వైసీపీ ఎమ్మెల్యేలు వేడుకుంటేనే జగన్‌ కు చాన్స్‌!

ఈ నేపథ్యంలో మాజీ సీఎం జగన్‌ కు తాము తగిన గౌరవం ఇచ్చామని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ తెలిపారు.;

Update: 2024-06-22 07:09 GMT

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రొటెం స్పీకర్‌ గా ఎన్నికయినా గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎమ్మెల్యేలందరితో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ క్రమంలో తొలి రోజు ప్రమాణస్వీకారం చేయని.. జీవీ ఆంజనేయులు, పితాని సత్యనారాయణ, వనమాడి కొండబాబులతో రెండో రోజు ప్రమాణస్వీకారం చేయించారు. నర్సీపట్నం ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడిని స్పీకర్‌ గా ఎన్నుకున్నారు.

కాగా తొలి రోజు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌.. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులు ప్రమాణస్వీకారం చేశాక ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత అక్షర క్రమంలో ఆయా పార్టీల ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేశారు.

ఈ నేపథ్యంలో మాజీ సీఎం జగన్‌ కు తాము తగిన గౌరవం ఇచ్చామని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ తెలిపారు. ఈ మేరకు వైసీపీ ఎమ్మెల్యేలు తనను కలిసి విజ్ఞప్తి చేశారని చెప్పారు. సీఎం చంద్రబాబు హుందాతనంగా వ్యవహరించాలని తమను ఆదేశించారని వెల్లడించారు. అందుకే జగన్‌ కారును శాసనసభా ప్రాంగణం లోపలి వరకు అనుమతించామని కేశవ్‌ అన్నారు.

వాస్తవానికి జగన్‌ కు ప్రతిపక్ష నేత హోదా కూడా దక్కలేదని.. ఆయన కేవలం సాధారణ ఎమ్మెల్యే మాత్రమేనని టీడీపీ నేతలు అంటున్నారు. అక్షర క్రమంలో ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణం చేయాల్సి ఉండేదని.. ఈ క్రమంలో ఆయన పేరు 175 మంది ఎమ్మెల్యేల్లో చివరకు వచ్చేదని గుర్తు చేస్తున్నారు.

అయితే సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఆయనను ప్రతిపక్ష నేతగా గౌరవించి.. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రుల తర్వాత జగన్‌ కు ప్రమాణస్వీకారం చేయించే అవకాశం ఇచ్చామని చెబుతున్నారు.

జగన్‌ సాధారణ ఎమ్మెల్యేనే కావడంతో ఆయన కారును కూడా శాసనసభ ప్రాంగణంలోకి అనుమతించాల్సిన అవసరం ఉండదని టీడీపీ నేతలు అంటున్నారు. అయితే ఆయన మాజీ సీఎం కాబట్టి హుందాతనంగా వ్యవహరించి శాసనసభ ప్రాంగణంలోకి ప్రొటెం స్పీకర్‌ అనుమతించారని గుర్తు చేశారు.

మరోవైపు వైసీపీ సోషల్‌ మీడియా, జగన్‌ మీడియా సంస్థలు జగన్‌ ను అవమానించారని కథనాలు ప్రచురించాయి. గతంలో వైఎస్‌ జగన్‌ సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశాక ప్రతిపక్ష నేతగా చంద్రబాబుకు అవకాశమిచ్చారని గుర్తు చేశాయి.

నాడు టీడీపీ తరఫున గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లో ఐదుగురు వైసీపీకి మద్దతు ఇచ్చారని.. దీంతో చంద్రబాబుకు 18 మంది ఎమ్మెల్యేలే మిగిలారని జగన్‌ సొంత మీడియా కథనం ప్రచురించింది. నాడే జగన్‌ తలుచుకుని ఉంటే టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలను వైసీపీలో చేర్చుకుని చంద్రబాబుకు ప్రతిపక్ష నేత హోదా లేకుండా చేసేవారని పేర్కొంది. కానీ జగన్‌ అలా చేయకపోవడంతో చంద్రబాబు ప్రతిపక్ష నేతగా కొనసాగారని.. అసెంబ్లీలో జగన్‌ ప్రమాణస్వీకారం చేశాక చంద్రబాబుకు అవకాశమిచ్చారని గుర్తు చేసింది.

జగన్‌ మీడియా, సోషల్‌ మీడియా జగన్‌ కు అవమానం జరిగిందని పేర్కొంటే.. టీడీపీ నేతలు మాత్రం ఇందుకు విరుద్ధంగా చెబుతున్నారు. జగన్‌ కు ప్రతిపక్ష నేత హోదా కూడా లేనప్పటికీ మంత్రుల తర్వాత ఆయనకు ప్రమాణస్వీకారం చేసే చాన్స్‌ ఇచ్చామని అంటున్నారు. లేదంటే అక్షర క్రమంలో అందరికంటే చివర జగన్‌ ప్రమాణస్వీకారం ఉండేదని పేర్కొంటున్నారు.

Tags:    

Similar News