వైసీపీ మాజీ మంత్రి కాకానిపై సోషల్ మీడియా కేసు!
అన్ని కోణాల్లోనూ కాకానిని విచారిస్తుండడం గమనార్హం.
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కాకాని గోవర్థన్ రెడ్డిపై ఐటీ యాక్ట్ కింద కేసు నమోదైంది. సోషల్ మీడియాలో కాకాని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ నాయకుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు నమోదు చేశారు. అంతేకాదు.. వెంకటాచలం పోలీసులు సోమవారం కాకానిని స్టేషన్‌కు పిలిపించి విచారిస్తున్నారు. అన్ని కోణాల్లోనూ కాకానిని విచారిస్తుండడం గమనార్హం.
ఏం జరిగింది?
ఏపీలో సోషల్ మీడియా యాక్టివిస్టుల దూకుడుకు కూటమి సర్కారు ముకుతాడు వేస్తోంది. దూషణలతో నిండిపోతున్న సోషల్ మీడియాను సంస్కరించేందుకు నడుం బిగించింది. ఈ క్రమంలో సోషల్ మీడి యాను అడ్డు పెట్టుకుని చెలరేగి పోతున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. స్టేషన్లకు పిలిపించి.. కౌన్సెలింగ్ ఇస్తున్నారు. అదేసమయంలో సోషల్ మీడియాలో నిబద్ధతను పాటించాలని పలు రూపాల్లో సూచనలు కూడా చేస్తున్నారు.
ఈ క్రమంలోనే వైసీపీ నేత, నెల్లూరు జిల్లా సర్వేపల్లి మాజీ ఎమ్మెల్యే, వ్యవసాయ శాఖ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు అందింది. సీఎం చంద్రబాబుపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టారని టీడీపీ నాయకుడు ఒకరు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన ఆధారాలను కూడా ఆయన పోలీసులకు ఇచ్చినట్టు తెలిసింది. దీంతో ఆధారాలను సమీక్షించుకున్న పోలీసులు.. కాకానిపై కేసు నమోదు చేశారు. అనంతరం.. ఉన్నతా అధికారుల సూచనల మేరకు స్టేషన్‌కు పిలిపించి విచారిస్తున్నారు. అనంతరం.. కేసు తీవ్రతను బట్టి 41ఏ కింద నోటీసులు జారీ చేయనున్నారు.