మంచు కుటుంబ సభ్యులపై ఎఫ్.ఐ.ఆర్. నమోదు!

దీంతో... మనోజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పది మంది వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Update: 2024-12-10 05:40 GMT

మంచు మోహన్ బాబు కుటుంబంలో తలెత్తిన విభేదాలు ఇప్పుడు పోలీస్ స్టేషన్ వరకూ చేరిన సంగతి తెలిసిందే. గుర్తు తెలియని కొంతమంది దుండగులు తనపై దాడి చేశారని.. తనకు, తన భార్యకు ప్రాణహాని ఉందని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో హీరో మంచు మనోజ్ సోమవారం ఫిర్యాదు చేశారు. దీంతో... ఈ విషయం సంచలనంగా మారింది.

దీంతో... మనోజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పది మంది వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోపక్క అటు మోహన్ బాబు సైతం తనకు తన కుమారుడు మంచు మనోజ్ నుంచి ప్రాణహాని ఉందంటూ లేఖ ద్వారా రాచకొండ కమీషనర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో... మంచు మనోజ్, అతని భార్యపైనా కేసు నమోదైంది!

అవును... మంచు ఫ్యామిలీ వ్యవహారంలో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా.. తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని రాచకొండ కమిషనర్ కు మోహన్ బాబు ఫిర్యాదు చేయగా.. స్పందించిన పోలీసులు మనోజ్, మౌనికలపై ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేశారు! దీంతో... ఈ వ్యవహారం అత్యంత చర్చనీయాంశంగా మారింది.

మరోవైపు తనపైనా, తన భార్యపైనా మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదుపై మంచు మనోజ్ ఎక్స్ వేదికగా స్పందించారు. తనపైనా తన భార్యపైనా చేసిన ఆరోపణలు పూర్తిగా కల్పితమైనవని.. తాము ఎవరిపైనా ఆధారపడకుండా స్వతంత్రంగా బ్రతుకుతున్నామని.. ఆర్థిక సాయం, ఆస్తుల కోసం కుటుంబంపై ఆధారపడలేదని తెలిపారు.

ఇదే సమయంలో... తాను ఎవరిపై ఆధారపడకుండా స్వతంత్రంగా ఉంటూ కెరీర్ నిర్మించుకున్నానని.. ఎనిమిదేళ్లుగా విశ్రాంతి లేకుండా నాన్న, అన్న సినిమాలకు పనిచేశానని.. పాటలకు, ఫైట్లకు, మ్యూజిక్ వీడియోలకు దర్శకత్వం వహించానని.. పలు చిత్రాల్లో హీరోగా చేశానని.. అయితే వీటిలో దేనికీ ఒక్కరూపాయి కూడా తీసుకోలేదని వెల్లడించారు.

అయితే... తన అన్న విష్ణు ఇంకా కుటుంబం నుంచి మద్దతు పొందుతూనే ఉన్నాడని.. తానెప్పుడూ కుటుంబ ఆస్తులను అడగలేదని.. ఎప్పుడైనా ఆస్తులు అడిగినట్లు నిరూపించాలని సవాల్ చేస్తున్నట్లు తెలిపారు. తన వ్యక్తిగత ప్రతిభ ఆధారంగా జీవితాన్ని నిర్మించుకున్నానని.. కుటుంబ ఆస్తులపై ఆధారపడకుండా పిల్లలను పెంచుతున్నందుకు ఎంతో గర్వంగా ఉందని అన్నారు.

ఈ సందర్భంగా... రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, తెలంగాణ డీజీపీని ట్యాగ్ చేస్తూ మూడు పేజీల లేఖను ఎక్స్ లో పోస్ట్ చేశారు మనోజ్. ఈ నేపథ్యంలో మనోజ్ దంపతులపై ఎఫ్.ఐ.ఆర్. నమోదైందని తెలుస్తోంది!

Tags:    

Similar News