దేశంలోనే లాంగ్ టర్మ్ సీఎం.. 2 చోట్లా ఓటమి.. శిష్యుడి చేతిలో పరాభవం

సార్వత్రిక ఎన్నికలతో పాటే ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, ఒడిసా, సిక్కిం అసెంబ్లీలకూ ఎన్నికలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

Update: 2024-06-03 03:57 GMT

ఈశాన్యంలో చిన్నదే అయినా.. సిక్కిం చాలా కీలకమైన రాష్ట్రం. ఇలాంటిచోట 25 ఏళ్లు పాలించిన సీఎం దేశంలోనే అతి ఎక్కువ కాలం అధికారంలో ఉన్న వారిగా రికార్డులకు ఎక్కారు. ఐదేళ్ల కిందటి ఎన్నికల్లో అనూహ్యంగా ఓడినా.. మళ్లీ పుంజుకొంటారనే అంతా భావించారు. కానీ, రాజకీయ జీవితంలో ఎన్నడూ ఎదురవని పరాభవం చవిచూశారు. అదికూడా తన శిష్యుడు స్థాపించిన పార్టీ చేతిలో కావడం గమనార్హం. ఇంతకూ ఆ ఈశాన్య రాష్ట్రంలో ఏం జరిగిందంటే..?

సార్వత్రిక ఎన్నికలతో పాటే ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, ఒడిసా, సిక్కిం అసెంబ్లీలకూ ఎన్నికలు నిర్వహించిన సంగతి తెలిసిందే. సిక్కిం, అరుణాచల్ ఫలితాలు మంగళవారం (జూన్ 4) వెలువడాల్సి ఉన్నప్పటికీ.. ఆ రాష్ట్రాల అసెంబ్లీ గడువు ఆదివారంతో ముగియనుండడంతో ఆదివారమే (జూన్ 2) ఓట్ల లెక్కింపు చేపట్టారు. 32 ఎమ్మెల్యే సీట్లున్న సిక్కిం ఫలితాల్లో ప్రతిపక్ష సిక్కిం డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ (ఎస్డీఎఫ్) దారుణ ఫలితాన్ని చవిచూసింది. 2019 వరకు ఏకధాటిగా 25 ఏళ్లు సిక్కింను పాలించిన ఎస్డీఎఫ్ ఒక్క సీటుకే పరిమితమైంది. ఇందులో గమనార్హం ఏమంటే.. 2014తో 15 స్థానాలు గెలవగా.. ఇప్పుడు అందులో 14 కోల్పోయింది.

చామ్లింగ్.. ఆ చార్మింగ్ ఏది?

ఎస్డీఎఫ్ చీఫ్ పవన్ కుమార్ చామ్లింగ్.. దేశంలోనే సుదీర్ఘ కాలం సీఎంగా పనిచేసిన రికార్డు సొంతం చేసుకున్నారు. చామ్లింగ్ ఈసారి పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓడారు. అయితే, ఆయన 1985 నుంచి వరుసగా ఎనిమిదిసార్లు ఎమ్మెల్యే కావడం విశేషం. దాదాపు 40 ఏళ్లలో ఇదే తొలి ఓటమి కావడం గమనార్హం. ఇక 1994-2019 వరకు సిక్కింను చామ్లింగ్ అయిదుసార్లు ఏకధాటిగా 25 ఏళ్లు పాలించారు.

పాక్లోక్‌ కామ్రాంగ్‌, నామ్చేబంగ్‌ నుంచి పోటీకి దిగిన చామ్లింగ్ ను పాక్లోక్‌ కామ్రాంగ్‌లో సిక్కిం క్రాంతి మోర్చా (ఎస్‌కేఎం) అభ్యర్థి భోజ్‌రాజ్‌ రాయ్‌ 3 వేల ఓట్లతో, నామ్చేబంగ్‌ లో ఎస్ కేఎంకే చెందిన రాజుబసంత్‌ 2,256 ఓట్లతో ఓడించారు.

శిష్యుడి పార్టీనే..

31 సీట్లతో ఈ ఎన్నికల్లో ప్రభంజనం రేపిన ఎస్ కేఎంను స్థాపించింది ఎవరో కాదు.. చామ్లింగ్ శిష్యుడైన సీఎం ప్రేమ్‌ సింగ్‌ తమాంగ్‌. 2019లో ఈ పార్టీ 17 సీట్లు నెగ్గింది. తమాంగ్‌ ను.. అందరూ పీఎస్‌ గోలే గా పిలుస్తుంటారు. 1968 ఫిబ్రవరి 5న నేపాలీ జంటకు జన్మించారు. బెంగాల్‌ లోని డార్జిలింగ్‌లో గ్రాడ్యుయేషన్‌ చేశారు. 1990లో ప్రభుత్వ టీచర్ గా చేరారు. మూడేళ్ల అనంతరం సామాజిక సేవకు.. అటునుంచి రాజకీయాలకు మళ్లారు. 1994లో పవన్‌ కుమార్ చామ్లింగ్‌ పార్టీ ఎస్డీఎఫ్ లో చేరారు. వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009 వరకు వివిధ శాఖలకు మంత్రిగా చేశారు. అయితే, 2009 తర్వాత మంత్రి పదవి రాకపోవడంతో చామ్లింగ్ పై తిరుగుబాటు చేసి సిక్కి క్రాంతికారి మోర్చా పార్టీని స్థాపించారు. 2019, మళ్లీ ఇప్పుడు గెలుపొంది సీఎం కానున్నారు.

Tags:    

Similar News