జీతం తీసుకోను.. ఆఫీసు ఫర్నీచర్ నేనే తెచ్చుకుంటా.. పవన్ కీలక వ్యాఖ్యలు

పార్టుటైం పొలిటీషియన్ గా ప్రత్యర్థులు నానా మాటలు అనే పవన్ కల్యాణ్.. రాజకీయ నాయకుడిగా తానేమిటో చూపిస్తున్నారు.

Update: 2024-07-01 11:28 GMT

పార్టుటైం పొలిటీషియన్ గా ప్రత్యర్థులు నానా మాటలు అనే పవన్ కల్యాణ్.. రాజకీయ నాయకుడిగా తానేమిటో చూపిస్తున్నారు. కలలో కూడా ఊహించని రీతిలో ఆయన పనితీరు ఉంటోంది. సీనియర్ నేతలు ఎందరో ఉన్నప్పటికి.. స్వల్ప వ్యవధిలోనే తనకు కేటాయించిన శాఖపై పట్టు తెచ్చుకోవటంతోపాటు.. ఆ శాఖను ప్రక్షాళన చేసేందుకు అవసరమైన చర్యలకు ఉపక్రమిస్తున్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రెండు.. మూడు గంటల నుంచే శాఖల మీద రివ్యూలు చేపడుతున్న పవన్ వైఖరి హాట్ టాపిక్ గా మారింది.

తాజాగా కాకినాడ జిల్లా గొల్లప్రోలులో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఆసక్తికర అంశాల్ని ప్రస్తావించారు. తాను జీతం తీసుకొని పని చేయాలని అనుకున్నానని.. కానీ తన శాఖల వివరాల్ని చూసిన తర్వాత జీతం తీసుకోకూడదన్న నిర్ణయానికి వచ్చినట్లు చెప్పారు. సచివాలయ సిబ్బంది వచ్చి జీతానికి సంబంధించిన పత్రాలపై సంతకాలు చేయమంటే.. తన మనసు ఒప్పుకోలేదన్నారు. ‘‘జీతం తీసుకొని పని చేద్దామనుకున్నా. కానీ.. పంచాయితీరాజ్ శాఖలో నిధుల్లేవు. ఎన్ని వేల కోట్ల రూపాయిలు అప్పులు ఉన్నాయో తెలియడం లేదు. ఒక్కో విభాగం తవ్వే కొద్దీ లోపలికి వెళ్తూనే ఉంది. ఇవన్నీ సరి చేయాలి. శాఖ అప్పుల్లో ఉన్నప్పుడు నాలాంటివాడు జీతం తీసుకోవటం చాలా తప్పుగా అనిపించింది. అందుకే జీతం వదిలేస్తున్నానని సిబ్బందికి చెప్పాను. దేశం కోసం.. నేల కోసం పని చేస్తున్నా’’ అని వెల్లడించారు.

అంతేకాదు.. తనకు కేటాయించిన కార్యాలయానికి అవసరమైన ఫర్నీచర్ ఏమేం కావాలని అధికారులు అడిగారని.. తాను వారిని ఏమీ ఇవ్వొద్దని చెప్పినట్లుగా చెప్పారు. ‘నాకు అవసరమైన ఫర్నీచర్ ను నేనే తెప్పించుకుంటా. రిపేర్లు ఏమైనా చేయాలా? అని అడిగారు. వద్దని చెప్పా. శాఖలపై అధ్యయనానికి కొంత టైం తీసుకున్నా. తక్కువ చెప్పి ఎక్కువ పని చేయాలనుకుంటున్నా. అధికారంలోకి వచ్చాక పింఛన్లు పెంచి ఇచ్చామే తప్పించి తగ్గించలేదు. గత ప్రభుత్వంలో పంచాయితీ నిధులు ఎటువైపు వెళ్లాయో తెలియట్లేదు. వందల కోట్ల రూపాయిల ఖర్చుతో రుషికొండలో ప్యాలెస్ కట్టుకున్నారు. అవే నిధులు కొంత ఉపయోగించి ఉంటే కొంతైనా డెవలప్ మెంట్ జరిగేది. నా వైపు నుంచి ఎలాంటి అవినీతి ఉండదు. పర్యావరణ శాఖను బలోపేతంచేస్తా. గతంలో జల్ జీవన్ మిషన్ నిధులు ఉన్నా ఉపయోగించలేదు. కనీసం మ్యాచింగ్ గ్రాంట్లు కూడా ఇవ్వలేదు’’ అని పేర్కొన్నారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో విజయయాత్రలు చేయటానికి తాను సిద్ధంగా లేనన్న పవన్ కల్యాణ్.. పిఠాపురాన్నిదేశంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలన్నదే తన అకాంక్షగా చెప్పారు. కాలుష్యం లేని పరిశ్రమలు రావాలని.. విదేశాలకు వెళ్లే వారికి శిక్షణ ఇప్పించి పంపాలన్నారు.డబ్బులు వెనకేసుకోవాలనో.. కొత్తగా పేరు రావాలనో తనకు లేదని.. ప్రజల్లో తనకు సుస్థితర స్థానం కావాలన్న పవన్ తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇటీవల కాలంలో ఈ తరహా వ్యక్తిత్వం.. పని తీరు ఉన్న నాయకుల్ని చూసి చాలా కాలమే అయ్యిందన్న అభిప్రాయం పలువురి నోటి నుంచి వినిపించటం గమనార్హం.

Tags:    

Similar News