పిఠాపురంలో రగడ.. పవన్ సైలెంట్ .. !
ఇక్కడ బరులు వేసేందుకు టీడీపీ, జనసేన నాయకులు పోటీ పడుతున్నారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో కోడి పందేల బరుల వ్యవహారం ముదిరిపాకాన పడినట్టు కనిపిస్తోంది. దీనికి సంబంధించిన రాజకీయం హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్నట్టు సమాచారం. ఇక్కడ బరులు వేసేందుకు టీడీపీ, జనసేన నాయకులు పోటీ పడుతున్నారు. ఈ విషయంలో వెనక్కి తగ్గేదేలేదని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ చెబుతున్నారు.ఇటీవల ఆయన పందేలను కూడా ప్రారంభించారు.
ఇక, సంక్రాంతి పండుగకు మరో మూడు రోజులు మాత్రమే ఉండడంతో బరులు మరిన్ని పెరుగుతున్నా యి. మరోవైపు.. తాను ఈ కోడిపందేలకు వ్యతిరేకమని.. పవన్ చెబుతున్నారు. గతంలోనూ ఆయన ఏవగించుకున్నారు. తద్వారా.. సొమ్ములు పోతున్నాయని.. యువత చెడు మార్గంలో పయనిస్తున్నారని కూడా ఆయన అంటున్నారు. అయితే.. ఇప్పుడు ఆయనే ఎమ్మెల్యే కావడంతోపాటు.. సమస్య ఆయన నియోజకవర్గంలోనే తిష్ఠ వేసింది. దీంతో ఇప్పుడు ఆయన ఏం చేస్తారో చూడాలి.
ఇదిలావుంటే.. బరుల విషయంలో జనసేన నాయకులు,.. టీడీపీ నాయకులు చీలి పోయారన్నది స్పష్టం గా కనిపిస్తోంది. జనసేన నేతలు వేసే బరులకు హైదరాబాద్ నుంచి ఓ కీలక నాయకుడు చక్రం తిప్పుతు న్నారన్నది పిఠాపురం టాక్. ఆయనకు ప్రభుత్వ పరంగా కూడా మంచి మద్దతు ఉందని అంటున్నారు. ఇక, వర్మ కూడా ఈ బరులను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తన నియోజకవర్గంలో తనకు ఎదురు లేదని అంటున్నారు. కానీ.. చిత్రం ఏంటంటే.. వర్మ అనుచర వర్గానికి చెందిన బరులను పోలీసులు ఇటీవల ధ్వంసం చేశారు.
దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో భారీ ఎత్తున వేసిన బరిని ఓ సీఐ స్తాయి పోలీసు తొలగించేశారు. రాత్రికి రాత్రి జరిగిన ఈ ఘటన గత రెండు రోజులుగా రాజకీయంగా ఇరకాటంలో పడేసింది. ఈ క్రమంలో వర్మ ఏదో ఒకటి తేల్చుకుంటామని చెబుతున్నారు. అయితే.. ఇవన్నీ.. అంతర్గతంగానే సాగుతున్నాయి. ఎక్కడా ఎవరూ ముందుకు పడడం లేదు. సో.. తెరవెనుక గోప్యంగా ఉన్నా.. బరుల వ్యవహారంలో జరుగుతున్న రాజకీయంపై పవన్ కూడా మౌనంగానే ఉండడం గమనార్హం. మరి సంక్రాంతి నాటికి సర్దుకు పోతారో లేదో చూడాలి.