ఇక పవన్‌ వంతేనా?

కాగా ఇప్పుడు చంద్రబాబు అరెస్టుతో ఏపీ రాజకీయాలు పరిణామాలు అనూహ్య మలుపు తిరిగాయి. మరోవైపు జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ ను కూడా అరెస్టు చేస్తారని టాక్‌ నడుస్తోంది.

Update: 2023-09-09 16:05 GMT

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ జరిగిందని చెబుతూ టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబును ఏపీ సీఐడీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ అరెస్టును వైసీపీ నేతలు, మంత్రులు స్వాగతిస్తుండగా.. ప్రధాన ప్రతిపక్షాలు జనసేన, బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలు ఖండించాయి.

కాగా నంద్యాలలో చంద్రబాబును అరెస్టు చేసిన ఏపీ సీఐడీ అధికారులు ఆయనను గుంటూరు జిల్లా కుంచనపల్లిలో ఉన్న సీఐడీ ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్లారు. ఆయనను ప్రశ్నించడానికి ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా 20 ప్రశ్నలపై ఆయన నుంచి సమాధానాలు రాబడతారని తెలుస్తోంది.

కాగా ఇప్పుడు చంద్రబాబు అరెస్టుతో ఏపీ రాజకీయాలు పరిణామాలు అనూహ్య మలుపు తిరిగాయి. మరోవైపు జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ ను కూడా అరెస్టు చేస్తారని టాక్‌ నడుస్తోంది. ఇటీవల వలంటీర్లపై పవన్‌ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఉభయ గోదావరి జిల్లాల్లో ఆగస్టు నెలలో వారాహి యాత్ర నిర్వహించిన పవన్‌ వలంటీర్ల వల్ల మహిళలు పెద్ద ఎత్తున అదృశ్యమవుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు తనకు కేంద్రం నుంచి కీలక సమాచారం అందిందన్నారు.

ఎవరి ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలున్నారు? వారిలో చదువుకుంటున్నవారు ఎంతమంది? పెళ్లయినవారు ఎంత మంది, భర్తతో విడిపోయినవారెవరు?, వితంతవులు ఎంతమంది ఇలా వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి మహిళల డేటా సేకరిస్తున్నారని పవన్‌ కళ్యాణ్‌ ఆరోపించారు.

వలంటీర్లు సేకరించిన డేటా అంత హైదరాబాద్‌ లోని ఒక ప్రైవేటు ఏజెన్సీకి చేరుతోందని సంచలన ఆరోపణలు చేశారు. ప్రజల సమాచారానికి భద్రత లేదని విమర్శించారు. ఆ డేటా దుర్వినియోగమైతే దానికి బాధ్యులెవరని నిలదీశారు. వైసీపీ అనుకూల ఏజెన్సీలకు ఆ సమాచారం చేరుతోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ డేటా వల్లే మహిళలు పెద్ద ఎత్తున మిస్‌ అవుతున్నారని ఆరోపించారు.

ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నేతలు, కార్యకర్తలు పవన్‌ కళ్యాణ్‌ పై మండిపడ్డారు. పవన్‌ చిత్రపటాలు, ఫ్లెక్సీలు, దిష్టిబొమ్మలు దహనం చేశారు. ఆయన చిత్రపటాలను చెప్పులతో కొట్టారు. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నేతలు గ్రామ, వార్డు వలంటీర్లతో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.

అంతేకాకుండా వైసీపీ నేతలు.. గ్రామ, వార్డు వలంటీర్లతో రాష్ట్రవ్యాప్తంగా పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదులు చేయించారు. పవన్‌ కళ్యాణ్‌ పై పరువు నష్టం దావాలు వేయించారు. అలాగే పవన్‌ వ్యాఖ్యలు మహిళల్లో భయాందోళనలకు, అలజడులకు కారణమవుతాయని.. తద్వారా ప్రభుత్వాన్ని అస్ధిరపరిచే కుట్ర ఇందులో ఉందని పవన్‌ కళ్యాణ్‌ పై కేసులు మోపారు.

ఈ నేపథ్యంలో పవన్‌ కళ్యాణ్‌ పై కేసును విజయవాడలోని ఒక కోర్టు విచారణకు స్వీకరించింది. ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఒక వలంటీర్‌ దాఖలు చేసిన కేసులో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో పవన్‌ కళ్యాణ్‌ ను కూడా అరెస్టు చేయడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది.

వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలసి పోటీ చేస్తాయనే టాక్‌ నడుస్తోంది. ఈ మూడు పార్టీలు పోటీ చేస్తే 2014 ఫలితాలు పునరావృతమవుతాయనే ఆందోళన వైసీపీలో ఉందని అంటున్నారు. మరోవైపు రాయలసీమలో చంద్రబాబు సభలకు భారీ ఎత్తున జనాలు పోటెత్తుతున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నియోజకవర్గం పులివెందులలో చంద్రబాబు నిర్వహించిన సభకు భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చారు.

ఇంకోవైపు నారా లోకేశ్‌ పాదయాత్రకు కూడా అడుగడుగునా వైసీపీ శ్రేణులు ఆటంకాలు కల్పిస్తున్నాయని గుర్తు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ప్రతిపక్షాల కూటమి బలపడకుండా ఉండాలన్నా.. ఆ పార్టీ ప్రధాన నేతలు ప్రజల్లో తిరగకుండా ఉండాలన్నా వారిని జైలుకు పంపడమే మంచిదని భావనలో వైసీపీ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో వలంటీర్లపై తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో పవన్‌ కళ్యాణ్‌ ను కూడా మరికొద్ది రోజుల్లో అరెస్టు చేస్తారని అంటున్నారు. ఇదే నిజమైతే రాష్ట్ర రాజకీయాలు తీవ్ర పరిణామాల దిశగా రూపు తీసుకుంటాయనే చర్చ జరుగుతోంది.

Tags:    

Similar News