ఈసారి బావ, బామ్మర్దులు ఇద్దరినీ ఓడిస్తాం!
వైసీపీ తరఫున కురుబ సామాజిక వర్గానికి చెందిన దీపిక హిందూపురం అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారని వెల్లడించారు
ఈసారి చిత్తూరు జిల్లా కుప్పంలో చంద్రబాబును, శ్రీసత్య సాయి జిల్లా హిందూపురంలో నందమూరి బాలకృష్ణను ఓడిస్తామని గనులు, అటవీ, విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటమి భయంతోనే చంద్రబాబు కుప్పంతోపాటు మరో నియోజకవర్గాన్ని కూడా వెతుక్కుంటున్నారని ఎద్దేవా చేశారు.
వైసీపీ తరఫున కురుబ సామాజిక వర్గానికి చెందిన దీపిక హిందూపురం అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారని వెల్లడించారు. అలాగే హిందూపురం పార్లమెంటు నుంచి బోయ–వాల్మికి సామాజిక వర్గానికి చెందిన శాంత బరిలో ఉంటారన్నారు. వెనుకబడిన వర్గాలకు చెందిన ఇద్దరు మహిళలకు ఒకే చోట గతంలో ఏ పార్టీ అవకాశం ఇవ్వలేదని ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో కుప్పంలో చంద్రబాబు, హిందూపురంలో బాలకృష్ణను కచ్చితంగా ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
హిందూపురంలో బాలకృష్ణ రెండుసార్లు గెలిచినా అభివృద్ధి చేయలేకపోయారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. హిందూపురం నియోజకవర్గం మానెంపల్లి గ్రామంలో ఆయన పర్యటించారు. సీఎం వైఎస్ జగన్ పాలనలో జనం సంతోషంగా ఉన్నారని తెలిపారు. చంద్రబాబు ఎన్నికల హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు.
టిక్కెట్ల కేటాయింపులో ఉన్న నాయకుల మధ్య ఉన్న కొంత అసంతృప్తి త్వరలో సర్దుకుంటుందని చెప్పారు. టీడీపీ– జనసేన తరపున ఎవరు పోటీ చేస్తారో ఇప్పటిదాకా స్పష్టత లేదని ఎద్దేవా చేశారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఉనికి కోల్పోయిందన్నారు.
ఓట్లు చీల్చేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి మండిపడ్డారు. ఈ కుట్రలను అధిగమిస్తామని తెలిపారు. ఎన్నికల్లో సచివాలయాల సిబ్బందిని తాము ఉపయోగించటం లేదని చెప్పారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు అవగాహన లేక ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారని మండిపడ్డారు. నిజమైన రాయలసీమ ద్రోహి చంద్రబాబే అని ధ్వజమెత్తారు.
తమ ప్రభుత్వం 99 శాతం లబ్ధిదారులకు పథకాలు అందజేసిందని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. సీఎం జగన్ వెనుకబడిన వర్గాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని గుర్తు చేశారు. ఇందులో భాగంగా బీసీలకు సముచిత స్థానం కల్పిస్తున్నారని చెప్పారు.