ఏం జరుగుతోంది? విపక్ష నేతల ఫోన్లు హ్యాక్.. దుమారం.. యాపిల్ వివరణ!
పూర్వం రాజులు తమ ప్రత్యర్థుల గురించి తెలుసుకోవడానికి వేగులను వారి రాజ్యాల్లోకి పంపేవారు.
పూర్వం రాజులు తమ ప్రత్యర్థుల గురించి తెలుసుకోవడానికి వేగులను వారి రాజ్యాల్లోకి పంపేవారు. అక్కడి వివరాలను తెలుసుకొచ్చిన వేగులు తమ రాజుకు చేరవేసి కర్తవ్యం నెరవేర్చేవారు. కానీ, ఇప్పుడు హైటెక్ కాలం కదా..? అంతా ఫోన్ల మీదనే నడిచిపోతోంది. ఈ క్రమంలో పుట్టుకొచ్చినదే ఫోన్ హ్యాకింగ్. వాస్తవానికి ఇది పెద్ద నేరం. వ్యక్తిగత గోప్యతకు భంగం. అందులోనూ భారత్ వంటి ప్రజాస్వామ్య దేశంలో ఫోన్ హ్యాకింగ్ అనేది తీవ్ర దుమారం రేపుతోంది. గతంలోనూ వివిధ రాష్ట్రాల్లో ఈ హ్యాకింగ్ రగడ జరిగింది.
ఎన్నికల ముంగిట కలకలం
దేశంలో ప్రస్తుతం ఎన్నికల వాతావరణం నడుస్తోంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు పోలింగ్ నెల రోజుల్లో జరగనుంది. మరోవైపు ఆరు నెలల్లో పార్లమెంటు ఎన్నికలున్నాయి. ఇలాంటి సమయంలో ప్రతిపక్షాలు ఇండియా పేరిట కూటమి కట్టి మోదీ ప్రభుత్వాన్ని దించేస్తామని ప్రతిన బూనాయి. అయితే, మోదీ ప్రభుత్వం సైతం విపక్షాలను దీటుగా ఎదుర్కొనే వ్యూహాలను పన్నుతోంది. ఇలాంటి హాట్ హాట్ వాతావరణం ఉన్న సమయంలో.. ఉరుములు లేని పిడుగులా మంగళవారం ఓ వార్త హల్ చల్ చేసింది. అదేమంటే విపక్ష ఎంపీల ఐ ఫోన్ల కు మంగళవారం హ్యాకింగ్ అలర్ట్ మెసేజ్ రావడం.
యాపిలే పంపిందా..?
‘ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే హ్యాకర్లు మీ ఫోన్ హ్యాక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు’ అంటూ విపక్ష ఎంపీలకు మంగళవారం అలెర్ట్ వచ్చింది. దీంతో.. కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. తీవ్ర వివాదాస్పద అంశం అయ్యేదిగానూ కనిపించింది. ఈ నేపథ్యంలో ఐ ఫోన్ తయారీ సంస్థ యాపిల్ స్పందించింది. హ్యాకింగ్ ప్రయత్నం ఏమీ జరగలేదంది. ఈ తరహా నోటిఫికేషన్లు ఒక్కోసారి నకిలీవి కావొచ్చని స్పష్టం చేసింది. ‘‘ఈ అలర్ట్ నోటిఫికేషన్లను నిర్దిష్టంగా అధికారికంగా పనిచేసే హ్యాకర్ల పనిగా చెప్పలేం. హ్యాకింగ్ చేసేందుకు వారు సరికొత్త ఆధునిక పద్ధతులను అవలంబిస్తారు. అవసరమైన నిధులు, టెక్నాలజీ కూడా వారికి ఉంటాయి. హ్యాకింగ్ దాడులు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. వీటిని గుర్తించడం నిఘా సంకేతాలపై ఆధారపడి ఉంటుంది. మా సంస్థ ఫోన్లకు వచ్చే అలర్ట్ నోటిఫికేషన్లు ఒక్కోసారి నకిలీ హెచ్చరికలు అయి కూడా ఉండొచ్చు. లేదా కొన్ని దాడులను గుర్తించలేం కూడా..!’’ అని స్పష్టం చేసింది.
అసలు అలర్ట్ మెసేజ్ లు ఎందుకొచ్చాయి..
ఇంత సుదీర్ఘ వివరణ ఇచ్చిన యాపిల్ మాత్రం ఒక విషయాన్ని దాచింది. విపక్ష ఎంపీలకు హ్యకింగ్ అలర్ట్ మెసేజ్‌లు ఎందుకు వచ్చాయన్నది చెప్పేది లేదని పేర్కొంది. అలర్ట్ నోటిఫికేషన్ జారీ కారణాలను మేం వెల్లడించలేం. అదే చేస్తే..హ్యాకర్లు మున్ముందు మా నిఘా నుంచి తప్పించుకునే చాన్సుంది’’ అని వివరించింది. కాగా, మంగళవారం మధ్యాహ్నం ప్రతిపక్ష ఎంపీలకు వచ్చిన అలర్ట్ మెజేస్ లు యాపిల్ సంస్థ పంపినవిగానే భావించారు. అందులో వారి ఐడీ ఆధారంగా స్టేట్ స్పాన్సర్డ్ అటాకర్స్ (ప్రభుత్వం ఆధ్వర్యంలోని హ్యాకర్ లు) ఐఫోన్, ఈ-మెయిల్స్ హ్యాక్ చేస్తున్నట్లు హెచ్చరించింది. డేటా దొంగలించే ప్రమాదం ఉందని, జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
వివాదాస్పద ఎంపీలకు..
అయితే, యాపిల్ సంస్థ వివరణకు ముందు అలర్ట్ అందుకున్న ఎంపీల్లో టీఎంసీకి చెందిన మహువా మొయిత్రా, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, శివసేన(ఉద్దవ్ వర్గం) ఎంపీ ప్రియాంక చతుర్వేది ఉండడం గమనార్హం. కాంగ్రెస్ నేతలు పవన్ ఖేరా సహా పలువురు ప్రతిపక్ష నేతలు తమ ఫోన్‌లు, ఈమెయిల్స్‌లో యాపిల్ నుంచి మెసేజ్‌లు వచ్చాయని, రాష్ట్ర ప్రాయోజిత దాడికి పాల్పడే అవకాశం ఉందని ఆరోపించారు. సోషల్ మీడియా ఖాతాల్లో యాపిల్ నుంచి వచ్చిన అలర్ట్ మెసేజ్ స్క్రీన్ షాట్లను షేర్ చేశారు. ఈ పరిణామాలపై కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు. ‘‘ఈ అలర్ట్ నోటిఫికేషన్లు భారత్‌లో మాత్రమే గాక, 150 దేశాల్లోని యూజర్లకు వచ్చినట్లు యాపిల్ వర్గాలు స్పష్టం చేశాయి. ఒక్కోసారి నకిలీ అలర్ట్‌లు కూడా వస్తుంటాయని ఆ సంస్థ పేర్కొంది. దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఆదేశించాం. ఈ మెసేజ్‌లు వచ్చినవారు దర్యాప్తునకు సహకరించాలని కోరుతున్నాం’’ అని చెప్పారు.