పిఠాపురం ప్రజలకు పవన్ కల్యాణ్ బహిరంగ లేఖ.. ఏమన్నారంటే!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేసిన.. పిఠాపురం నియోజకవర్గం ప్రజలకు తాజాగా ఆయన బహి రంగ లేఖ రాశారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేసిన.. పిఠాపురం నియోజకవర్గం ప్రజలకు తాజాగా ఆయన బహి రంగ లేఖ రాశారు. అదేసమయంలో రాష్ట్ర ప్రజలకు కూడా మరో లేఖ రాశారు. పిఠాపురం ప్రజలను ఆయన అభినందించారు. ధన్యవాదాలు తెలిపారు. పిఠాపురం ప్రజలు తనపట్ల చూపించిన ఆదరణను తాను ఎప్పటికీ మరిచిపోలేనని తెలిపారు. పిఠాపురం నుంచి తాను బరిలోకిదిగుతున్నట్టు ప్రకటించగానే.. అందరూ స్వచ్ఛందంగా తనకు ప్రచారం చేశారని.. తమ ఇంటిబిడ్డగా ఆదరించారని పవన్ పేర్కొన్నారు.
పిఠాపురం ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా 86.63 శాతం ఓటింగ్ పోల్ కావడం.. మార్పునకు సంకేతమని జనసేనాని పేర్కొన్నారు. ఈ మార్పు కోసమే తాను ఎదురు చూశానని.. ప్రజల్లో వచ్చిన చైతన్యం మార్పునకు ప్రతీకని తెలిపారు. తన విజయం కోసం.. అహరహం శ్రమించిన వర్మకు ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నానని పవన్ పేర్కొన్నారు. ఆయనకు బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ తన సీట్ త్యాగం చేసి సంపూర్ణ మద్దతు ప్రకటించారని కొనియాడారు.
ఏపీ ప్రజలకు కృతజ్ఞతలు!
ఏపీ ప్రజలకు కూడా పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. సుదీర్ఘ సమయం వెచ్చించి మరీ ప్రజాస్వామ్య పండుగ అయిన.. ఎన్నికల పోలింగ్‌లో పాల్గొన్నారని కొనియాడారు. మొత్తంగా 81.86 శాతం ఓట్లు పోలవడం సరికొత్త రికార్డుగా ఆయన పేర్కొన్నారు. దీనిపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఎన్నికల పోలింగ్ ప్రక్రియపై ప్రజలు చూపించిన ఉత్సాహం.. తనకు ఎంతో సంతోషం కలిగించిందని తెలిపారు. ``సుస్థిర ప్రభుత్వం, సంక్షేమం, అభివృద్ది, శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఈ ఎన్నికల్లో ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వామ్యులు అయినందుకు నా అభినందనలు`` అని పవన్ పేర్కొన్నారు.