వైసీపీ ఎంపీ బోస్ విధేయతకు వీర సవాల్ !?
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రాజకీయాల్లో సీనియర్ మోస్ట్ లీడర్లలో పిల్లి సుభాష్ చంద్రబోస్ ఒకరు.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రాజకీయాల్లో సీనియర్ మోస్ట్ లీడర్లలో పిల్లి సుభాష్ చంద్రబోస్ ఒకరు. ఆయన 1989లో తొలిసారి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి గెలిచారు. ఆయనకు వైఎస్సార్ సీఎం అయ్యాక కానీ రాజకీయ దశ తిరగలేదు. ఆయన వైఎస్సార్ హయాంలోనే మంత్రి అయ్యారు. పూర్తిగా ఒక వెలుగు వెలిగారు.
అదే విధంగా 2009లో రెండవసారి గెలిచి మంత్రి అయ్యారు. కానీ వైఎస్సార్ మరణానంతరం ఆయన కాంగ్రెస్ నుంచి దూరమైన వైఎస్సార్ కుటుంబం పట్ల విధేయత చూపించారు. అలా తన మంత్రి పదవిని వదులుకున్నందుకు జగన్ ఆయన పట్ల చూపించిన అభిమానమూ ఎన్నదగినదే. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి గెలిచిన బోస్ నూ 2014లో జరిగిన ఎన్నికల్లో మాత్రం ఓటమి చెందారు. 2019లోనూ మరోసారి ఓడినా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆయనకు జగన్ ఎమ్మెల్సీగా చాన్స్ ఇచ్చి రెవిన్యూ వంటి కీలక శాఖను ఇచ్చి ఉప ముఖ్యమంత్రి హోదాను ఇచ్చారు.
ఆ తరువాత ఆయనను రాజ్యసభకు పంపించారు. 2024లో జరిగిన ఎన్నికల్లో ఆయన కుమారుడు ప్రకాష్ కి వైసీపీ టికెట్ ఇచ్చారు. మరి ఇన్ని చేసిన జగన్ వైపు పిల్లి ఉంటారా లేక టీడీపీ లోకి జంప్ అవుతారా అన్న చర్చ అయితే ఇపుడు సాగుతోంది.
ఎన్నడూ లేనంతగా పిల్లి సుభాష్ చంద్రబోస్ మీద విపరీతంగా ప్రచారం అయితే సాగుతోంది. ఆయన టీడీపీలోకి దాదాపుగా వచ్చేసినట్లే అని కూడా అంటున్నారు. ఆయన వస్తే కనుక రాచమర్యాదలతో చూసుకుంటామని టీడీపీ నేతలు హామీ ఇస్తున్నారుట.
పిల్లి అయితే ఈ ప్రచారాన్ని కొట్టేస్తున్నారు. కానీ ఆయన మనసు అంతా కుమారుడి మీద ఉంది. ప్రకాష్ కి రాజకీయంగా భవిష్యత్తు ఇవ్వాలని చూస్తున్నారు. కుమారుడి విషయంలో ఏమైనా భరోసా దక్కితే ఆయన జంప్ చేస్తారూ అని అంటున్నారు.
ఇక ఆయన పదవీ కాలం రెండేళ్ళ పాటు ఉంది. 2020 జూన్ లో నెగ్గిన పిల్లి 2026 జూన్ లో రాజ్యసభ సభ్యునిగా పదవీ విరమణ చేస్తారు. ఈ విలువైన రెండేళ్ల కాలం దీపం లాంటిది. ఎందుకంటే టీడీపీకి రాజ్యసభలో ఎంపీలు ఎవరూ లేరు. మరో రెండేళ్ళు వారు ఆగాలి. అయితే అక్కడ కూడా తమ హవా చాటుకోవాలని టీడీపీ చూస్తోంది. దాంతోనే పిల్లి లాంటి వైసీపీ వీర విధేయులకే ఏకంగా గేలం వేసి జగన్ కి బిగ్ షాక్ ఇవ్వాలని అనుకుంటోంది.
ఇక పిల్లి లాంటి వారే బయటకు వస్తే వైసీపీ పని అయిపోయిందని చెప్పాలన్నదే టీడీపీ మాస్టర్ ప్లాన్. దాంతో పాటుగా రాజ్యసభలో వీలైనంత వరకూ వైసీపీని తగ్గిస్తే వైసీపీతో బీజేపీ రాజకీయ అవసరాలు కూడా కట్ అవుతాయని టీడీపీ అసలైన వ్యూహం అంటున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే పిల్లి విషయానికి వస్తే ఇపుడు నిర్ణయం తీసుకుంటేనే ఆయనకు కానీ కుమారుడికి కానీ రాజకీయంగా మేలు జరుగుతుంది అని అంటున్నారు.
అలా కాకుండా రెండేళ్ల పదవీ కాలాన్ని వైసీపీలో కొనసాగించినా ఆ తరువాత ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే పిల్లి విధేయతకే అసలైన సవాల్ గా ఈ ప్రచారం ఉంది అని అంటున్నారు. ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో అని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. ఆయన వర్గీయులు మాత్రం తూచ్ ఇదంతా వట్టిదే అని ఖండిస్తున్నారు. రాజకీయాల్లో ఎపుడు ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు కాబట్టి పిల్లి ఎపిసోడ్ తూర్పు గోదావరి జిల్లా పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా ఉంది అని అంటున్నారు.