రూ.10 కోట్ల స్కాం చేసిన ఆఫీస్ ఫ్యూన్
ఆలోచనలు సరిగా లేనోడు ఎంత చిన్నస్థాయిలో ఉన్నప్పటికి.. తప్పుడు ఆలోచనలు మాత్రం పెద్దగా ఉంటాయి.
ఆలోచనలు సరిగా లేనోడు ఎంత చిన్నస్థాయిలో ఉన్నప్పటికి.. తప్పుడు ఆలోచనలు మాత్రం పెద్దగా ఉంటాయి. ఆ మాటకు నిదర్శనంగా ఉంటుంది ఇప్పుడు చెప్పే ఉదంతం. మధ్యప్రదేశ్ లో వెలుగు చూసిన ఒక ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది. కారణం.. అక్కడి ప్రభుత్వ ఆఫీసులో ఫ్యూన్ గా పని చేసే వ్యక్తి ఏకంగా రూ.10కోట్ల కుంభకోణానికి పాల్పడటం ఇప్పుడు షాకింగ్ గా మారింది.
మధ్యప్రదేశ్ విత్తన ధ్రువీకరణ సంస్థలో ఫ్యూన్ గా పని చేసే బ్రిజేంద్రదాస్ నామ్ దేవ్ అనే వ్యక్తి మరో ఐదుగురితో కలిసి రూ.10 కోట్ల స్కాంకు పాల్పడ్డాడు. ప్యూన్ గా పని చేసే దాస్ ను డ్రాయింగ్.. డిస్బర్సింగ్ అధికారిగా పేర్కొంటూ బ్యాంకుల్లో పని చేస్తున్న మరికొందరు నిందితుల సాయంతో ఈ భారీ స్కెచ్ వేశారు. విత్తన ధ్రువీకరణ విభాగానికి చెందిన నకిలీ పత్రాలు.. డాక్యుమెంట్లను చూపించి రూ.10 కోట్లను అతని ఖాతాకు బదిలీ చేశారు.
ఆ తర్వాత.. ఈ భారీ మొత్తాన్ని వేర్వేరుగా 50 ఖాతాలకు మళ్లించారు. ఆ డబ్బుల్ని ప్రభుత్వం నుంచి లబ్థి పొందేందుకు వీలుగా భూములు కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారు. అలా కొనుగోలు చేసిన భూమిలో జాతీయ పశు సంవర్థక పథకం కింద ప్రాజెక్టులను స్టార్ట్ చేసి.. రాయితీలను పొందాలన్న ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా శాఖాపరమైన ఇబ్బందులు రాకుండా ఉండేందుకు నకిలీ ఫైళ్లు.. సీళ్లను సైతం తయారు చేశారు.
తాము పక్కాగా ప్లాన్ చేసినట్లుగా నిందితులు భావించినప్పటికీ.. విత్తన ధ్రువీకరణ అధికారి సుఖ్ దేవ్ ప్రసాద్ అహిర్వార్ కు సందేహం రావటంతో మొత్తం ప్లాన్ బెడిసికొట్టింది. ఆయన పోలీసులకు కంప్లైంట్ ఇవ్వటం.. వారు రంగంలోకి దిగటంతో మొత్తం వ్యవహారం వెలుగు చూసింది. వెంటనే.. నిందితుల బ్యాంక్ ఖాతాల్ని స్తంభింపజేసి.. వారి వద్ద ఉన్న నకిలీ పత్రాలు.. భూములను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్ని జైలుకు పంపారు.