పదేళ్ళ జనసేన...అసెంబ్లీ గేటు తాకని పవన్...!
జనసేనకు పదేళ్ళు నిండాయి. పదకొండవ ఏడాదిలోకి అడుగుపెట్టింది. 2014లో విభజన మంటలతో ఏపీ అంతా అట్టుడుకుతున్న వేళ ఆశాకిరణంగా పవన్ వచ్చారు
జనసేనకు పదేళ్ళు నిండాయి. పదకొండవ ఏడాదిలోకి అడుగుపెట్టింది. 2014లో విభజన మంటలతో ఏపీ అంతా అట్టుడుకుతున్న వేళ ఆశాకిరణంగా పవన్ వచ్చారు. తాను రాజకీయ పార్టీ పెడుతున్నట్లుగా ఆయన చెప్పారు. దాని పేరు జనసేన అని ఆయన ప్రకటించిన వెంటనే వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంతా కాదు.
పవన్ పార్టీ 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే ఆ కధే వేరుగా ఉండేది. కానీ పవన్ కొత్త రాజకీయం అంటూ అప్పటిదాకా ఉన్న టీడీపీ బీజేపీ వంటి వాటికి మద్దతుగా నిలిచారు. నిజానికి ఆ రోజున అన్ని పార్టీలకు విభజన మకిలి అంటింది. అందరినీ జనం దోషులుగా చూస్తున్న పరిస్థితి. పవన్ కొత్తగా పార్టీ పెట్టి ప్రజలలోకి సోలోగా వచ్చి ఉంటే ఆ ఊపులో ఆయన ఒక రాజకీయ కెరటంగా మారి ఉండేవారు.
కానీ ఆ ఊపుని ఆయన టీడీపీ బీజేపీలకు టర్న్ చేసి తాను త్యాగరాజుగా తొలిసారి అవతారం ఎత్తారు. ఆనాడు కనీసం కొన్ని సీట్లు తీసుకుని పోటీ చేసినా జనసేన స్టోరీ వేరే లెవెల్ లో ఉండేది అని అంటారు. ఇక 2019 వచ్చేసరికి టీడీపీని ఎందుకు విభేదించారో, బీజేపీని ఎందుకు వద్దు అనుకున్నారో పవన్ కే తెలియాలి. కమ్యూనిస్టులతో బీఎస్పీతో కలసి ఆయన పోటీ చేస్తే అంతటి జగన్ వేవ్ లో సైతం చాలా చోట్ల పాతిక ముప్పయి వేల ఓట్లు వచ్చాయంటే అది జనసేన ఎదుగుదలకు సంకేతం అని తెలుసుకోలేకపోయారు అని అంటారు.
ఇక సీన్ కట్ చేస్తే 2020 మొదట్లో తాను పాచిపోయిన లడ్లు అని విమర్శించిన బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. 2023 నాటికి తాను అయిదేళ్ల టీడీపీ పాలన అవినీతిమయం అని కామెంట్స్ చేసిన పార్టీతో పొత్తు చేసుకున్నారు. దీంతో పవన్ రాజకీయం ఆయన సిద్ధాంతాలు అన్నవి ఎవరికీ అర్ధం కాకుండా పోయాయి. ఆఖరుకు పవన్ మీద సునామీగా వచ్చిన అభిమానం అంతా ఆయన పార్టీని పటిష్టత కోసం ఉపయోగించుకోలేకపోయారా అని కూడా విశ్లేషణలు వస్తున్నాయి.
టీడీపీతో గౌరవనీయమైన పొత్తు అని చెప్పిన పవన్ 24 సీట్లకే పరిమితం అయ్యారు. అవి కూడా బీజేపీ ఎంట్రీతో 21కి తగ్గిపోయాయి. ఇపుడు పవన్ తరఫున జనసేన అభ్యర్ధులు ఎక్కడ నుంచి పోటీ చేస్తామన్నా కూడా టీడీపీ తమ్ముళ్ళు భారీ ఎత్తున నిరసనలు చేస్తున్నారు.
అది ఎంతవరకూ వెళ్ళింది అంటే ఆఖరుకు పవన్ పిఠాపురంలో పోటీ చేస్తాను అంటే టీడీపీ పేరుతో కొంతమంది చేస్తున్న రచ్చ. నిజంగా ఒక పార్టీ అధ్యక్షుడు పోటీ చేస్తాను అంటే ఆయన వరకైనా నిరసనలు ఉండకూడదు, కానీ పవన్ విషయంలో జరుగుతున్నది చూస్తే సేనానీ ఏమిటిది అని అంతా చూస్తున్న వైనం.
తాను తగ్గి కూడా పొత్తులు కుదిర్చి చివరికి పవన్ సాధించింది ఏమిటి అన్నది కూడా అర్ధం కాని పరిస్థితి. దీనికి బదులు తనకు 2019 నుంచి 2024 దాకా పెరిగిన ఓట్ల గ్రాఫ్ తో సొంతంగా పోటీ చేసి ఉంటే ఆశావహులు అందరికీ టికెట్లు దక్కేవి. ఎన్ని సీట్లు దక్కినా ఆ కధ ఆ ఊపు వేరేగా ఉండేది అన్న మాట ఉంది.
ఏది ఏమైనా జనసేన పదేళ్ల ప్రస్థానాన్ని ఒకసారి విశ్లేషించుకున్నపుడు ఎన్నో రాజకీయ తప్పటడుగులు కనిపిస్తాయి. అదే సమయంలో తన కోసం కాకుండా ఇతర పార్టీల ప్రయోజనం కోసం పనిచేస్తున్న పార్టీ అని ప్రత్యర్ధులు చేస్తున్న విమర్శలకు జవాబు సమర్ధంగా చెప్పలేని పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక పదేళ్ల తరువాత కూడా పార్టీ ప్రెసిడెంట్ అసెంబ్లీకి వెళ్లలేదు అని వైసీపీ లాంటి పార్టీలు విమర్శిస్తున్నాయి.
పొత్తులు ఎత్తులతో అయినా ఈసారి పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి వెళ్ళి తనతో పాటు కొందరిని గెలిపించుకుంటే కనుక జనసేన 11వ వార్షికోత్సవం నాటికి ఎంతో కొంత కళ కట్టే చాన్స్ ఉంది అని అంటున్నారు. ఏది ఏమైనా రాజకీయం అంటే త్యాగం కాదు అని గుర్తించాల్సి ఉంది అని సూచనలు వస్తున్నాయి.
రాజకీయాల్లో అనేక మంది ఆశావహంగా ఉంటారు, వారి ఆశలను ఆకాంక్షలను కూడా ముందుకు తీసుకుని వెళ్ళాల్సి ఉంది. నేను గెలవాలి నా పార్టీ గెలవాలి అనుకుంటేనే ఏ రాజకీయానికైనా అసలైన గమ్య స్థానం దొరుకుతుంది అని అంటారు. పదేళ్ళ జనసేనకు ఈ అనుభవాలు పాఠాలుగా మారితే ఏపీలో మరో పార్టీకి గట్టి పునాదులు పడినట్లే అంటున్నారు.