ఈ ఎంపీ అనుకుంటే ఆ ఎంపీ వెళ్లిపోయారే?..
అసెంబ్లీ ఎన్నికలు ముగిసి అధికారం చేతులు మారి సవాళ్లు ప్రతిసవాళ్లతో తెలంగాణ రాజకీయం రక్తికడుతోంది.
అసెంబ్లీ ఎన్నికలు ముగిసి అధికారం చేతులు మారి సవాళ్లు ప్రతిసవాళ్లతో తెలంగాణ రాజకీయం రక్తికడుతోంది. ఈలోగా ఎమ్మెల్సీ ఎన్నికలు కాస్త మంట రాజేశాయి. దానిపై ఎంపీ ఎన్నికలు ఇంకాస్త రగులుకుంటున్నాయి. అసలే.. మూడు పార్టీల మధ్య పోటీ. దీనికితగ్గట్లు అధికారం మారింది. అందులోనూ కేంద్రంలో ఉన్న పార్టీకి ఈ పార్టీ ప్రధాన ప్రత్యర్థి. దీంతోనే తెలంగాణలో ఈసారి లోక్ సభ ఎన్నికలు రంజుగా సాగడం ఖాయం. అయితే, అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే తెలంగాణలో ఓ ఎంపీ పార్టీ మారతారనే ప్రచారం పెద్దఎత్తున సాగింది. కానీ, ఇప్పుడు ఆయన కాకుండా వేరొకరు జంప్ అవడమే విశేషం.
రాములు పేరు..
తెలంగాణలో నాగర్ కర్నూల్ ఎంపీ స్థానం ప్రత్యేకత వేరు. ఖమ్మం జిల్లాకు చెందిన ప్రస్తుత డిప్యూటీ సీఎం మల్లు భట్టి పెద్దన్న అనంతరాములు ఇక్కడినుంచి పోటీ చేసి గెలిచారు. ఏపీసీసీ చీఫ్ గా పనిచేశారు. రాష్ట్రంలో, కేంద్రంలో కీలక పాత్ర పోషించారు. ఆయన హఠాన్మరణంతో భట్టి రెండో అన్న మల్లు రవి నాగర్ కర్నూల్ నుంచి ఎంపీగా పోటీ చేసి నెగ్గారు. ఈ నేపథ్యంలో మరోసారి కూడా ఆయన టికెట్ కోసం పోటీపడుతున్నారు. ప్రస్తుతం నాగర్ కర్నూల్ సిటింగ్ ఎంపీగా ఉన్నారు పి.రాములు (బీఆర్ఎస్). టీడీపీ నుంచి పలుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగానూ పనిచేశారు. ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరిన ఆయన ఎంపీ అయ్యారు. కానీ కొంతకాలంగా రాములు పార్టీ మారతారని కాంగ్రెస్ లో చేరతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైన మొదట్లో ఈ మేరకు కథనాలు వచ్చాయి. ఈయన విషయం మాత్రం ఎటూ తేలలేదు.
వెంకటేశ్ చేరు..
అచ్చం నాగర్ కర్నూల్ లాగే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పెద్దపల్లి ఎంపీ సీటు ప్రత్యేకత వేరు. అందరూ ‘కాకా’గా పిలుచుకునే కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి పలుసార్లు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం ఇది. అయితే, గత ఎన్నికల్లో ఇక్కడినుంచి బీఆర్ఎస్ తరఫున వెంకటేశ్ నేత గెలిచారు. అప్పటివరకు ఎంపీగా ఉన్న బాల్క సుమన్ ఎమ్మెల్యేగా వెళ్లడంతో ఆయనకు అవకాశం దక్కింది. తాజాగా వెంకటేశ్ నేత కాంగ్రెస్ లో చేరిపోయారు. కేటీఆర్ హామీ ఇచ్చినా.. బీఆర్ఎస్ టికెట్ పై అధినేత కేసీఆర్ తేల్చకపోవడంతోనే వెంకటేశ్ నేత కాంగ్రెస్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. కాగా, నాగర్ కర్నూల్, పెద్దపల్లి రెండూ ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాలే కావడం గమనార్హం.