యువ‌త కోసం 'పీఎం ప్యాకేజీ'.. ఏంటింది? ఎలా ఉంటుంది?

దేశంలో నిరుద్యోగ స‌మ‌స్య‌ను త‌గ్గించేందుకు కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు వ్యూహాత్మ‌కంగా అడు గులు వేసింది.

Update: 2024-07-23 09:00 GMT

దేశంలో నిరుద్యోగ స‌మ‌స్య‌ను త‌గ్గించేందుకు కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు వ్యూహాత్మ‌కంగా అడు గులు వేసింది. ప్ర‌భుత్వ ఉద్యోగాల‌ను 4 కోట్ల మేర‌కు వ‌చ్చే ఐదేళ్ల‌లో క‌ల్పిస్తామ‌ని చెబుతూనే.. మ‌రోవైపు.. `పీఎం ప్యాకేజీ` పేరుతో భారీ ఎత్తున ఉద్యోగ క‌ల్ప‌న‌కు పెద్ద పీట వేసింది. ముఖ్యంగా ఐదు విభాగాలుగా పీఎం ప్యాకేజీ ప‌నిచేయ‌నుంది.

1) చిన్న, మ‌ధ్య త‌ర‌హా ప‌రిశ్ర‌మల అభివృద్ది: దీనిలో ఉపాధి క‌ల్ప‌న రంగాల‌ను ఎంచుకుని.. ప‌నిచేసే వారికి.. ప‌న్ను మిన‌హాయింపులు.. రుణాలు ఇస్తారు. త‌ద్వారా.. ఈ ప‌రిశ్ర‌మ‌లు అభివృద్ధి చెందుతాయ‌ని ఆశిస్తున్నారు.

2) నూత‌న సీడ్ బ్యాంకులు: వీటి ద్వారా ఉపాధి క‌ల్ప‌న‌కు రుణాలు ఇప్పిస్తారు. త‌ద్వారా.. ఉద్యోగాల క‌ల్ప‌న‌కు ప్రాధాన్యం ఇస్తారు.

3) తొలిసారి ఉద్యోగులకు: తొలిసారి ఉద్యోగంలో చేరేవారికి ఒక నెల వేతనం మూడు వాయిదాల్లో గరిష్ఠంగా రూ.15 వేలు చెల్లిస్తారు. నెలకు గరిష్ఠంగా రూ.లక్ష లోపు వేతనం ఉన్నవారు అర్హులు. దీనివల్ల 210 లక్షల మంది యువతకు లబ్ధి చేకూరుతుందని ఆశిస్తున్నారు.

4) కార్పొరేట్ సెక్టార్‌: 500 పెద్ద కంపెనీల్లో కోటి మంది యువతకు ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇలా ఇచ్చే కంపెనీల‌కు ప్రోత్సాహ‌కాలు.. ప‌న్ను రాయితీలు అందుతాయి.

5) నైపుణ్యాభివృద్ధి: ఉపాధి క‌ల్ప‌న రంగంలో నైపుణ్యానికి పెద్ద పీట వేస్తూ.. నిరుద్యోగుల‌కు నైపుణ్యం ఇచ్చేందుకు ప్రాధాన్యం ఇస్తారు. పై నాలుగు రంగాల‌కు రూ.2 ల‌క్ష‌ల కోట్లు ఖ‌ర్చు చేస్తామ‌ని ప్ర‌క‌టించ‌గా.. కేవ‌లం నైపుణ్య రంగానికి మాత్ర‌మే రూ.1.48 ల‌క్ష‌ల కోట్ల‌ను ఖ‌ర్చు చేయ‌నున్న‌ట్టు వివ‌రించారు.

అవి కాకుండా..

పైన పేర్కొన్న పీఎం ప్యాకేజీనే కాకుండా.. మ‌రికొన్ని అంశాల‌ను కూడా కేంద్ర బ‌డ్జ‌ట్లో పేర్కొన్నారు.

+ వంద నగరాల్లో ప్లగ్‌ అండ్‌ ప్లే తరహాలో పారిశ్రామిక పార్కులు.. ఇది ఉపాధి క‌ల్ప‌నా రంగంగా దోహ‌ద ప‌డ‌నుంది.

+ 12 విస్తృతస్థాయి పారిశ్రామిక అభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు ద్వారా ఉద్యోగాల క‌ల్ప‌న‌కు పెద్ద‌పీట‌.

+ పారిశ్రామిక ప్రాంతాల్లో పనిచేసే కార్మికుల కోసం అద్దె గృహాల నిర్మాణం.. కార్మికుల నివాసం కోసం పారిశ్రామిక కేంద్రాల్లో డార్మిటరీ తరహా ఇళ్ల నిర్మాణం ద్వారా వ‌ల‌స కార్మికుల‌కు మెరుగైన సౌక‌ర్యాలు క‌ల్ప‌న‌.

+ తయారీరంగంలో కొత్త ఉద్యోగులకు నెల జీతం అందుతుంది.. అదనపు ఉద్యోగాలు కల్పించే కంపెనీలకు అదనపు ప్రోత్సాహం ఉంటుంది.

Tags:    

Similar News