చానల్ వాళ్లకు కనిపించే పిన్నెల్లి పోలీసులకు కనిపించరా?

తెగింపునకు.. బరితెగింపునకు తేడా రెండు అక్షరాలే అయినప్పటికీ అర్థం విషయంలో చాలా తేడా ఉంటుంది.

Update: 2024-05-22 04:37 GMT

తెగింపునకు.. బరితెగింపునకు తేడా రెండు అక్షరాలే అయినప్పటికీ అర్థం విషయంలో చాలా తేడా ఉంటుంది. బరితెగింపునకు కేరాఫ్ అడ్రస్ గా వ్యవహరిస్తూ అడ్డంగా బుక్ అయిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డి ఘనకార్యం చిట్టివీడియోతో ప్రపంచం మొత్తానికి తెలిసిపోయింది. అయినప్పటికీ ఆయన మీద చర్యల విషయంలో ఏపీ పోలీసులు వ్యవహరించిన తీరు.. పోలీసు శాఖపై పలు అనుమానాలు వ్యక్తమయ్యేలా మార్చిందని చెప్పాలి. పోలింగ్ వేళలో ఈవీఎంలపై తన ప్రతాపాన్ని ప్రదర్శించిన పిన్నెల్లి.. పోలింగ్ తర్వాత మాచర్ల నియోజకవర్గంలో చోటుచేసుకున్న హింసా కార్యక్రమాలకు ఆయనే బాధ్యుడిగా పలువురు ఆరోపిస్తున్నారు. అయినప్పటికీ ఆయన మీద కేసులు నమోదు చేసే ధైర్యం పోలీసులు చేయట్లేదన్న విమర్శ అంతకంతకూ ఎక్కువ అవుతోంది.

తాజాగా ఈవీఎంను ధ్వంసం చేసిన వీడియో బయటకు రావటంతో ఆయన మీద కేసు నమోదు చేయక తప్పలేదు. అరెస్టు భయంతో మూడు.. నాలుగు రోజులు క్రితం మాచర్ల నుంచి తెలంగాణకు వెళ్లిపోయిన ఆయన.. తాను వెళ్లే దారి మధ్యలో తన గన్ మెన్లను వెళ్లిపోవాలంటూ సూచించి.. తాను వెళ్లిపోయారు. ఈవీఎంను పగలుకొట్టిన వీడియో బయటకు వచ్చిన తర్వాత కూడా చర్యల విషయంలో పోలీసులు మీనమేషాలు లెక్కిస్తున్నారని చెబుతున్నారు.

తాను ఎలాంటి తప్పు చేయలేదని వాదిస్తున్న పిన్నెల్లి హైదరాబాద్ లో ఉన్నట్లు తెలిసినా.. ఆయనపై చర్యలు తీసుకునే ధైర్యం చేయట్లేదు. కనిపించకుండా పోయారని పోలీసులు చెబుతున్న పిన్నెల్లిని మీడియా ప్రతినిధులు.. చానల్ ప్రతినిధులు ఇంటర్వ్యూలు తీసుకుంటున్నప్పుడు ఏపీ పోలీసులకు ఆయన ఆచూకీ ఎందుకు లభించటం లేదన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. తాను ఎక్కడికి పారిపోలేదని.. తాను ఏ తప్పు చేయలేదని చెబుతున్న పిన్నెల్లి మాటలు చూస్తే అవాక్కుఅవ్వాల్సిందే.

అబద్ధాన్ని ఎంత బాగా చెబుతారన్న విషయం ఈవీఎంను ధ్వంసం చేసిన వీడియో చూసిన తర్వాత ఆయన మాటల్ని వింటే అర్థమవుతుంది. ఒక మీడియా చానల్ తో మాట్లాడిన పిన్నెల్లి.. తాను ఎక్కడికి పారిపోలేదని.. పారిపోవాల్సిన అవసరం లేదన్న ఆయన.. ‘‘నా మీద ఏమైనా కేసులు ఉన్నాయా? నేనేమైనా గొడవలు చేయించానా? గొడవలు చేయించింది మీరే. మాచర్ల రావాలంటే రెండు గంటలు’’ అంటూ విరుచుకుపడుతున్నారు. టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీక్రిష్ణ దేవరాయులు.. అసెంబ్లీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డిని తీవ్ర పదజాలంతో తిట్టిపోస్తున్న పిన్నెల్లి తీరును పోలీసులు టీవీల్లో చూస్తూఉంటున్నారే తప్పించి హైదరాబాద్ వెళ్లి అదుపులోకి ఎందుకు తీసుకోరు? అన్నదిప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇంత జరిగిన తర్వాత ఏపీ పోలీసుల యాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.

Tags:    

Similar News