లైవ్ లోనే ఆర్‌ఆర్‌ఆర్ కు చిత్రహింసలు!
ఈ క్రమంలో రఘురామకృష్ణరాజును 2021 మే 13న హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్న సీఐడీ పోలీసులు ఏపీకి తీసుకొచ్చి కస్టడీ విధించారు.
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీని విబేధించిన వైసీపీ అసమ్మతి ఎంపీ రఘురామకృష్ణరాజు (ప్రస్తుతం ఉండి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే)ను కస్టడీలో చిత్రహింసలు పెట్టింది నిజమేనని సీఐడీ పోలీసులు ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. 2019లో వైసీపీ తరఫున పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీగా రఘురామకృష్ణరాజు గెలుపొందారు. అయితే ఆ తర్వాత కొంతకాలానికే వైసీపీతో ఆయన విభేదించారు. ఈ క్రమంలో ప్రభుత్వంపైన పలు విమర్శలు చేశారు. దీంతో రఘురామపై నాటి జగన్ ప్రభుత్వం దేశద్రోహం కింద కేసులు పెట్టించింది.
ఈ క్రమంలో రఘురామకృష్ణరాజును 2021 మే 13న హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్న సీఐడీ పోలీసులు ఏపీకి తీసుకొచ్చి కస్టడీ విధించారు. ఈ క్రమంలో సీఐడీ పోలీసులు వీడియో కాల్ లైవ్ లో ఉంచి కస్టడీలో ఆయనను చితకబాదారు. ఈ వీడియోను నాటి సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ కు చూపారన్న విమర్శలున్నాయి. స్వయంగా రఘురామ ఈ ఆరోపణలు చేశారు. కస్టడీలో తనను కొడుతున్న వీడియోను వీడియో కాల్ ద్వారా జగన్ కు చూపించారని ఆర్‌ఆర్‌ఆర్ అభియోగాలు మోపారు.
ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాడు తనను చిత్రహింసలు పెట్టినవారిపై రఘురామ జూలై 11న గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే తనకు కస్టడీలో గాయాలైనా అవ్వలేదని తప్పుడు నివేదిక ఇచ్చారంటూ నాటి గుంటూరు ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ ప్రభావతి పైనా ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలో గుంటూరు పోలీసులు... మాజీ సీఎం జగన్, అప్పటి సీఐడీ విభాగాధిపతి సునీల్‌కుమార్, నిఘా విభాగాధిపతి సీతారామాంజనేయులు, దర్యాప్తు అధికారి విజయపాల్, అప్పటి జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ నీలం ప్రభావతిపై కేసులు నమోదు చేశారు.
ఈ నేపథ్యంలో ఈ కేసును విచారించిన పోలీసులు నాటి సీఐడీ అధిపతి సునీల్ కుమార్ పాత్రను నిర్ధారించారని తెలుస్తోంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే రఘురామను కొడుతూ వీడియోకాల్ లో నాడు సీఐడీ బాస్ గా ఉన్న సునీల్ కుమార్ కు చూపించామని.. అప్పట్లో సీఐడీలో విధులు నిర్వహించిన సీఐ, ఎస్సై, సిబ్బందీ పోలీసులకు తాజాగా వాంగ్మూలం ఇచ్చినట్టు సమాచారం.
అంతేకాకుండా కొట్టడం అలా కాదంటూ సునీల్ కుమార్ వీడియో కాల్ కట్ చేసి.. తన సిబ్బందితో నేరుగా రఘురామను నిర్బంధించిన గదిలోకి వచ్చి స్వయంగా దగ్గరుండి ఆయనను కొట్టించారని పోలీసుల విచారణలో తెలిపారని తెలుస్తోంది. ఈ వ్యవహారంలో గుంటూరు పోలీసులు పక్కాగా సాక్ష్యాధారాలు సేకరించినట్టు చెబుతున్నారు. అంతేకాకుండా నాటి సీఐడీ బాస్.. సునీల్ కుమార్ ఆ సమయంలో రఘురామ వద్దే ఉన్నట్టు సునీల్ కుమార్ సెల్ ఫోన్ లొకేషన్ కూడా తీసుకున్నారని తెలుస్తోంది. దీంతో నాడు రఘురామను కొట్టినవారిపై ఉచ్చు బిగుస్తోంది.