నాగబాబు కోసం అదిరిపోయే పదవి రిజర్వ్ చేసిన పవన్ ?

తన అన్నయ్య నాగబాబు అంటే పవన్ కి ఎంతో ఇష్టం అని అందరికీ తెలిసిందే.

Update: 2024-08-10 03:41 GMT

తన అన్నయ్య నాగబాబు అంటే పవన్ కి ఎంతో ఇష్టం అని అందరికీ తెలిసిందే. నాగబాబు ఇచ్చిన అనేక పుస్తకాలు తాను చిన్న తనంలో చదివి సామాజిక అంశాల మీద అవగాహన పెంచుకున్నాను అని పవన్ కూడా కొన్ని సందర్భాలలో చెప్పి ఉన్నారు. ఇక నాగబాబు జనసేనకు పెద్ద దిక్కుగా మారి గత అయిదారేళ్లూ పనిచేస్తూ వస్తున్నారు.

ఆయన తన తమ్ముడు కోసం బలంగా నిలబడ్డారు. ఆయన కేవలం పవన్ అంటే ప్రేమతోనే పాలిటిక్స్ లోకి వచ్చారు. ఈ రోజులలో పదవులు అంటే వద్దు అనే వారు ఎవరూ ఉండరు. కానీ నాగబాబు మాత్రం పదవుల విషయంలో దూరంగానే ఉంటున్నారు ఇది మాటలకే కాదు చేతలలో కూడా అమలు చేసి చూపించారు. 2019లో నరసాపురం నుంచి పోటీ చేసి తక్కువ మెజారిటీ తేడాతో ఓడిన నాగబాబు ఈసారి పోటీకి పట్టుబట్టలేదు.

అనకాపల్లి లోక్ సభకు పోటీ చేయాలని పార్టీ కోరితే అక్కడికి వెళ్లారు. ఆ తరువాత సీట్ల సర్దుబాటులో బీజేపీకి ఆ సీటు ఇవ్వాల్సి వస్తే మరో మాట లేకుండా తప్పుకున్నారు. దటీజ్ నాగబాబు అనిపించారు. అంతే కాదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత టీటీడీ చైర్మన్ పోస్టుకు నాగబాబు పేరు ఖాయం అని ప్రచారం సాగితే ఆయనే ముందుకు వచ్చి తనకు ఏ పదవుల మీద ఆశ లేదని మరోసారి ఖండితంగా చెప్పేశారు.

అయితే నాగబాబు మాత్రం పిఠాపురం నియోజకవర్గం చూసుకుంటూ పవన్ కి సహకారంగా ఉంటూ వస్తున్నారు. అలాంటి ఆయనకు తమ్ముడు పవన్ పదవి ఇవ్వాలని చూస్తున్నారుట. అదే ఫిలిం డెవలెప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి అని అంటున్నారు. కేబినెట్ ర్యాంక్ తో కూడిన ఈ పదవి సీనియర్ నటుడుగా కూడా ఉన్న నాగబాబుకు ఇవ్వడం న్యాయం అని అంటున్నారు.

ఈ పదవిలో నాగబాబు తన అనుభవాన్ని అంతా రంగరించి అటు సినీ పరిశ్రమకు ఇటు ఏపీ ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటారు అని అంటున్నారు ఏపీలో నామినేటెడ్ పదవుల పందేరం మరి కొద్ది రోజులలో మొదలు కానుంది అని అంటున్నారు. దాంతో కీలకమైన ఈ పదవికి నాగబాబు పేరు వినిపిస్తోంది. దానిని ఆయనకు రిజర్వ్ చేసి పెట్టేశారు అని అంటున్నారు.

నాగబాబు ఈ పదవిని తీసుకోవాలని కూడా అభిమానులు సైతం కోరుతున్నారు. మరి నాగబాబు నాకు పదవులు వద్దు అనకుండా ఈ పదవిని చేపట్టాలని అందరి ఆశగా ఉంది. మెగా ఫ్యామిలీలో నాగబాబు కూడా ఏదైనా పదవి చేపడితే మొత్తం అన్నదమ్ములు అందరికీ న్యాయం జరిగింది అని సంతృప్తి పడవచ్చు అన్నది అభిమానుల ఆలోచన.

మరో వైపు చూస్తే ఎమ్మెల్సీ రాజ్యసభ వంటి వాటి విషయంలో కూడా నాగబాబు పేరు ఉంది కానీ మరో రెండేళ్లకు కానీ ఆ పదవులు ఖాళీ అవవు. అప్పటిదాకా నాగబాబు ఈ పదవిలో ఉంటే 2026 నాటికి ఆయన రాజ్యసభకు నెగ్గి కేంద్ర స్థాయిలో మంత్రి అయినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే నాగబాబు అన్నయ్యకు పదవి ఇవ్వాలని పవన్ చాలా సీరియస్ గానే ఆలోచిస్తున్నారు అని అంటున్నారు.

Tags:    

Similar News