అధికారంలోకి వచ్చినంతనే ఆ భారీ భవంతిని కూల్చేస్తాం.. పవన్ సంచలనం

పవన్ కల్యాణ్.. ఆదివారం గాజువాకలో జరిగిన సభలో మాట్లాడుతూ.. అల్టిమేట్ వార్నింగ్ ఇచ్చేశారు.

Update: 2023-08-14 04:09 GMT

ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా భారీ హెచ్చరికను జారీ చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. తాము అధికారంలోకి వచ్చినంతనే విశాఖపట్నంలోని ఒక భారీ భవనాన్ని కూల్చేస్తామని.. ఆ విషయాన్ని ముందే చెబుతున్నామని స్పష్టం చేశారు. అందులో భవనాల్ని కొనే వారంతా తన హెచ్చరికను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని ఒకటికి నాలుగు సార్లు చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఎట్టి పరిస్థితుల్లోనూ సదరు భవనాన్ని ఉంచేది లేదని.. అందరికి ముందే చెబుతున్నానని.. తర్వాత తనను అనొద్దంటూ తేల్చేసిన పవన్ మాటలు ఇప్పుడు హాట్ టాపిక గా మారాయి.

విశాఖపట్నం వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున టార్గెట్ చేస్తున్న పవన్ కల్యాణ్.. ఆదివారం గాజువాకలో జరిగిన సభలో మాట్లాడుతూ.. అల్టిమేట్ వార్నింగ్ ఇచ్చేశారు. ఎంపీ నిర్మిస్తున్న భారీ అంతస్తుల భవనానికి సరైన అనుమతులు లేవని.. ఆ ప్రాజెక్టు మొత్తం పర్యావరణానికి హాని కలిగించేదన్న ఆయన.. ప్రస్తుతం ఈ వివాదం కోర్టులో ఉందన్నారు.

విశాఖ ఎంపీని ఒక రౌడీషీటర్ అంటూ వ్యాఖ్యలు చేసిన పవన్ కల్యాణ్.. విశాఖపట్నంలోని సిరిపురంలో క్రిస్టియన్ మిషనరీస్ కు చెందిన ఆస్తుల్ని కబ్జా చేసినట్లుగా ఆరోపణలు. కబ్జా చేసిన స్థలంలో నాలుగు ఫ్లోర్లకు అనుమతులు తీసుకొని ఏకంగా 26 అంతస్తులు నిర్మిస్తూ వ్యాపారం చేస్తున్నారన్నారు. ఈ భూమిపై సుప్రీంకోర్టులో కేసులు ఉన్నాయని.. తమ ముఖ్యమంత్రి ఆస్తులు సంపాదించారు కాబట్టి.. తాము కూడా ఆస్తులు పోగేసుకోవాలన్న అహంతో వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని.. వారిని ఉపేక్షించేది లేదన్నారు.

విశాఖ ఎంపీకి ఇచ్చిన వార్నింగ్ ను పవన్ మాటల్లోనే చూస్తే.. "విశాఖ ఎంపీ గతంలో ఓ రౌడీషీటర్. సిరిపురంలో క్రిస్టియన్ మిషనరీస్ కు చెందిన ఆస్తులను కబ్జా చేశాడు. అక్కడ నాలుగు ఫ్లోర్లకు పర్మిషన్ తీసుకొని 26 ఫ్లోర్లకు వ్యాపారం చేస్తున్నాడు. ఈ భూమిపై సుప్రీం కోర్టులో కేసులు ఉన్నాయి. ఈ దేశంలో కోర్టులు బలంగా పనిచేస్తున్నాయి. అన్యాయంపై కొరఢా ఝులిపించే న్యాయమూర్తులు ఉన్నారు. గుర్గావ్ లో టవర్స్ కూల్చేసినట్లు... భవిష్యత్తులో ఈ రౌడీషీటర్ అక్రమంగా నిర్మిస్తున్న బిల్డింగ్స్ ను సైతం ప్రభుత్వం మారగానే కూల్చేస్తాం. ప్రజలు ఎవరూ ఈ ఆస్తులను కొనుగోలు చేయొద్దు" అని చెప్పారు.

సాధారణంగా ఎవరైనా బిల్డర్ ఆస్తిని డెవలప్ చేసేందుకు తీసుకుంటే 30 శాతం యజమానికి.. 70 వాతం బిల్డర్ కు వెళ్లేలా అగ్రిమెంట్ చేసుకుంటారని.. విశాఖపట్నం ఎంపీ మూర్తి మాత్రం కూర్మన్నపాలెంలో 10 ఎకరాల భూమిని తీసుకొని 99 శాతం ఆయనకు వర్తించేలా.. ఒక శాతం వాటాను మాత్రం భూమి యజమానికి రాసినట్లుగా ఆరోపించారు. "రౌడీషీటర్ కాబట్టి ఇలా అన్యాయంగా దోచుకుంటున్నాడు. ఈయన ఇలానే దోడిపీలకు పాల్పడితే వచ్చే ప్రభుత్వంలో మళ్లీ రౌడీషీటర్ ఓపెన్ చేయడం ఖాయం" అంటూ మరో వార్నింగ్ ఇచ్చేయటం గమనార్హం. గాజువాక సభలో కొంతసేపు ప్రత్యేకంగా ఎంపీ మూర్తిపై అదే పనిగా ఘాటు వ్యాఖ్యలు.. విమర్శలు.. ఆరోపణలు చేశారు పవన్ కల్యాణ్.

Tags:    

Similar News