పవన్ ఇలా అయితే కష్టమే ?

జనసేన అధినేత నుంచి ఉప ముఖ్యమంత్రి దాకా పవన్ ఎదిగిన తీరు అభినందనీయం.

Update: 2024-08-23 17:30 GMT

జనసేన అధినేత నుంచి ఉప ముఖ్యమంత్రి దాకా పవన్ ఎదిగిన తీరు అభినందనీయం. కానీ ఆ హోదాలో నుంచి ఆయన ఇంకా ఎదగాలన్నదే అందరి కోరిక. ముఖ్యంగా ఒక బలమైన సామాజిక వర్గం కోరిక. పవన్ ఉప ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల పవర్ చాల్లేదని ఆయన గ్రామ సభలో పాల్గొన్న కార్యక్రమంలోనే ఒక వ్యక్తి అన్నారు.

అంటే చాలా మంది కోరిక పవన్ సీఎం కావాలని. సీఎం కావాలంటే ఏమి చేయాలి. ఆ దిశగా సరైన కార్యాచరణను రూపొందించుకుని ముందుకు సాగాలి. కానీ పవన్ మాత్రం ఇంకా చంద్రబాబు అభిమానిగానే ఉండిపోతున్నారు. ఆయనలో అణువణువూ బాబు మీద ప్రేమాభిమానాలు ఉప్పొంగుతున్నాయి. దానికి ఎవరూ కాదనరు. కానీ బాబుని పొగిడితే పవన్ అక్కడే ఉండిపోతారు.

ఆయన తనకంటూ సొంతంగా ఆలోచించడం ద్వారానే ఆయన సొంత సామాజిక వర్గంతో పాటు ప్రజలు అనుకుంటున్నట్లుగా సీఎం అవుతారు అని అంటున్నారు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఒక కీలకమైన నిర్ణయమే తీసుకున్నారు. అదేంటి అంటే ఏపీవ్యాప్తంగా ఒకేసారి వేలాదిగా గ్రామ సభలను నిర్వహించడం అన్న మాట.

ఈ గ్రామ సభలలో కూడా ప్రజలకు మేలు చేసే నిర్ణయాలు తీసుకోవడం కూడా జరుగుతోంది. అలా కొత్త ఒరవడికి ఆయన శ్రీకారం చుట్టారు. అయితే ఈ గ్రామ సభల ప్రారంభం సందర్భంగా అన్నమయ్య జిల్లాలో మైసూరావారిపల్లి లో జరిగిన కార్యక్రమంలో పవన్ మాట్లాడుతూ చంద్రబాబు మీద ప్రశంసలు కురిపించారు. అపార అనుభవం ఉన్న చంద్రబాబు దగ్గర నేర్చుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నాను అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

అప్పులలో ఉన్న రాష్ట్రాన్ని గట్టెక్కించగలిగేది చంద్రబాబు మాత్రమే అని ఆయన అన్నారు. చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరం అని తాను గతంలో చాలా సార్లు చెప్పాను అని ఆయన గుర్తు చేశారు నా కంటే బాగా ఆలోచించేవారి వెంట నడించేందుకు నేను ఏ మాత్రం సంకోచించను అని కూడా పవన్ అన్నారు. అదే సమయంలో పార్టీ కోసం పని చేసేందుకు ముందుకు వచ్చిన వారిని వదులుకోను అని కూడా అన్నారు.

సరిగ్గా ఈ వ్యాఖ్యలే ఇపుడు చర్చనీయాంశం అవుతున్నాయి. చంద్రబాబు అనుభవం అని పవన్ పదే పదే చెబుతున్నారు. నిజమే బాబు అనుభవం కలిగిన వారే. కానీ ఆయన హయాంలో కూడా అంటే 2014 నుంచి 2019 దాకా ఏపీ అప్పులలో ఉన్న సంగతిని పవన్ చెప్పడం మరచారని అంటున్నారు

ఇక అప్పులు అన్నవి దేశంలో అనేక రాష్ట్రాలకు ఉన్నాయి. వారంతా అనుభవం లేక అప్పు చేస్తున్నారా ఆ మాటకు వస్తే దేశానికే అప్పులు ఉన్నాయని కూడా అంటున్నారు. మరో వైపు చూస్తే పవన్ కళ్యాణ్ బాబు దగ్గర నేర్చుకుంటాను అని అంటున్నారు. కానీ అదే బాబు జగన్ దగ్గర ఎంతో నేర్చుకున్న సంగతి ఉందని కూడా కామెంట్స్ చేస్తున్నారు.

ఇంటింటికీ ప్రతీ నెలా సామాజిక పెన్షన్ ఇవ్వడం జగన్ ని చూసి చంద్రబాబు నేర్చుకున్నారు ఆ సంగతి పవన్ కి తెలుసో లేదో అన్న సెటైర్లు పడుతున్నాయి. చంద్రబాబు కొత్తగా తన మనసులో ఆలోచనలు పుట్టి పెన్షన్లు ఇంటింటికీ ఇవ్వలేదు అని అంటున్నారు.

పవన్ నేర్చుకోవాల్సింది రాజకీయం అని కూడా గుర్తు చేసే వారు ఉన్నారు. ఇలా అయితే ఎలా పవన్ కష్టమే అని కాపు సామాజిక వర్గం నేతలు అంటున్నారు. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఉంది. దాని మీద పవన్ కళ్యాణ్ ముద్ర కనిపిస్తోందా అన్న ప్రశ్నలూ ఉన్నాయి. రాజకీయాల్లో ఎవరైనా ముందుకు వెళ్లాలని చూస్తారు. ఒకరి అడుగులలో దారులలో నడవాలి అంటే ఎప్పటికీ వెనుకబడిపోతారు అని కూడా హితైషుల నుంచి పవన్ కి సూచనలు వస్తున్నాయి.

అదే సమయంలో పవన్ కళ్యాణ్ బాబుని పొగడడం తగ్గించి జనసేన అధినేతగా వ్యవహరిస్తేనే ఆ పార్టీ మరింత పటిష్టం అవుతుందని అంటున్నారు. చంద్రబాబు అయినా మరొకరు అయినా రాజకీయాలు చేసేది రాజకీయం కోసమే అన్నది పవన్ నేర్చుకుంటే బాగుంటుంది అన్న సూచనలు వస్తున్నాయి.

పవన్ కళ్యాణ్ ఇలా చంద్రబాబును పొగుడుతూంటే సొంతంగా పార్టీ పెట్టడం ఎందుకు ఈ పొత్తులు చిక్కులూ ఎందుకు అన్న ప్రశ్నలు వేసేవారూ ఉన్నారు. టీడీపీ అధినేత విధానాలు ఇష్టం అయినపుడు ఆ పార్టీలోనే చేరి సేవ చేయవచ్చు కదా అన్న మాట కూడా అంటున్నారు.

మొత్తానికి పవన్ అయితే ఎమోషనల్ గా మాట్లాడుతున్నారో లేక వినయంగా మాట్లాడుతున్నారో కానీ ఆయన చేస్తున్న కామెంట్స్ మాత్రం బూమరాంగ్ అవుతున్నాయని అంటున్నారు. నిజానికి ఏపీలో టీడీపీ కూటమి సర్కార్ ఏర్పాటు కావడానికి పవన్ ప్రధాన కారణం అన్నది కనుక ఆయన గ్రహిస్తే భారీ పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం తగిన వ్యూహాలతో ఈపాటికే సిద్ధంగా ఉండేవారు అని కూడా అంటున్నారు.

Tags:    

Similar News