పోలింగ్ బూత్ లో పిన్నెల్లి అరాచకం.. కెమేరా కంటికి చిక్కేసింది!

పిన్నెల్లి దురాగతానికి సంబంధించిన వీడియోను చూసిన వారంతా షాక్ తింటున్నారు.

Update: 2024-05-22 04:02 GMT

హద్దులన్నీ దాటేశారు మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డి. పలు వివాదాల్లో ఆయన పేరు వినిపించటం మామూలే అయినా.. ఆయన తీరు ఎలా ఉంటుందన్న విషయాన్ని కళ్లకు కట్టినట్లుగా తాజాగా వెల్లడైన వెబ్ కెమేరా ఫుటేజ్ లోకానికి చెప్పేసింది. బాధ్యత కలిగిన ఎమ్మెల్యేగా ఉంటూ.. పోలింగ్ జరిగే వేళలో పోలింగ్ బూత్ లోకి ప్రవేశించి.. ఈవీఎంను తీసుకొని నేల మీదకు విసిరికొట్టిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. తానో ఎమ్మెల్యే అన్న విషయాన్ని మర్చిపోయిన ఆయన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిమిషాల వ్యవధిలో ఈ చిట్టి వీడియో వైరల్ గా మారింది.

పిన్నెల్లి దురాగతానికి సంబంధించిన వీడియోను చూసిన వారంతా షాక్ తింటున్నారు. ఇంతకు మించిన బరితెగింపు ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. మాచర్ల నియోజకవర్గంలో తన అరాచకాలతో నిత్యం రగులుతున్న రావణకాష్ఠంలా మార్చేసిన పిన్నెల్లి ఎంతలా చెలరేగిపోతారన్న దానికి నిలువెత్తు నిజం వీడియో రూపంలో బయటకు వచ్చిందంటున్నారు. మాచర్లకు నాలుగోసారి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న పిన్నెల్లి తీరు మరీ ఇంతలా ఉంటుందా? అంటూ ముక్కున వేలేసుకునేలా ఉంది.

ప్రతి ఎన్నికల్లోనూ ఏజెంట్లను.. ప్రజలను భయపెడుతూ ప్రతిపక్ష పార్టీ ఏజెంట్లను బెదిరిస్తూ ఏకపక్షంగా ఓటింగ్ చేయించుకోవటం పిన్నెల్లికి అలవాటన్న తీవ్రమైన ఆరోపణ ఆయన మీద ఉంది. అలాంటి ఆయన.. తనకు వ్యతిరేక వాతావరణం నెలకొంటే ఎంత తీవ్రంగా వ్యవహరిస్తారన్న దానికి నిదర్శనంగా పోలింగ్ రోజున చోటు చేసుకున్న ఉదంతం కాస్తంత ఆలస్యంగా బయటకు వచ్చింది.

మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని రెంటచింతల మండలంలోని పాల్వాయిగేటు తెలుగుదేశం పార్టీకి పట్టున్న గ్రామం. పోలింగ్ రోజున ప్రతిపక్షానికి చెందిన టీడీపీ అభ్యర్థి బ్రహ్మారెడ్డికి ఎక్కువ ఓట్లు పడుతున్నాయన్న కోపంతో ఊగిపోయిన ఆయన.. తన అనుచరగణాన్ని వెంటబెట్టుకొని పోలింగ్ స్టేషన్ లోకి రావటమే కాదు.. నేరుగా ఈవీఎం ఉన్న ప్లేస్ కు వెళ్లి.. ఈవీఎంను రెండు చేతులతో ఎత్తి.. నేలకేసి బలంగా కొట్టారు. ఈవీఎంతో పాటు వీవీ ప్యాట్ కూడా కింద పడి ధ్వంసమైంది.

