారు జనసేనాని.

Tags:    

Similar News