‘‘కొణిదెల పవన్‌ కళ్యాణ్‌ అనే నేను’’.. అసెంబ్లీలోకి పవన్‌ ఎంట్రీ అదుర్స్‌!

ఎట్టకేలకు జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు, జనసేన పార్టీ శ్రేణుల కల నెరవేరింది.

Update: 2024-06-21 05:56 GMT

ఎట్టకేలకు జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు, జనసేన పార్టీ శ్రేణుల కల నెరవేరింది. పవన్‌ కళ్యాణ్‌ ను అసెంబ్లీ గేటు కూడా తాకనీయబోమనే వైసీపీ నేతల అవహేళనలు, సెటైర్లు, అహంకారపూరిత మాటలకు ఆయన ఈ ఎన్నికల్లో గట్టి సమాధానం చెప్పిన సంగతి తెలిసిందే. టీడీపీతో పొత్తును ప్రకటించడమే కాకుండా బీజేపీని కూడా పొత్తులోకి తెచ్చి గేమ్‌ చేంజర్‌ గా నిలిచారు. కూటమి అఖండ విజయంలో కీలక పాత్ర పోషించారు. పిఠాపురం నుంచి భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు. అంతేకాకుండా ఈ ఎన్నికల్లో తన పార్టీ పోటీ చేసిన చోట్ల 21కి 21 అసెంబ్లీ స్థానాలను, 2కి రెండు ఎంపీ స్థానాలను గెలిపించుకుని రికార్డు సృష్టించారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్‌ కళ్యాణ్‌ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, గ్రామీణ తాగునీటి సరఫరా, అడవులు, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక రంగాల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితమే డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్‌ ఉన్నతాధికారులతో వరుస సమీక్షలతో జోష్‌ పెంచారు.

తాజాగా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పవన్‌ కళ్యాణ్‌ అసెంబ్లీకి చేరుకున్నారు. ఆయనకు పలువురు టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. అందరికంటే ముందుగానే అసెంబ్లీకి వచ్చిన ఆయన జనసేన పార్టీకి కేటాయించిన చాంబర్‌ లో సీఎం చంద్రబాబు కోసం ఎదురు చూశారు. చంద్రబాబు రాగానే ఆయనకు ఫుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్‌ ఆపాయ్యంగా ఆలింగనం చేసుకున్నారు.

తొలుత సీఎం చంద్రబాబుతో ప్రొటెం స్పీకర్‌ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు లేచి చప్పట్లతో హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఆనందంతో బల్లలు మోగించారు.

‘కొణిదెల పవన్‌ కళ్యాణ్‌ అనే నేను’.. అంటూ ఆయన తెలుగులో ప్రమాణపత్రాన్ని చదివారు. దైవసాక్షిగా శాసనసభ నియమాలను పాటిస్తానని, శాసనసభ సంప్రదాయాలకు అనుగుణంగా నడుచుకుంటానని, సౌర్వభౌమాధికారాన్ని కాపాడతానని, తన బాధ్యతలను శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని ప్రమాణం చేశారు. ప్రమాణం పూర్తయ్యాక ప్రొటెం స్పీకర్‌ వద్దకు వెళ్లి ఆయనకు నమస్కరించి.. కిందకు దిగి వచ్చి రిజిస్టర్‌ లో సంతకం చేశారు.

కాగా పవన్‌ కళ్యాణ్‌ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయడంతో జనసేన శ్రేణులు, అభిమానులు సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నారు. ‘కొణిదెల పవన్‌ కళ్యాణ్‌ అనే నేను’ అంటూ పవన్‌ చేసిన ప్రమాణస్వీకారం వీడియోను వైరల్‌ చేస్తున్నారు. వైసీపీ నేతలు తమ జనసేనానిని అసెంబ్లీకి అడుగుపెడ్డనీయబోమన్నారని.. కానీ ఆయన సింహంలాగా గేట్లు బద్దలుకొట్టుకుని అసెంబ్లీలోకి ఎంట్రీ ఇచ్చారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు పవన్‌ సోదరుడు, జనసేన ముఖ్య నేత నాగబాబు సైతం సింహం అసెంబ్లీ గేట్లను తోసుకుని అరుచుకుంటూ వస్తున్న వీడియోను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వనీయమన్నారంటూ దానికి క్యాప్షన్‌ పెట్టారు. పరోక్షంగా పవన్‌ కళ్యాణ్‌ సింహంలాగా అసెంబ్లీ గేట్లను తోసుకుని ఎంట్రీ ఇచ్చారని పోస్టు చేశారు.

Tags:    

Similar News