ఇంత చేసిన తర్వాత కూడా ఆయన ఉక్రోషం తగ్గలేదు. అక్కడే ఉన్న తెలుగుదేశం పార్టీకి చెందిన ఏజెంట్ కు వేలు చూపించి వార్నింగ్ ఇస్తూ బయటకు వెళ్లిపోయిన వైనం అక్కడి సీసీ కెమేరాలో నిక్షిప్తమైంది. నిబంధనలకు విరుద్దంగా పోలింగ్ బూత్ లోకి దూసుకెళుతున్నా పోలీసులు అడ్డుకోలేదు. ఆయన పోలింగ్ బూత్ లోకి వెళ్లినంతనే అక్కడ విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది లేచి నిలబడి నమస్కారం పెట్టటం వీడియోలో కనిపించింది.

ఈవీఎంను నేలకేసి కొట్టి.. ధ్వంసం చేసిన నేపథ్యంలో అక్కడే ఉన్న తెలుగుదేశం పార్టీకి చెందిన ఏజెంట్ నంబూరి శేషగిరిరావు ఎమ్మెల్యేపై దూసుకెళ్లగా.. ఆయన అనుచరుల్లో ఒకరు పిడిగుద్దులు గుద్దారు. ఎమ్మెల్యేపైకి వెళుతున్న వేళ.. ఆయన అనుచరులు బలంగా పట్టుకొని ఆపేశారు. ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎంను విసిరికొట్టిన సమయంలో అక్కడే లోక్ సభకు ఓటేస్తున్న ఓటరు భయంతో అక్కడి నుంచి పారిపోవటం.. విధులు నిర్వర్తిస్తున్న మహిళా సిబ్బంది భయంతో ఒక మూలకు వెళ్లిపోవటంతో సహా అన్ని అంశాలు కెమేరాలో రికార్డు అయ్యాయి.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈవీఎం ధ్వంసం అయిన తర్వాత పోలీసులు నమోదు చేసిన కేసు మరింత షాకింగ్ గా మారింది. ఎమ్మెల్యే స్వయంగా వచ్చి ఈవీఎంను ధ్వంసం చేస్తే.. గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఈవీఎంను ధ్వంసం చేసినట్లుగా.. పోలింగ్ సిబ్బంది గుర్తు పట్టలేకపోయినట్లుగా కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో పిన్నెల్లి పేరును ప్రస్తావించలేదు. పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రం రెండు బూత్ లు ఉన్నాయి. మొత్తం1464 మంది ఓటర్లు ఉన్నారు. మాచర్ల నియోజకవర్గంలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ఇది కూడా ఉంది.

అయినప్పటికీ అక్కడ ఇద్దరు కానిస్టేబుళ్లను మాత్రమే విధులకు వేయటం గమనార్హం. పోలింగ్ కేంద్రంలో ఇంతటి అరాచకానికి పాల్పడిన పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డిపై చర్యలు తీసుకోవటం తర్వాత.. ఇంత దారుణానికి పాల్పడిన వైనంలో అతని పేరును కూడా ప్రస్తావించకపోవటం చూస్తే.. పోలీసులు ఎలా పని చేశారన్నది అర్థమవుతుందని మండిపడుతున్నారు.

వీడియో వెలుగులోకి వచ్చిన తర్వాత పోలీసు అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఈ వీడియోపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. అయితే.. అధికారులు మాత్రం ఈవీఎంలను ధ్వంసం చేసిన ఘటనలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డిని నిందితుడిగా చేర్చినట్లుగా పేర్కొన్నారు. పోలీసుల తీరును తీవ్రంగా పరిగణించిన కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఘటనలో ప్రమేయం ఉన్న వ్యక్తులందరిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి చెప్పాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనాను ఆదేశించారు. కొసమెరుపు ఏమంటే.. ఈవీఎం ధ్వంసం వీడియో బయటకు వచ్చిన వేళలో ఒక మీడియా చానల్ తో మాట్లాడిన పిన్నెల్లి.. ‘‘నేనెక్కడా గొడవలు చేయలేదు. తప్పుడు ప్రచారం చేస్తున్నారు’’ అంటూ ముక్తాయించారు. నిజమే..ఆయన ఎక్కడా ఎలాంటి గొడవలు చేయలేదు.. తనకు వ్యతిరేకంగా ఓట్లను నిక్షిప్తం చేస్తూ.. చిరాకు పెట్టించే జస్ట్ ఈవీఎంను పగలగొట్టారంతే.

Tags:    

Similar News