తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీపై కొత్త ట్విస్ట్!
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఎంపీ లక్ష్మణ్... జనసేనాని పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఇప్పటికే ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది. నవంబర్ 30న ఎన్నికలు, డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
కాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి జనసేన పార్టీ సైతం సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ పార్టీ 32 స్థానాలకు అభ్యర్థులను కూడా ప్రకటించింది. ఈ 32 స్థానాల నుంచి పోటీ చేస్తామని ఆ పార్టీ ఇప్పటికే వెల్లడించింది.
ఇంతలోనే ట్విస్ట్ చోటు చేసుకుంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఎంపీ లక్ష్మణ్... జనసేనాని పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇవ్వాలని కోరారు. బీజేపీ నేతల కోరికపై పవన్ స్పందించారు. పార్టీలో చర్చించి ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటామని పవన్ కళ్యాణ్ వారికి తెలిపారు.
జనసేన నాయకుల మనోగతాన్ని పవన్ కళ్యాణ్ బీజేపీ నేతలకు వివరించారు. 2014లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేశామని గుర్తు చేశారు. బీజేపీ అగ్ర నాయకుల కోరిక మేరకు హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల నుంచి విరమించుకుని బీజేపీ అభ్యర్థుల విజయానికి కృషి చేశామని తెలిపారు. ఇప్పుడు కనీసం 30 స్థానాల్లో అయినా పోటీ చేయకపోతే కార్యకర్తల స్థైర్యం దెబ్బ తింటుందని తెలంగాణ జనసేన నాయకులు చెబుతున్న విషయాన్ని కిషన్ రెడ్డి, లక్ష్మణ్ కి ..పవన్ కళ్యాణ్ తెలిపారు. కాగా ఉమ్మడిగా పోటీ చేసే విషయమై ఒకటి రెండు రోజులలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
కాగా బీజేపీ నేతలు పవన్ ను కలవకముందు జనసేన పార్టీ తెలంగాణ నేతలు పవన్ కళ్యాణ్ తో సమావేశమయ్యారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకపోతే క్యాడర్ బలహీనపడుతుందని వెల్లడించారు. అంతేకాకుండా తప్పుడు సంకేతాలు వెళ్తాయని పవన్ కు చెప్పారు.
ఇప్పటికే 2018 ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పార్టీ పోటీ చేయలేదని గుర్తు చేశారు. అలాగే గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చామని.. దీంతో అప్పుడు కూడా జనసేన పార్టీ పోటీ చేయలేకపోయిందని పార్టీ నేతలు పవన్ కళ్యాణ్ కు గుర్తు చేశారు.
ఈ నేపథ్యంలో తెలంగాణలో పోటీ చేసే విషయంలో తనపై భారీ ఒత్తిళ్లు ఉన్నాయని పవన్ కళ్యాణ్ పార్టీ నేతలకు తెలిపారు. అయితే పార్టీ నేతలు, జన సైనికులు, వీర మహిళలు ఎలా సూచిస్తే అలా చేద్దామని వారికి హామీ ఇచ్చారు. ఈ విషయంపై నిర్ణయం తీసుకోవడానికి తనకు రెండు మూడు రోజులు సమయం కావాలన్నారు.
ఈ మేరకు తెలంగాణ జనసేన నేతలు హైదరాబాద్ లోని జనసేన రాష్ట్ర కార్యాలయంలో సమావేశమయ్యారు. ఎన్నికల్లో పోటీపై పార్టీ నేతల అభిప్రాయాలను పవన్ కు వివరించినట్టు రాష్ట్ర నాయకత్వం మీడియాకు తెలిపింది.