ఒకే ఒక్క‌డు.. సునామీకి ఎదురీదిన పెద్దిరెడ్డి!

ఏపీలో ఓట‌ర్లు సృష్టించిన సునామీలో వైసీపీ నాయ‌కులు, ఉద్ధండ నేత‌లు కూడా.. కొట్టుకుపోయారు

Update: 2024-06-04 13:40 GMT

ఏపీలో ఓట‌ర్లు సృష్టించిన సునామీలో వైసీపీ నాయ‌కులు, ఉద్ధండ నేత‌లు కూడా.. కొట్టుకుపోయారు. మంత్రి బొత్స స‌త్యనారా యణ కుటుంబ స‌మేతంగా మొత్తం మట్టిక‌రిచారు. టీడీపీ కూట‌మి ప్ర‌భంజ‌నానికి చెట్టుకొక‌రు పుట్ట‌కొక‌రు అన్న‌ట్టుగా మంత్రులు ఘోర ప‌రాజ‌యం పాల‌య్యారు. ఎవ‌రూ మిగ‌ల‌రా? అన్న‌ట్టుగా సృష్టించిన ఈ సునామీలో బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి నుంచి బూడి ముత్యాల‌నాయ‌కుడు, ఆదిమూల‌పు సురేష్‌, తానేటి వ‌నిత‌, ఉష శ్రీచ‌ర‌ణ్‌, విడ‌ద‌ల ర‌జ‌నీ, పినిపే విశ్వ‌రూప్‌, చెల్లుబోయి న వేణు.. ఇలా ఉన్న మంత్రులు అందరూ కూట‌మికి అనుకూలంగా ప్ర‌జ‌లు కురిపించిన‌ ఓట్ల వ‌ర్షానికి గ‌ల్లంత‌య్యారు.

అయితే.. ఇంత సునామీలోనూ..వైసీపీ అధినేత‌ జ‌గ‌న్ విజ‌యం ద‌క్కించుకున్నారు.ఆయ‌న‌తోపాటు.. ఓడి గెలిచిన చందంగా .. అతి క‌ష్టం మీద పుంగ‌నూరు నుంచి మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి ఒక్క‌రు మాత్ర‌మే విజ‌యం ద‌క్కించుకున్నారు. ఇక్క‌డ బ‌ల‌మైన పోటీ ఏర్ప‌డింది. ప్ర‌తి రౌండ్‌లోనూ మెజారిటీ మారిపోయింది. ఒకానొక ద‌శ‌లో పెద్దిరెడ్డి కూడా ఓట‌మి అంచుల్లోకి వెళ్లిపోయారు. బోడే రామ‌చంద్ర‌యాద‌వ్ బీసీవై త‌ర‌ఫున బ‌ల‌మైన పోటీ ఇచ్చారు. ఇక‌, టీడీపీ నేత‌.. చ‌ల్లా రామ‌చంద్రారెడ్డి కూడా.. నువ్వా.. నేనా అన్న‌ట్టుగా పోరాటం చేశారు.

మొత్తంగా మంగ‌ళ‌వారం ఉద‌యం నుంచి హోరా హోరీగా సాగిన పుంగ‌నూరు ఫైట్‌లో పెద్దిరెడ్డి విజ‌యం ద‌క్కించుకున్నారు. ఈయ‌న‌కు నిజానికి బ‌ల‌మైన కోట‌రీ ఉంది. అయినా.. కూడా.. ఈ సారి పెద్ద ఎత్తున పోటీ ఏర్ప‌డింది. ఇక్క‌డ పెద్దిరెడ్డిని ఓడించేందుకు ప‌లు శ‌క్తులు చేతులు క‌లిపాయి. అయిన‌ప్ప‌టికీ.. వాటిని ఛేదించుకుని.. చివ‌రి రెండు మూడు రౌండ్ల‌లో ఆధిక్య‌త‌ను ప్ర‌ద‌ర్శించారు. 6538 ఓట్ల మెజారిటీతో బ‌తుకు జీవుడా అనుకుంటూ.. పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి విజ‌యం ద‌క్కించుకున్నారు. మొత్తంగా జ‌గ‌న్ కేబినెట్‌లోని మంత్రుల్లో పెద్ది రెడ్డి ఒక్క‌రే విజ‌యం ద‌క్కించుకోవ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News