గడప దాటొద్దు..కడప ప్రజలకు పోలీసులు హుకుం

మరో 24 గంటల్లో దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడబోతున్న సంగతి తెలిసిందే.;

Update: 2024-06-03 09:35 GMT
గడప దాటొద్దు..కడప ప్రజలకు పోలీసులు హుకుం
  • whatsapp icon

మరో 24 గంటల్లో దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఏపీలో కూడా వైసీపీ, ఎన్డీఏ కూటమిల మధ్య అధికారం ఎవరికి దక్కుతుంది అన్న సందిగ్ధత కొనసాగుతోంది. ఈ క్రమంలోనే కౌంటింగ్ నేపథ్యంలో ఇరు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, నేతలు సొంత నియోజకవర్గాలకు చేరుకుంటున్నారు. అయితే పోలింగ్ నాడు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో పోలీసులు కౌంటింగ్ కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో పాటు కఠిన నిబంధనలు విధించారు.

జమ్మలమడుగులో జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో వైఎస్ఆర్ జిల్లా పోలీస్ శాఖ చర్యలు తీసుకుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని కొద్ది రోజులు పాటు హైదరాబాదులో ఉండాలని సూచించిన పోలీసులు...కడప కూటమి అభ్యర్థులు ఆదినారాయణ రెడ్డి, భూపేష్ రెడ్డిలను తమ స్వగ్రామంలోనే ఉండాల్సిందిగా సూచించారు. జమ్మలమడుగులో పోలింగ్ తర్వాత వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య భౌతిక దాడులు జరగడంతో అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు.

ఈ క్రమంలోనే కౌంటింగ్ తర్వాత కూడా ఎక్కడ ఎటువంటి అల్లర్లు జరగకుండా పోలీస్ అధికారులు ముందస్తు చర్యలకు దిగారు. అవసరమైతే తప్ప గడప దాటుద్దని ప్రజలకు పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. పలు సమస్యాత్మక ప్రాంతాలలో 144 సెక్షన్ విధించి అప్రకటిత కర్ఫ్యూ కొనసాగిస్తున్నారు. అనవసరంగా ఇళ్ళ నుంచి బయటకు వచ్చి గొడవలకు పాల్పడే వారిపై రౌడీషీట్ ఓపెన్ చేస్తామని, కఠిన చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఆల్రెడీ 21 మంది రౌడీ షీటర్లపై జిల్లా బహిష్కరణ వేటు వేశామని పోలీసులు చెప్పారు. ఇళ్లలోనే ఉండాలని ప్రజలకు పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఏదేమైనా మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్రంలోని పలు జిల్లాలలో కౌంటింగ్ సందర్భంగా అప్రకటిక కర్ఫ్యూ వాతావరణం ఏర్పడడం చర్చినీయాంశమైంది.

Tags:    

Similar News