ఆళ్లపై ‘ఆమె’ కేసు!
మాజీ ఉప ముఖ్యమంత్రి, వైసీపీ మాజీ నేత ఆళ్ల నానిపై చీటింగ్ కేసు నమోదైంది.
మాజీ ఉప ముఖ్యమంత్రి, వైసీపీ మాజీ నేత ఆళ్ల నానిపై చీటింగ్ కేసు నమోదైంది. ఇటీవల ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో వైసీపీ నాయకురాలు నాగమణి గాయపడ్డారు. ఈ నేపథ్యంలో వైద్య ఖర్చులు భరిస్తామని అప్పట్లో ఆళ్ల నాని ఆమెకు హామీ ఇచ్చారని సమాచారం. అలాగే ఆమె కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పినట్టు తెలుస్తోంది. అయితే ఎన్నికల అనంతరం ఎలాంటి సహాయం చేయలేదని నాగమణి కోర్టును ఆశ్రయించారు. ఆళ్ల నాని తనను నమ్మించి మోసం చేశారని పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఆళ్ల నాని సహా ఏడుగురిపై ఏలూరు త్రీటౌన్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ మేరకు కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
వైఎస్ జగన్ మొదటి విడత మంత్రివర్గ విస్తరణలో ఆళ్ల నాని డిప్యూటీ సీఎంగా పదవి దక్కించుకున్నారు. డిప్యూటీ సీఎం హోదాతో ఆయనకు కీలకమైన వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా అవకాశం దక్కింది. కోవిడ్ సమయంలో ఆళ్ల నాని బాగా పనిచేశారనే పేరు తెచ్చుకున్నారు. అయినా జగన్ రెండో విడత మంత్రివర్గ విస్తరణలో ఆళ్ల నానికి పదవి పోయింది. ఆయన స్థానంలో పశ్చిమ గోదావరి జిల్లాకే చెందిన కొట్టు సత్యనారాయణకు డిప్యూటీ సీఎం పదవి దక్కింది.
తొలిసారి ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1999లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన ఆళ్ల నాని 2004లో కాంగ్రెస్ పార్టీ తరఫున తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లోనూ విజయం సాధించారు. 2014లో వైసీపీ తరఫున బరిలోకి దిగి టీడీపీ అభ్యర్థి బడేటి బుజ్జి చేతిలో ఓడిపోయారు. 2019లో మళ్లీ విజయ బావుటా ఎగురవేశారు. మొత్తం మీద మూడుసార్లు ఆళ్ల నాని ఏలూరు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
ఇటీవల 2024 ఎన్నికల్లో ఏలూరు నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. కొద్ది రోజుల క్రితం వైసీపీకి ఆళ్ల నాని రాజీనామా ప్రకటించారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ఇంచార్జి పదవితోపాటు ఏలూరు జిల్లా వైసీపీ అధ్యక్ష పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్లే రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. ప్రత్యక్ష రాజకీయాలను దూరం కానున్నట్టు వెల్లడించారు.
ఈ నేపథ్యంలో తాజాగా ఆళ్ల నానిపై చీటింగ్ కేసు నమోదు కావడం హాట్ టాపిక్ గా మారింది. అది కూడా ఒక మహిళ ఆయనపైన కేసు పెట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నేపథ్యంలో ఆళ్ల నాని ఎలా స్పందిస్తారనేది వేచిచూడాల్సిందే.