బీజేపీ కోసం పవన్ త్యాగం...!

పవన్ కళ్యాణ్ ఆది నుంచి త్యాగాలే చేస్తూ వస్తున్నారు అని అనుకోవాలి. ఆయన 2014లో పోటీ చేయకుండా టీడీపీ జనసేనలకు మద్దతు ఇచ్చారు.

Update: 2024-02-24 07:45 GMT

పవన్ కళ్యాణ్ ఆది నుంచి త్యాగాలే చేస్తూ వస్తున్నారు అని అనుకోవాలి. ఆయన 2014లో పోటీ చేయకుండా టీడీపీ జనసేనలకు మద్దతు ఇచ్చారు. ఇపుడు పోటీకి దిగుతూ కూడా తక్కువ సీట్లే తీసుకుంటున్నారు. ఇదేమిటి అని అడిగితే బీజేపీ కోసం ఈ త్యాగం అని అంటున్నారు. అంటే బీజేపీని కూటమిలోకి తీసుకుని వస్తున్నందుకు పవన్ కళ్యాణ్ సీట్ల త్యాగం చేస్తున్నారు అన్న మాట.

నిజానికి పొత్తులోకి ఒక పార్టీ వస్తే మిగిలిన రెండు పార్టీలూ త్యాగం చేయాలి. కానీ అలా కాకుండా జనసేన త్యాగం చేయడం ఏంటో అర్ధం కావడంలేదు అని అంటున్నారు. అదేమంటే ఏపీ భవిష్యత్తు అని అంటున్నారు. అదే మాట చంద్రబాబు అంటున్నా టీడీపీ సీట్లలో ఎక్కడా తగ్గుదల కనిపించడం లేదు.

పవన్ కళ్యాణ్ మాత్రమే బీజేపీ కోసం సీట్లు తగ్గించుకుంటున్నామని చెప్పడం విశేషం. బీజేపీని టీడీపీతో పొత్తు కుదిర్చేందుకు తాను జాతీయ నాయకత్వంతో చీవాట్లు ఎన్నో తిన్నాను అని ఇటీవల కాలంలో చెప్పి సంచలనం రేపిన పవన్ ఇపుడు బీజేపీ కోసం సీట్ల త్యాగం అని చెప్పడం వెనక వ్యూహం ఏంటో అని ఆలోచిస్తున్నారు.

బీజేపీ పొత్తులోకి వస్తే ఆ లాభం కూటమి మొత్తానికి దక్కుతుంది. కేంద్రంలో బీజేపీ పలుకుబడిని ఆ పార్టీ అధికారాన్ని వాడుకుని ఏపీలో అధికారంలో ఉన్న వైసీని కంట్రోల్ చేయాలన్నదే ఈ పొత్తులో అసలు పరమార్ధం. ఆ విధంగా చూస్తే పొత్తులో పెద్దన్న టీడీపీకే ఎక్కువ లాభం కలుగుతుంది.

మరి టీడీపీ పెద్దన్నగా పొత్తు పార్టీలకు సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. జనసేనకు ఎన్ని ఇవ్వాలి అన్నది చూసి ఇస్తారు తప్ప బీజేపీ వచ్చిందని జనసేనకు తగ్గించడం ఏంటి అన్నది లాజిక్ కి అందడం లేదు. మరి పవన్ తన మిత్రుడుగా బీజేపీని కూటమిలోకి తెస్తున్నందుకు ఆ త్యాగాన్ని తానే చేస్తున్నారా అన్న చర్చ జరుగుతోంది.

ఇదిలా ఉంటే కూటమిలోకి బీజేపీ రాక ముందు కూడా జనసేనకు ఇచ్చే సీట్లు ఇవేనని టీడీపీ అనుకూల మీడియాలో వార్తలు ఎన్నో వచ్చాయి. అంటే జనసేనకు ఇన్ని సీట్లు ఇవ్వాలని ముందే ఫిక్స్ అయినట్లుగా టీడీపీ అధినాయకత్వం ఉంది. అలాగే సీట్లు దక్కాయి. కానీ పవన్ మాత్రం బీజేపీ కోసం సీట్లు తగ్గించుకుంటున్నామని చెప్పడం వెనక ఒక బలమైన సామాజిక వర్గానికి సర్ది చెప్పడానికే అని అంటున్నారు.

ఏది ఏమైనా బీజేపీకి ఎన్ని సీట్లు ఇస్తారు అన్న దాని బట్టి చూస్తే అసలు కూటమిలోకి బీజేపీ రాకుండా ఉంటే జనసేనకు ఎన్ని సీట్లు మొత్తం దక్కేవి అన్నవి తొందరలో తెలిసిపోతుంది అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే జనసేనకు సీట్లు తగ్గడం పైన పవన్ ఇచ్చిన వివరణ ఇది.

దీనికి ఒక బలమైన సామాజికవర్గం ఓకే అనుకుని సర్దుకుని పోతుందా లేక ఆగ్రహం వ్యక్తం చేస్తుందా అన్నది చూడాలి. ఇక జగన్ తో యుద్ధం చేస్తామని పవన్ తన సహజమైన ధోరణిలో స్టేట్మెంట్ ఇచ్చేశారు.

Tags:    

Similar News